దాడి చేసిన నక్సల్స్‌ను వేటాడతామన్న హోం మంత్రి
ఛత్తీస్‌గఢ్‌లో షిండే పర్యటన.. నక్సల్స్ దాడి మృతులకు నివాళులు
ఎన్‌ఐఏతో దర్యాప్తు జరిపిస్తాం
చింతూరు, న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మంగళవారం 15 మంది భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు సహా 16 మందిని బలితీసుకున్న నక్సలైట్లపై ప్రతీకారం తీర్చుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే శపథం చేశారు. మావోయిస్టుల భీకర దాడి నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. షిండే, రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, గవర్నర్ శేఖర్‌దత్‌లు.. నక్సల్స్ దాడిలో మృతిచెందిన 15 మంది భద్రతా సిబ్బంది మృతదేహాలకు జగ్దల్‌పూర్‌లో నివాళులర్పించారు. దర్బాఘాట్‌కు వెళ్లి దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. జగ్దల్‌పూర్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై ఘటన పూర్వాపరాలపై చర్చించారు.
సీఎం, గవర్నర్, ఇతర సీనియర్ అధికారులతో షిండే సమావేశమై రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీపీఐ మావోయిస్టు పార్టీ బలహీనపడిందని, భద్రతా దళాలు మోహరించటం, నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు కొనసాగుతుండటం వల్ల ఆ పార్టీ శ్రేణులు భయపడుతున్నారని తమకు నివేదికలు అందాయని చెప్పారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అంతరాయం కలిగించే లక్ష్యంతో ఈ దాడికి తెగబడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
వాళ్లు ఎక్కడున్నారో మాకు తెలుసు...
‘‘మేం తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని వ్యాఖ్యానించారు. ప్రతీకారం ఎలా తీర్చుకుంటారని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘గతంలో చేసినట్లుగానే కేంద్ర, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టి.. ఈ దాడిలో ప్రమేయం ఉన్న మావోయిస్టులను వేటాడతాయి. వాళ్లు ఎక్కడున్నారో మాకు తెలుసు’’ అని షిండే బదులిచ్చారు. గత ఏడాది నిర్వహించిన శాసనసభ ఎన్నికల తరహాలోనే.. రాష్ట్రం లో లోక్‌సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహిస్తామని.. తగినన్ని భద్రతా దళాలను అందిస్తామని చెప్పారు.
కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి...
నక్సల్స్ దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేస్తుందని షిండే తెలిపారు. దాడి గురించి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ముందస్తుగా ఎలాంటి సమాచారం లేదన్నారు. ‘‘ఇలాంటి ఘటన ఇది రెండోది. దీనిపై ఇప్పటికే చర్చించాం. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. కానీ.. ఇలాంటి ఘటనలను నివారించేందుకు బలగాలు చేయాల్సిన పని చేస్తాయని మాకు విశ్వాసం ఉంది’’ అని పేర్కొన్నారు.
పౌరుడి ప్రాణం తీసిన హెడ్ ఫోన్!
ఇదిలావుంటే.. మంగళవారం మావోయిస్టుల దాడిలో భద్రతా సిబ్బందితో పాటు చనిపోయిన పౌరుడు విక్రమ్‌నిషాద్.. తన చెవులకు హెడ్ ఫోన్ పెట్టుకుని మొబైల్ ఫోన్ నుంచి పాటలు వింటూ బైక్‌పై వచ్చి ఎదురుకాల్పుల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడని అధికారులు చెప్తున్నారు. చెవులకు హెడ్ ఫోన్ ఉండటం వల్ల అతడు కాల్పుల శబ్దం వినలేదని, సమీపంలోని వారు అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని సమాచారం. దాడిలో పాల్గొన్న నక్సలైట్ల ఆచూకీ కోసం కూంబింగ్ ఆపేషన్ మొదలుపెట్టినట్లు సుక్మా జిల్లా పోలీసులు తెలిపారు. దాడి నేపధ్యంలో కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ విభాగం 14న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.
9వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో నక్సల్స్ హింస వల్ల గత రెండు దశాబ్దాల్లో 12,183 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇందులో 9,471 మంది పౌరులు కాగా.. 2,712 మంది భద్రతా సిబ్బంది.
ఛత్తీస్‌గఢ్ సంతలో నక్సల్స్ కాల్పులు
చింతూరు, న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో గ్రామీణుల వేషధారణలో వచ్చిన నక్సల్స్ పేట్రేగిపోయా రు. జనసమ్మర్ధంగా ఉండే వారాంతపు సంతలోకి బుధవారం ప్రవేశించిన మావోయిస్టులు అన్నదమ్ములైన వ్యా పారులు రూపేంద్ర కాశ్యప్, కేదార్‌నాథ్ కాశ్యప్‌లపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. రూపేంద్ర అక్కడికక్కడే మృతిచెందగా కేదార్ పరిస్థితి విషమంగా ఉంది.
ప్రతీకారం తీర్చుకుంటాం: షిండే
Published Thu, Mar 13 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM
Advertisement