ముగిసిన అంత్యక్రియలు | Sushma Swaraj Passes Away | Sakshi
Sakshi News home page

నివాళులర్పించిన మోదీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, అద్వాణీ

Published Wed, Aug 7 2019 10:13 AM | Last Updated on Wed, Aug 7 2019 4:53 PM

Sushma Swaraj Passes Away - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ (67) మరణంతో యావత్‌ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. గుండెపోటుతో మంగళవారం రాత్రి 10.50 గంటల సమయంలో సుష్మా స్వరాజ్‌ మృతి చెందారు.

ముగిసిన అంత్యక్రియలు
అధికార లాంఛనాలతో లోధీ రోడ్డులోని శ్మశాన వాటికలో సుష్మా స్వరాజ్‌ అంత్యక్రియలు ముగిశాయి.

భద్రతా దళాల గౌరవ వందనం
లోధి రోడ్డులోని శ్మశానవాటికలో సుష్మాస్వరాజ్‌ పార్థివ దేహం వద్ద భద్రతా బలగాలు గౌరవ వందనం సమర్పించాయి.


కడసారి నివాళులర్పించిన ప్రముఖులు
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, ఎల్‌కే అద్వాణీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పీయూష్‌ గోయల్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో సహా పలువురు బీజేపీ నాయకులు సుష్మా స్వరాజ్‌ భౌతిక కాయానికి కడసారి నివాళులర్పించారు.

కుమార్తె చేతలు మీదుగా అంతిమ సంస్కారాలు
సుష్మాస్వరాజ్‌ అంతిమయాత్ర లోధి రోడ్డులోని శ్మశాన వాటికకు చేరుకుంది. కాసేపట్లో ఆమె అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. సుష్మాకు కడసారి వీడ్కోలు పలికేందుకు శ్మశాన వాటిక వద్దకు భారీగా ప్రముఖులు, అభిమానులు చేరుకున్నారు. సుష్మా స్వరాజ్‌కు అంతిమ సంస్కారాలు కుమార్తె బన్సూరీ నిర్వహించనున్నారు.

శ్మశాన వాటకకు చేరుకున్న ప్రధాని
సుష్మా స్వరాజ్‌ అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, గులా నబీ ఆజాద్‌ లోధీ రోడ్డులోని శ్మశాన వాటికకు చేరుకున్నారు.
 

దలైలామా సంతాపం
సుష్మా స్వరాజ్‌ మృతికి ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రజల పట్ల సుష్మాస్వరాజ్‌ ఎంతో దయ, స్నేహభావంతో మెలిగేవారని ప్రశంసించారు.

కడసారి వీడ్కోలు పలికిన మంత్రులు
బీజేపీ కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, పీయూష్‌ గోయల్‌, రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డా తదితరులు సుష్మా అంత్యక్రియల్లో పాలు పంచుకున్నారు.
 

ప్రారంభమైన అంతిమయాత్ర
బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి సుష్మా స్వరాజ్‌ అంతిమయాత్ర ప్రారంభమైంది. కార్యాలయం వద్ద సుష్మా పార్థివదేహానికి ఆమె భర్త స్వరాజ్‌ కౌశల్‌, కుమార్తె బన్సూరీ శాల్యూట్‌ చేశారు. ఆ సమయంలో వారు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.


కంటతడి పెట్టిన ప్రధాని మోదీ
కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ భౌతిక కాయానికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న బాధను అదిమిపడుతూ గంభీరంగా ఉండేందుకు ప్రయత్నించినా, ఆయన కంటి వెంట నీరు ఆగలేదు. అలానే మరో బీజేపీ నాయకుడు కిషన్‌ రెడ్డి సుష్మా స్వరాజ్‌ను తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు.

మరి కొద్ది సేపట్లో సుష్మా స్వరాజ్‌ అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున బీజేపీ కార్యాలయం వద్దకు తరలి వచ్చారు. జనసంద్రాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు లోధీ రోడ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు పలువురు బీజేపీ ఎంపీలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద సుష్మా స్వరాజ్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు.

మహిళా సాధికారతకు నిదర్శనం: సచిన్‌
సుష్మా స్వరాజ్‌ మృతి పట్ల భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సంతాపం తెలిపారు. ‘సుష్మా స్వరాజ్‌ మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచారు. ప్రపంచ నలుమూలల ఉన్న భారతీయుల క్షేమం గురించి ఆమె ఆరాట పడేవారు. ఆమె మరణించారనే వార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుంటున్నాను’ అన్నారు సచిన్‌.

బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చిన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ భౌతికకాయానికి హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాలు నివాళులర్పించారు. అమిత్‌ షా కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను సుష్మ మృతదేహం మీద కప్పారు.

ఏపీ గవర్నర్‌ సంతాపం
మాజీ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఆకస్మిక మరణం పట్ల ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రిగా ఆమె సేవలు మరువలేమన్నారు. సుష్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు గవర్నర్‌.

బీజేపీ ప్రధాన కార్యాలయానికి సుష్మ మృతదేహం
పార్టీ కార్యకర్తలు, నేతల సందర్శానార్థం సుష్మ భౌతికకాయాన్ని ఇంటి నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. తమ అభిమాన నాయకురాలిని కడసారి  చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
 

సుష్మా స్వరాజ్‌ మృతికి చైనా సంతాపం తెలిపింది. చైనా-భారత్‌ సంబంధాలు బలపడటంలో సుష్మా స్వరాజ్‌ కీలక పాత్ర పోషించారని చైనా రాయబారి సన్‌ విడాంగ్‌ తెలిపారు.

దీదీ.. ఆ ప్రామిస్‌ నెరవేర్చలేదు
సుష్మాస్వరాజ్‌ మృతి పట్ల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ‘నాకు నీతో గొడవ పెట్టుకోవాలని ఉంది దీదీ(సుష్మను ఉద్దేశిస్తూ). బన్సూరీ(సుష్మా స్వరాజ్‌ కుమార్తె)ని, నన్ను మంచి రెస్టరెంట్‌కు తీసుకెళ్తానని మాటిచ్చావు. ఆ ప్రామిస్‌ను నెరవేర్చకుండానే వెళ్లిపోయావు’ అంటూ స్మృతి ఇరానీ ట్వీట్‌ చేశారు.
 

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, సోనియా గాంధీ, ఒడిశా సీఎం సుష్మా స్వరాజ్‌ ఇంటికి చేరుకుని ఆమెకు నివాళులర్పించారు. భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సుష్మా స్వరాజ్‌ మృతికి సంతాపం తెలిపారు.

మాకు మంచి స్నేహితురాలు: ఇజ్రాయెల్‌ అంబాసిడర్‌
‘సుష్మా స్వరాజ్‌ మా దేశానికి మంచి స్నేహితురాలు. నా దేశం, నా దేశ ప్రజల తరఫున సుష్మా స్వరాజ్‌ మృతికి సంతాపం తెలుపుతున్నాను. ఇజ్రాయెల్‌-ఇండియా మధ్య మంచి సంబంధాలు ఏర్పడటంలో సుష్మా స్వరాజ్‌ కృషి మరువలేనిది’ అంటూ భారత్‌ ఇజ్రాయెల్‌ రాజబారి రాన్‌ మల్కా ట్వీట్‌ చేశారు.

సుష్మా స్వరాజ్‌ మృతికి రాజ్యసభ నివాళులర్పించింది.

సాయానికి చిరునామ: శత్రుఘ్న సిన్హా
‘నా ప్రియ స్నేహితురాలి మృతి నన్ను తీవ్రంగా కలచి వేసింది. ఆమె ఇక లేరనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు సాయం అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఆమె. ప్రపంచ నలుమూలలా ఉన్న భారతీయులకు సాయం చేయడానికి ఆమె ఎల్లప్పుడు ముందుండేది. వారి బాగోగుల కోసం నిరంతరం కృషి చేసింది. సాయం చేయడంలో ఎన్నడు వెనకంజ వేయలేదు. ఆమె చాలా మందికి హీరో. తప్పును.. తప్పుగా వేలెత్తి చూపే ధైర్యం ఆమె సొంత. ఆమె మృతి కుటాంబానికే కాక దేశానికి కూడా తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. సుష్మా స్వరాజ్‌ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం’ అంటూ శత్రుఘ్న సిన్హా ట్వీట్‌ చేశారు.
 

సుష్మా స్వరాజ్‌ నాకు అత్యంత ఆప్తులు
సుష్మా స్వరాజ్‌ మృతి పట్ల బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అద్వాణీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెతో తనకు గల అనుబంధాన్ని అద్వాణీ గుర్తు చేసుకున్నారు. 1980 కాలంలో నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాను. సుష్మా స్వరాజ్‌ అప్పటికి చాలా చిన్నది. అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్ది.. చూస్తుండగానే దేశంలోనే చాలా శక్తివంతమైన రాజకీయనాయకురాలిగా ఎదిగారు. మహిళా నాయకులకు ఆమె ఆదర్శంగా నిలిచారు. ఆమె అకాల మరణం నన్ను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది’ అన్నారు అద్వాణీ

సీనియర్‌ బీజేపీ నాయకుడు ఎల్‌ కే అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, గౌతమ్‌ గంభీర్‌ సుష్మా స్వరాజ్‌ నివాసం వద్దకు చేరుకుని ఆమె మృత దేహానికి నివాళులర్పించారు.

కర్ణాటకలో బీజేపీ శ్రేణుల సంతాప సభ
కర్ణాటక సీఎం యడియూరప్ప, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సుష్మా స్వరాజ్‌ మృతికి సంతాపం తెలిపారు

రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం

సుష్మా స్వరాజ్‌ మృతి సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం రెండురోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. అలాగే సుష్మ భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

మధ్యాహ్నం అంత్యక్రియలు..
సుష్మా స్వరాజ్‌ భౌతికకాయానికి బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆమె మరణం తీరని లోటని, ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు. దేశం, పార్టీ ఒక గొప్ప రాజకీయ నాయకురాలిని కోల్పోయిందని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతల సందర్శానార్థం సుష్మ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉంచనున్నట్లు తెలిపారు. ఈరోజు సాయంత్రం లోధీ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.

ప్రముఖుల సంతాపం..
సుష్మా స్వరాజ్‌ మృతితో బీజేపీ శ్రేణులు శోక సంద్రంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీ, లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా, జేపీ నడ్డా, ఎస్పీ నాయకుడు రామ్‌ గోపాల్‌ యాదవ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, బీజేపీ నాయకురాలు హేమా మాలిని, యోగా గురువు బాబా రాందేవ్‌ తదితర ప్రముఖులు సుష్మా స్వరాజ్‌ నివాసం వద్దకు  చేరుకుని ఆమెకు నివాళులర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement