న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ కంటే.. అది సోకుతుందనే భయమే దేశంలో ఎక్కువ ప్రాణాలను బలితీసుకునేలా ఉందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మహమ్మారి గురించి అవాస్తవాలు ప్రచారం చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ఓ చానెల్‌ను ప్రారంభించి.. కరోనా వార్తలను నేరుగా ప్రజలకు చేరవేయాలని సూచించింది. అప్పుడే నకిలీ వార్తల ప్రవాహాన్ని అడ్డుకోగలుగుతామని అభిప్రాయపడింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వలసకూలీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతరత్రా అంశాల గురించి ప్రభుత్వం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి వివరాలు సమర్పించారు.(కరోనా సంక్షోభం: విద్యుత్ టారిఫ్‌లు తగ్గింపు!)
ఈ నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘‘వైరస్ కంటే ఎక్కువగా భయమే ప్రజలను చంపేలా కనిపిస్తోంది. కౌన్సిలర్ల అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు భజనలు, కీర్తనలు, నమాజ్ ఇంకా ఇతర మత ప్రార్థనలు, మత బోధకులతో ప్రజల మత విశ్వాసాలకు అనుసరించి వారిలో అవగాహన కల్పించండి’’అని సీజేఐ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇందుకు స్పందించిన సాలిసిటర్ జనరల్.. 24 గంటల్లోగా.. శిక్షణ పొందిన కౌన్సిలర్లు, మౌలీలు, సాధువులను వలస కూలీల వద్దకు పంపించి వారిలో ఆత్మవిశ్వాసం నెలకొనేలా చేస్తామని సమాధానం ఇచ్చారు. గ్రామాల్లో కరోనా భయం తక్కువగానే ఉందని.. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలసదారులతో తమకు అంటువ్యాధి సోకుతుందని ప్రజలు భయపడుతున్నారన్నారు. అందుకే రహదారుల మీద పరిస్థితిని వాలంటీర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని.. వలసజీవుల కోసం తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో సమన్వయం చేసుకుంటూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కరోనా పరీక్షల నిమిత్తం ల్యాబ్‌ల సంఖ్యను 15,000కు పెంచామని పేర్కొన్నారు. కాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూం వివరాల ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం కలిపి 21,064 పునరావాస క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment