ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదురీ తన సస్పెన్షన్ వేటుపై ఏం చేయబోతున్నారు. ప్రధాని మోదీపై వ్యాఖ్యలకు పశ్చాత్తాపం చెందుతున్నారా?. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అంతేకాదు.. వేటు విషయంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరునూ ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
నాపై వేటు అధికార పార్టీ తిరోగమనంగా చెప్పొచ్చు. నన్ను ఉరి తీసి.. ఆపై విచారణ జరిపినట్లు విచిత్రంగా ఉంది వాళ్ల తీరు. నాతోపాటు నలుగురు ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం.. కొత్త దృగ్విషయం. నా పార్లమెంట్ అనుభవంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదు. విపక్షాల గొంతు నొక్కేందుకు అధికార పక్షం ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్నిందనే విషయం నాపై వేటు ద్వారా స్పష్టమవుతోందని అన్నారాయన.
న్యాయస్థానాల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందంటే.. తప్పకుండా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తా, సస్పెన్షన్ వేటుపై సుప్రీం కోర్టుకు వెళ్లే అంశమూ పరిశీలనలో ఉంది అని అధిర్ రంజన్ చౌదురీ స్పష్టం చేశారు.
ఇక ప్రధానిని అవమానించారనే అభియోగం మీదే ఆయనపై వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘నీరవ్’ (నీరవ్ మోదీ అని బీజేపీ ఆరోపణ) ప్రస్తావన తాను సందర్భోచితంగానే తెచ్చానని, మణిపూర్ అంశంపై మోదీ నీరవ్(మౌనంగా) ఉన్నారనే ఉద్దేశంతోనే తాను మాట్లాడనని, అంతేగానీ అవమానించే ఉద్దేశం తనకు లేదని అధిర్ రంజన్ తెలిపారు.
పశ్చిమ బెంగాల్ బహరంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అయిన అధిర్ రంజన్ చౌదురీ.. గురువారం లోక్‌సభ నుంచి సస్పెండ్ అయ్యారు. పదే పదే సభకు అంతరాయం కలిగించడం.. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న వేళ ప్రసంగాలకు అవాంతరం కలిగించారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. అంతేకాదు ప్రధాని మోదీని అవమానించేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు నమోదు అయ్యింది. నీరవ్ మోదీ ప్రస్తావన తేవడంతో పాటు ప్రధాని మోదీని దృతరాష్ట్రుడితో పోల్చడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. (దృతరాష్ట్రుడు అంధుడు కాబట్టే.. ద్రౌపది పరాభవం పాలైంది. ఇవాళ ఇక్కడ రాజు కళ్లున్న కబోదిలా కూర్చున్నాడు. హస్తినాపురానికి, మణిపూర్‌కి పెద్దగా తేడా లేకుండా పోయింది అని అధిర్ రంజన్ చౌదురీ వ్యాఖ్యానించారు).
అయితే బీజేపీ వెంటనే స్పందించింది. ప్రధానిపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని.. ఈ అభ్యంతరకర వ్యాఖ్యల్ని రికార్డుల్లోంచి తొలగించడంతో పాటు అధిర్ రంజన్ చేత క్షమాపణలు చెప్పించాలని స్పీకర్‌ను బీజేపీ కోరింది. ఈలోపే ఆయన్ని సస్పెండ్ చేయాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం చేయగా.. మూజువాణి ఓటుతో అది పాస్ అయ్యింది.
అధిర్ రంజన్ చౌదురీపై వేటు పడడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని మండిపడుతోంది. అధిర్‌పై వేటేసిన స్పీకర్ ఈ కేసును ప్రివిలేజెస్ కమిటీకి దర్యాప్తు కోసం పంపారు. అది తేలేదాకా ఆయన లోక్‌సభలో అడుగుపెట్టడానికి వీల్లేదు.
#WATCH | Congress leader Adhir Ranjan Chowdhury on his suspension from Lok Sabha
— ANI (@ANI) August 12, 2023
"This is a new phenomenon we have never before experienced in our career in Parliament...This is a deliberate design by the ruling party to throttle the voice of the opposition...This will undermine… pic.twitter.com/Um5kvbHH7p
ఇదీ చదవండి: మణిపూర్‌లో సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి!
Comments
Please login to add a commentAdd a comment