సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో మొట్టమొదటి ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) 1979లో దాఖలు చేసి సంచలన తీర్పునకు కారణమైన పుష్ప కపిల హింగోరాణి చిత్తరువును సుప్రీం కోర్టులోని ఓ గ్రంధాలయంలో ఏర్పాటు చేయాలని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించింది. బిహార్ జైల్లో ఎలాంటి విచారణ లేకుండా నిందితులు ఏళ్ల తరబడి జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారన్న వార్తలకు స్పందించిన ఆమె బాధితుల తరఫున ‘హెబియస్ కార్పస్ పిటిషన్’ను తన భర్తతో కలిసి సుప్రీం కోర్టులో దాఖలు చేసింది.
అప్పటి వరకు నిందితులు లేదా వారి బంధువులకు మాత్రమే పిల్‌ను దాఖలు చేసే హక్కు ఉండడంతో ఆ స్థానంలో బాధితులు కనిపించకుండా పోయినప్పుడు దాఖలు చేసే హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఆమె దాఖలు చేసి వాదించారు. దాన్ని సుప్రీం కోర్టు తొలి ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి తీర్పు చెప్పింది. ఆ తీర్పు కారణంగా ఒక్క బిహార్‌తోపాటు దేశవ్యాప్తంగా జైళ్లల్లో అన్యాయంగా మగ్గుతున్న 40 వేల మంది బాధితులు విడుదయ్యారు. ఈ కేసు హుస్సేనారా ఖటూన్ కేసుగా కూడా ప్రసిద్ధి చెందింది. అప్పుడు జైలు నుంచి విడుదలైన ఆరుగురు మహిళల్లో ఆమె ఒకరు. అప్పటి నుంచే పుష్ప కపిలి హింగోరాణిని ‘మదర్ ఆఫ్ పిల్స్’గా పిలుస్తూ వచ్చారు.
ఆమే తన 60 ఏళ్ల వత్తి జీవితంలో దాదాపు 100 కేసులను వాదించారు. వాటిలో ఎక్కువగా పోలీసుల చేతుల్లో చిత్రహింసలకు గురైన వారికి, వరకట్నం కేసుల్లో బలవుతున్న అమ్మాయిలకు సంబంధించి, మహిళలపై కొనసాగుతున్న లింగ వివక్షతకు సంబంధించిన కేసులో ఎక్కువే ఉన్నాయి. వాటిలో దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన ‘భాగల్పూర్ బ్లైండర్స్’ కేసు కూడా ఉంది. 33 మంది నేరస్థుల కళ్లలో సూదులు గుచ్చి, యాసిడ్ పోసి వారిని గుడ్డివాళ్లుగా పోలీసులు చేసిన కేసది. ఆమె పోలీసులకు కఠిన శిక్షలు విధించేలా చేయడమే కాకుండా, బాధితులకు జీవితాంతం ఉపాధి భృతి లభించేలా చేశారు.
వరకట్నం కేసులను పుష్ప కపిల వాదించడం వల్లనే మహిళకు సంబంధించిన నేరాలను విచారించేందుకు ప్రత్యేక మహిళా పోలీసు స్టేషన్లు ఉండాలనే వాదన ముందుకు వచ్చి ఆ మేరకు సుప్రీం కోర్టు తగిన ఆదేశాలు జారీ చేసింది. ఆమె వాదన కారణంగానే బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు 1987లో ఓ చట్టం వచ్చింది. ఆమె ముగ్గురు పిల్లలు అమన్, ప్రియా, శ్వేతలు కూడా న్యాయవాదులుగానే జీవితంలో స్థిరపడ్డారు.
1927, డెసెంబర్ 27వ తేదీన కెన్యాలోని నైరోబిలో భారత సంతతికి పుట్టిన ఆమె లండన్‌లోని కార్డిఫ్ యూనివర్శిటీ కాలేజీలో ఇంగ్లీషు, ఎకనామిక్స్, హిస్టరీలో డిగ్రీచేసి ఆ తర్వాత అదే యూనివర్శిటీలో లా చదివారు. భారత్‌కు వచ్చి లాయర్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 2013, డిసెంబర్ 31న 86 ఏళ్ల వయస్సులో మరణించారు. సుప్రీం కోర్టు రెండవ గ్రంధాలయంలో ప్రముఖ న్యాయ నిపుణులు ఎంసీ సెతల్వాద్, సీకే తఫ్త్రీ, ఆర్కే జైన్‌ల పక్కన పుష్ప కపిల చిత్తరువును వేలాడతీయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment