‘మా నౌక మునిగిపోతోంది.. కాపాడండి’
న్యూఢిల్లీ: ‘మేడం మేము వెళ్లుతున్న నౌక మునిగిపోయే ప్రమాదంలో ఉంది. ఇప్పటికే నౌకలోకి చాలా నీళ్లు వచ్చాయి. దయచేసి మమల్ని కాపాడండి. మేమంతా ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లాలనుకుంటున్నామని’ అంటూ ఓ నావికుడు పంపిన ఎస్‌ఓఎస్ మెసేజ్‌కు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తక్షణమే స్పందించారు. యూఏఈలోని అజ్మాన్ ప్రాంతంలో నడిసద్రంలో చిక్కుకుపోయిన నావికులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
‘నావికులు సముద్రంలో చిక్కుకున్న వార్త ఇప్పుడే చూశాను. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామ’ని సుష్మ తెలిపారు. అనూప్ పాఠక్ అనే నావికుడు మెసేజ్ పంపడంతో ఆమె వెంటనే స్పందించారు. నాలుగు నౌకల్లో 41 మంది భారతీయ నావికులు చిక్కుకున్నట్టు మీడియా వార్తలను బట్టి తెలుస్తోంది. ఈ నౌకలకు సంబంధించిన యజమాని నావికుల పాస్ పోర్టులు లాక్కుని పత్తా లేకుండా పోయాడు. ఏడాదిగా వీరికి వేతనాలు కూడా చెల్లించడం లేదని స్థానిక మీడియా తెలిపింది.