సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా సెన్సేషన్, కేరళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా తెలంగాణ, మహారాష్ట్రల్లో నమోదైన కేసులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన మలయాళ సినిమా ‘ఒరు ఆదార్ లవ్’ లోని పాటపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోలీస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో దేశంలో ఎక్కడా కూడా నటి ప్రియపై, సినిమా దర్శక, నిర్మాతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల విషయంలో క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలంటూ ప్రియా ప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ స్టే విధించింది.
కాగా ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సినిమాలో పాట చిత్రీకరణ జరిగిందని, ప్రియా ప్రకాశ్‌తోపాటు చిత్ర దర్శక, నిర్మాతలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫరూక్ నగర్‌కు చెందిన కొంత మంది యువకులు ఫలక్‌నుమా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలోనూ ఇదేవిధంగా కేసు నమోదైంది. ఈ మూవీలోని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. ఒక్క ‘కంటిసైగ’ వీడియోతో ప్రియా ప్రకాశ్ వారియర్ ఇటీవల ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా, సోషల్ మీడియా స్టార్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాలోని 'మాణిక్య మలరాయ పూవి' పాటలో ఆమె కన్నుగీటే సన్నివేశాలు సంచలనంగా మారి.. ప్రేమికులరోజు సందర్భంగా దేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment