న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కేసు విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఇరుపక్షాలు పరస్పరం సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కారం చేసుకోవాలని ఈ సందర్భంగా న్యాయస్థానం సూచించింది. 'శాసనసభ వ్యవహారాల్లో న్యాయవ్యవస్థ జోక్యం సీరియస్ అంశం. మీరే ఒక అవగాహనకు వస్తే బాగుంటుంది.
అనుభవలేమి, అపార్థాల వల్లే ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఇరుపక్షాలు ఉద్వేగాలు వచ్చినప్పుడు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శాసనసభ ప్రజల సభ, వ్యక్తుల సభ కాదు. శాసనసభకు విశాల ప్రయోజనాలే లక్ష్యం కావాలి.' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది. మరోవైపు రోజా తరఫు న్యాయవాది నాలుగు గంటలపాటు తన వాదనలు వినిపించారు.