ఇద్దరు విద్యార్థుల లొంగుబాటు
అర్ధరాత్రి లొంగిపోయిన ‘జేఎన్‌యూ’ ఉమర్, అనిర్బన్
♦ అంతకుముందు లొంగిపోవటానికి సిద్ధమని హైకోర్టులో పిటిషన్
♦ భద్రత లేకనే అజ్ఞాతంలోకి.. పోలీసు విచారణకు సిద్ధం: విద్యార్థులు
న్యూఢిల్లీ: కన్హయ్యకుమార్‌తో పాటు దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థులు ఉమర్‌ఖలీద్, అనిర్బన్‌భట్టాచార్య.. మంగళవారం రోజంతా వేగంగా సాగిన పరిణామాల అనంతరం అర్థరాత్రి సమయంలో పోలీసులకు లొంగిపోయారు. అంతకుముందు తాము పోలీసులకు లొంగిపోతామని, కానీ తమ ప్రాణాలకు ముప్పు ఉందని, లొంగిపోయేటపుడు పోలీసు భద్రత కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో వారిద్దరూ పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు.. పిటిషనర్లు తాము లొంగిపోవాలనుకుంటున్న తేదీ, సమయం, ప్రాంతాలను రహస్యంగా కోర్టుకు అందించాలని వారి తరఫు న్యాయవాది కామినిజైశ్వాల్‌కు సూచించింది. అయితే.. వారు లొంగిపోవటానికి ప్రతిపాదించిన ప్రాంతం పోలీసులకు అందుబాటులో లేదని డీసీపీ (దక్షిణం) ప్రేమ్‌నాథ్ నిరాకరించారు. దీంతో పిటిషనర్ల తరఫు న్యాయవాది, డీసీపీతో న్యాయమూర్తి పది నిమిషాల పాటు తన చాంబర్‌లో ఆంతరంగికంగా చర్చించారు. అనంతరం ఈ అంశాన్ని బుధవారానికి వాయిదా వేశారు. అయితే.. అనూహ్యంగా మంగళవారం అర్థరాత్రి సమయంలో ఉమర్‌ఖలీద్, అనిర్బన్‌లు.. రహస్య ప్రాంతంలో పోలీసులకు లొంగిపోయారు. వెంటనే పోలీసులు వారిని గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. ఇద్దరినీ బుధవారం ఉదయం ఢిల్లీ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
పోలీసు విచారణకు సిద్ధం: విద్యార్థులు
దేశద్రోహం కేసులో కన్హయ్యకుమార్‌తో పాటు నిందితులుగా పేర్లు నమోదు చేసిన జేఎన్‌యూ విద్యార్థుల్లో ఉమర్‌ఖలీద్, అన్బిరన్ భట్టాచార్య, అశుతోశ్‌కుమార్, రామనాగ, అనంత్‌ప్రకాశ్ నారాయణ్‌లు.. ఈ నెల 12వ తేదీ రాత్రి కన్హయ్య అరెస్ట్ తరువాత కనిపించకుండా పోవటం తెలిసిందే. వారు ఆదివారం రాత్రి వర్సిటీ క్యాంపస్‌కు తిరిగి రావటం.. సమాచారం అందుకుని వారిని అరెస్ట్ చేయటం కోసం పోలీసులు వర్సిటీ వద్దకు రావటం.. లోనికి ప్రవేశించేందుకు వీసీ అనుమతి కోరుతూ నిరీక్షిస్తుండటం విదితమే.
వారిలో ఇద్దరు విద్యార్థులు లొంగిపోవటానికి ముందు జేఎన్‌ఎస్‌యూ ప్రధాన కార్యదర్శి రామానాగా వర్సిటీలో మీడియాతో మాట్లాడారు. తాము దాచిపెట్టటానికి ఏమీ లేదని, పోలీసుల విచారణకు సిద్ధమని స్పష్టంచేశారు. తాము కేవలం భద్రతా కారణాల రీత్యానే కనిపించకుండా వెళ్లామని.. కన్హయ్యపై జరిగిన రీతిలోనే తమపైనా దాడి జరుగుతుందని ఆందోళన చెందామని చెప్పారు. వర్సిటీలో సాధారణ పరిస్థితి నెలకొన్న నేపధ్యంలో తిరిగివచ్చామన్నారు. వర్సిటీ యాజమాన్యంపై విశ్వాసం లేదని, వర్సిటీ విచారణ కమిటీ ఎదుట హాజరుకాబోమని చెప్పారు.