నినాదాల వీడియో లేదు! | No video of Slogans! | Sakshi
Sakshi News home page

నినాదాల వీడియో లేదు!

Published Tue, Mar 1 2016 12:33 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

నినాదాల వీడియో లేదు! - Sakshi

నినాదాల వీడియో లేదు!

కన్హయ్య దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లుగా వీడియో సాక్ష్యం లేదన్న ఢిల్లీ పోలీస్
 
 న్యూఢిల్లీ: ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా జేఎన్‌యూలో జరిగిన వివాదాస్పద కార్యక్రమంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లుగా ఎలాంటి వీడియో రుజువులూ  లేవని ఢిల్లీ పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేశారు. రాజద్రోహం కేసుకు సంబంధించి కన్హయ్య దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా, జేఎన్‌యూలో వివాదాస్పద కార్యక్రమం జరుగుతున్న సమయంలో సివిల్ దుస్తుల్లో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ కార్యక్రమాన్ని ఎందుకు వీడియో తీయలేదని, దేశ వ్యతిరేక నినాదాలు చేసినవారిపై అప్పుడే చర్యలు ఎందుకు తీసుకోలేదని, ఆ రోజే(ఫిబ్రవరి 9న) కేసు ఎందుకు నమోదు చేయలేదని న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభారాణి ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాపై ప్రశ్నల వర్షం కురిపించారు.

జేఎన్‌యూ అధికారి తీసిన ఒక వీడియో ఉందని, అందులో కన్హయ్య ఉన్నాడు కానీ నినాదాలు చేసిన దృశ్యాలేవీ లేవని మెహతా వివరించారు. ఆ వీడియో ఉన్న మొబైల్‌ను స్వాధీనం చేసుకోకపోవడం, ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కార్యక్రమంలో పాల్గొనడం వేరు.. దేశ వ్యతిరేక నినాదాలు చేయడం వేరు’ అని వ్యాఖ్యానించారు. ఆ కార్యక్రమానికి అనుమతి తీసుకుంది కన్హయ్య కాదని, సంబంధిత పోస్టర్లపై కూడా ఆయన పేరు లేదని కన్హయ్య తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వివరించారు. దాంతో, కన్హయ్య దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లుగా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ఉందని మెహతా తెలిపారు.

ఢిల్లీ పోలీస్, ఐబీ చేసిన సంయుక్త విచారణకు కన్హయ్య సహకరించలేదని, పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశాడని చెప్పారు. జేఎన్‌యూ తరహా ఘటనలు జాదవపూర్ యూనివర్సిటీలోనూ జరిగాయని, కన్హయ్యకు బెయిల్ ఇస్తే.. అలాంటివారిని ప్రోత్సహించినట్లవుతుందని వాదించారు. చివరకు, బెయిల్ పిటిషన్‌పై తీర్పును జస్టిస్ ప్రతిభ బుధవారానికి వాయిదా వేశారు. కాగా, కన్హయ్య బెయిల్ పిటిషన్‌పై కూడా కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చెరో దారిన వ్యవహరించాయి. కన్హయ్యకు బెయిల్ ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం కోర్టును అభ్యర్థించగా, కేంద్రం తరఫున ఢిల్లీ పోలీసులు బెయిల్ ఇవ్వవద్దంటూ కోరారు.

మరోవైపు, అఫ్జల్ గురుకు మరణశిక్ష విధించడాన్ని ‘చట్టబద్ధమైన హత్య’(జ్యుడీషియల్ కిల్లింగ్) అంటూ నినాదాలు చేయటాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్య తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను విచారించే ముందు అటార్నీజనరల్ ముకుల్ రోహత్గీ అభిప్రాయాన్ని తీసుకోవాలని సుప్రీం కోర్టు సోమవారం సలహా ఇచ్చింది. కాగా, దేశవ్యతిరేక నినాదాలు చేశారంటూ దాఖలైన కేసులో ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యల పోలీసు కస్టడీని ఢిల్లీ కోర్టు సోమవారం ఒకరోజు పొడిగించింది. జేఎన్‌యూ కొత్త రెక్టార్‌గా స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న చింతామణి మహాపాత్రను నియమించారు.
 జర్నలిస్టులకు నోటీసులు.. పటియాలా హౌజ్ కోర్టులో కన్హయ్యను హాజరుపరుస్తున్న సమయంలో హింస చోటు చేసుకున్న సందర్భంగా అక్కడే విధుల్లో ఉన్న 9 మంది జర్నలిస్టులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 15న జరిగిన ఆ ఘటనకు సంబంధించి తమవద్ద ఉన్న అన్ని రుజువులతో వచ్చి దర్యాప్తుకు సహకరించాలన్నారు.  
 
 
 టాగూర్‌నూ జైల్లో వేసేవారు..
 జాతీయవాద ఆరాధనను విమర్శిస్తూ విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ కూడా చాలా వ్యాఖ్యలు చేశారని జేఎన్‌యూ ప్రొఫెసర్ రణబీర్ చక్రవర్తి తెలిపారు. మృతులనూ తీసుకువచ్చి జైల్లో వేసే అవకాశముంటే.. ఈ పాలకులు ఆయనను కూడా తీసుకువచ్చేవారన్నారు. జేఎన్‌యూ ఆడిటోరియంలో జాతీయవాదంపై విద్యార్థులకు రణవీర్ పాఠం చెప్పారు.  కాగా, కన్హయ్య అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ జేఎన్‌యూలో నిరసనలు జరుపుతున్న విద్యార్థులకు అక్కడి జిరాక్స్ షాప్స్ వారు సహకరించడం లేదు. పోస్టర్లను ఫొటోకాపీ తీసేందుకు వారు తిరస్కరిస్తున్నారని, అధికారుల ప్రోద్బలంతోనే చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. నిరసనలకు నేతృత్వం వహిస్తున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలు షెహ్లా రషీద్ ను దూషిస్తూ, చంపేస్తామని బెదిరిస్తూ మరో లేఖ వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement