జయకు చెక్ పెడుతున్న కర్నాటక
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. జయ అక్రమాస్తుల కేసులో కర్నాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన ఉన్నత న్యాయస్థానం దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా, కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా ఆమెకు ఆదేశాలు జారీ చేసింది.
ఆదాయానికి మించి అక్రమ ఆస్తుల కేసులో జయలలితను కర్ణాటక హైకోర్టు పొరపాటున నిర్దోషిగా తేల్చిందని ఆరోపించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే. జయలలిత కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పులో తమకు అనుమానాలు ఉన్నాయంటూ అప్పీలుకు వెళ్లింది. జయలలిత అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఆమెను దోషిగా ప్రకటించాలని సుప్రీంకోర్టుకు కర్ణాటక విన్నవించింది.
1991-96 మధ్య జయలలిత సీఎంగా ఉన్నప్పుడు రూ.66 కోట్ల మేర అక్రమాస్తులు సంపాదించినట్లు 1997లో డీఎంకే ప్రభుత్వం కేసు పెట్టింది. ఈ కేసు అనేక మలుపులు తర్వాత కేసును కర్నాటక స్పెషల్ కోర్టుకు బదిలీ చేశారు. అయితే జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించిన స్పెషల్ కోర్టు తీర్పును కర్నాటక హైకోర్టు కొట్టివేసింది.
దీంతో దాదాపు ఎనిమిది నెలల జైలు శిక్ష తర్వాత జయలలిత నిర్దోషిగా బయటపడి తమిళనాడు సీఎం పదవిని చేపట్టారు. అనంతరం జరిగిన ఉపఎన్నికలో ఆమె ఆర్కేనగర్ నియోజకవర్గంనుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో జయ విడుదలకు వ్యతిరేకంగా కర్నాటక ప్రభుత్వం సుప్రీంలో అప్పీలు చేసింది.