రోజా సస్పెన్షన్ వివాదానికి ముగింపు పలకండి
న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెండు చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో అహానికి పోకుండా అర్థవంతమైన చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. తన సస్పెన్షన్ను సవాలు చేస్తూ రోజా దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో గురువారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. వాదనల అనంతరం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మధ్యేమార్గంగా కేసుకు తెర దించాలని సూచించింది. అంతా కలిసి రాష్ట్రాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొంది.
శుక్రవారం ఉదయం ఈ కేసు విచారణకు రాగా రోజా తరఫున న్యాయవాది ఇందిరా జైసింగ్ తన వాదనలు వినిపిస్తూ, 340 నిబంధన కింద మిగతా సమావేశాల వరకు మాత్రమే సస్పెండు చేయగలరని, ఏడాది పాటు సస్పెండు చేసే అధికారం సభకు లేదని చెప్పారు. ఆ విషయంలో పొరపాటు జరిగిందంటున్నారని, ఏదైనప్పటికీ సభలో నియమ నిబంధనల ప్రకారం జరగలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా అనేక తీర్పులను ఆమె ఉదహరించారు. కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా అసెంబ్లీలో కల్పించలేదని గుర్తుచేశారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాదనలు కొనసాగాయి.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపించే దశలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అహానికి వెళ్లకుండా ఇరుపక్షాలు అర్థవంతమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ విషయంలో మీరిచ్చే సలహా ఏంటో చెప్పాలని సుప్రీంకోర్టు ఆ న్యాయవాదిని కోరింది. రోజా చేసిన వ్యాఖ్యలపై ఆమె ఉద్దేశమేంటో తెలియజేస్తూ రెండు వాక్యాల్లో లేఖ రాస్తారని, ఆ లేఖతో వివాదానికి తెరదించాలని సుప్రీంకోర్టు సూచించింది.
పైగా ఇది మా సలహా మాత్రమేనని ప్రస్తుతం న్యాయ సమీక్షలోకి తాము వెళ్లడం లేదని పేర్కొంది. లేఖ రాసే విషయంలో పిటిషనర్కు పూర్తి స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం తప్ప న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థలు కాదని, శాసనసభ ప్రజల సభ వ్యక్తుల సభకాదన్న విషయం గమనంలోకి తీసుకోవాలి. శాసనసభకు విశాల ప్రయోజనాలే లక్ష్యం కావాలని అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు అభిప్రాయంపై రోజా తరఫున న్యాయవాది ఇందిరాజైసింగ్ మాట్లాడుతూ, టీడీపీ ఎమ్మెల్యే అనిత, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వ్యవహారాల్లో ఇప్పటికే కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ దశలో ప్రభుత్వం తరఫున న్యాయవాది జోక్యం చేసుకుని రోజా క్షమాపణ చెప్పాలన్నారు.
అప్పుడు కోర్టు కల్పించుకుని రోజా తన ఉద్దేశమేంటో రెండు వాక్యాల్లో లేఖ రాస్తారని, దాంతో ముగించాలని కోర్టు అభిప్రాయపడింది. దానికి స్పీకర్కు న్యాయ సలహా ఇచ్చి ఒప్పిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది పీపీ రావు కోర్టుకు నివేదించారు. ఈ వ్యవహారంలో వివరణ ఇచ్చేందుకు పిటిషనర్ సిద్ధంగా ఉన్నారని రోజా తరఫున న్యాయవాది తెలిపారు. అయితే లేఖ రాసే విషయంపై తాము పిటిషనర్ తో చర్చించి శుక్రవారం నివేదిస్తామని చెప్పడంతో కేసును సుప్రీంకోర్టు శనివారానికి వాయిదా వేసింది.
మరోవైపు తనపై మోపిన మూడు అంశాలను పరిష్కరిస్తానంటే వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా. అసలు వివరణ ఇచ్చేందుకు సభలో తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. సభను, సీఎంను అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు.