విచారణకు హాజరైన అయిషీ ఘోష్
న్యూఢిల్లీ: ఈనెల 5వ తేదీన జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీ(జేఎన్‌యూ)లో హింసాత్మక ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సోమవారం విద్యార్థి సంఘం నేత అయిషీ ఘోష్ సహా ముగ్గురిని ప్రశ్నించారు. పోలీసులు గుర్తించిన 9 మంది నిందితుల్లో ఏబీవీపీకి చెందిన ఇద్దరితోపాటు ఆయిషీ ఘోష్ ఉన్నారు. అయితే, సోమవారం నుంచి ప్రారంభమైన సెమిస్టర్‌ను విద్యార్థులు బహిష్కరించారు. వర్సిటీలో ఫీజుల పెంపును ఉప సంహరించుకునే దాకా సెమిస్టర్ రిజిస్ట్రేషన్‌ను సాగనీయబోమని తెలిపారు. ఇలా ఉండగా, వర్సిటీలో పరీక్షల నిర్వహణకు అనువైన వాతావరణం లేదని, చాలా మంది విద్యార్థులు క్యాంపస్‌కు భయంతో రాలేదని జేఎన్‌యూ ప్రొఫెసర్ల బృందం మానవ వనరుల మంత్రిత్వ శాఖకు వివరించింది.
విద్యార్థులపై బలప్రయోగం ఏమిటి?
నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడంపై పార్లమెంటరీ సంఘం ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించింది. రాజ్యసభలో కాంగ్రెస్ ఉపనేత ఆనంద్ శర్మ నేతృత్వంలోని హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట కేంద్ర హోం శాఖతోపాటు, ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీ, జమియా మిలియా ఇస్లామియా హింసాత్మక ఘటనలను నేరుగా ప్రస్తావించకుండా.. విద్యార్థులతో పోలీసులు వ్యవహరించిన తీరును ప్రశ్నించింది. ఆందోళనల సమయంలో 144వ సెక్షన్ కింద విధించే నిషేధాజ్ఞల కారణంగా సామాన్యులు ఇక్కట్లకు గురవుతున్నారని పేర్కొంది. విద్యార్థులపై బలప్రయోగం చేసిన సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఇలాంటి సందర్భాల్లో విద్యార్థులతో పరిణతితో వ్యవహరించాల్సి ఉందని తెలిపింది.
‘జేఎన్‌యూ’ ఆధారాలపై స్పందించండి
ఈ నెల 5వ తేదీనాటి జేఎన్‌యూ హింసాత్మక ఘటనలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ తదితర ఆధారాలను భద్రపరచాలంటూ దాఖలైన పిటిషన్‌పై అభిప్రాయాలను తెలపాలని వాట్సాప్, గూగుల్, యాపిల్ కంపెనీలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జేఎన్‌యూకు చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్ బ్రిజేశ్ సేథి సోమవారం విచారణ చేపట్టారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం, పోలీస్ శాఖలకు నోటీసులు జారీ చేసి, విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment