‘జేఎన్‌యూ’లో మరో 22 మంది గుర్తింపు
వీరినీ విచారించనున్న పోలీసులు
కన్హయ్య, ఖాలిద్, అనిర్భన్‌లను ప్రశ్నించిన అధికారులు
న్యూఢిల్లీ: జేఎన్‌యూలో దేశవ్యతిరేక కార్యక్రమంలో పాల్గొన్న మరో 22 మందిని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య, ఖలీద్, అనిర్బన్‌లను వేర్వేరుగా, సంయుక్తంగా విచారించిన తర్వాత వీరిని గుర్తించినట్లు తెలిసింది. వీరినీ త్వరలోనే విచారించనున్నట్లు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముసుగులు ధరించి నినాదాలిచ్చిన నలుగురుని గుర్తించలేదన్నారు. ఆనాటి ఘటనపై విచారణ జరిపేందుకు జేఎన్‌యూ వీసీ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ఈ విచారణ పురోగతిలో కీలకం కానుందని ఆ అధికారి అన్నారు. కాగా, ఒకరోజు పోలీసు కస్టడీ తర్వాత శుక్రవారం కన్హయ్యను తీహార్ జైలుకు పంపించారు. తనకు ఈ కార్యక్రమం గురించి తెలియదని.. రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతుందని భావించి.. దాన్ని ఆపేందుకే వెళ్లినట్లు కన్హయ్య విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు పటియాలా హౌస్ కోర్టు వద్ద ఘర్షణకు కారణమైన లాయర్లపై తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం, ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆ కరపత్రాలు మావి కావు..
వర్సిటీలో మహిషాసురునిపై నిర్వహించిన కార్యక్రమంలో ముద్రించిన పాంప్లెట్ గురించి పార్లమెంటులో మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని కార్యక్రమ నిర్వాహకుడు, జేఎన్‌యూ విద్యార్థి అనిల్ కుమార్ తెలిపారు. ఆమె చూపిన కరపత్రాలు తమవి కావన్నారు.
కన్హయ్య నినాదాలు చేయలేదు..
‘వర్సిటీలో ఈ నెల 9నాటి కార్యక్రమంలో కన్హయ్య ఎలాంటి నినాదాలు చేయలేదు’ అని జేఎన్‌యూ సెక్యూరిటీ గార్డు అమర్‌జిత్, కానిస్టేబుల్ రాంబీర్‌లు ఓ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పారు. ఆ ఘటనకు సాక్షులైన వీరు రాజద్రోహం కేసులోనూ వాంగ్మూలం ఇచ్చారు.