ఫ్లాగ్‌షిప్‌లోకి ‘స్వచ్ఛభారత్'... | swaccha bharat in flagship | Sakshi
Sakshi News home page

ఫ్లాగ్‌షిప్‌లోకి ‘స్వచ్ఛభారత్'...

Published Sun, Mar 1 2015 2:42 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

swaccha bharat in flagship

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్వచ్ఛ భారత్‌ను ఫ్లాగ్‌‘షిప్’ లోకి ఎక్కించారు. గత యూపీఏ సర్కారు మొదలుపెట్టిన పలు పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే మోదీ మార్కును చూపించేలా ఆర్థిక మంత్రి జైట్లీ జాగ్రత్త పడ్డారు. సెస్‌ల రూపంలో స్వచ్ఛ భారత్‌కు తగినన్ని నిధులను సమకూర్చేలా పకడ్బందీ ప్రణాళికను రూపొందించారు. ఇంకా దీనికోసం ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేయడమేకాకుండా.. దీనికిచ్చే విరాళాలకు పన్ను మినహాయింపులనూ అందిస్తామని చెప్పడం విశేషం. మరోపక్క, ఉపాధి హామీకి అత్యధికంగానే నిధులను కేటాయించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలపై అత్యధికంగా దృష్టిసారిస్తున్నామన్న సంకేతాలిచ్చారు.
 
స్వచ్ఛ భారత్..
2015-16 కేటాయింపులు: రూ.3,625 కోట్లు
 2019 అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు 100 శాతం పారిశుధ్యాన్ని(సెప్టిక్ మరుగుదొడ్ల నిర్మాణం) కల్పించడం లక్ష్యం. దేశంలోని 627 జిల్లాల్లోని అన్ని గ్రామాలనూ ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు.  ఎస్‌బీఏ ప్రాజెక్టులో మొత్తం 9 కోట్ల టాయిలెట్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యమని.. 2014-15లో 50 లక్షల టాయిలెట్లను నిర్మించినట్లు జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
 
భారత్‌ను పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మోదీ ఈ వినూత్న కార్యక్రమాన్ని గతేడాది అక్టోబర్ 2న ప్రారంభించారు. దీనికి సంబంధించిన నిధుల కల్పన కోసం అవసరమైతే సర్వీస్ పన్నుకు అదనంగా(కొన్ని లేదా అన్ని సేవలపై) మరో 2 శాతం స్వచ్ఛ భారత్ సెస్‌ను కూడా జతచేస్తామని జైట్లీ 2015-16 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. కేంద్రం నోటిఫై చేసిననాటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

కాగా, స్వచ్ఛ భారత్ నిధి(కోష్)కి ఇచ్చే విరాళాలపై 100 శాతం ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తామని కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అయితే, కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కింద కంపెనీలు ఈ నిధికి ఇచ్చే మొత్తాలు పన్ను మినహాయింపుల్లోకి రావని పేర్కొన్నారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని తమ ప్రభుత్వం ఒక ఉద్యమంలా చేపడుతోందని చెప్పారు. స్వచ్ఛ భారత్ పరిధిలోకి స్వచ్ఛ భారత్ అభియాన్(పారిశుధ్యం), జాతీయ గ్రామీ ణ తాగునీటి పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది.
 
దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన...
2015-16లో కేటాయింపు:
రూ.6,800 కోట్లు(32.19 శాతం పెంపు)
2014-15లో కేటాయింపు: రూ.5,144 కోట్లు
2013-14లో కేటాయింపు: రూ.4,500 కోట్లు
 
విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు... దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న 2.34 కోట్ల కుటుం బాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది. నోడల్ ఏజెన్సీగా ఆర్‌ఈసీ వ్యవహరిస్తోంది. రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనగా గత యూపీఏ ప్రారంభించిన భారత్ నిర్మాణ్ పథకం పేరును మోదీ సర్కారు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనగా మార్చింది.
 
బీపీఎల్ కుటుంబాలకు కనెక్షన్‌కు రూ.2,200 చొప్పున 100 శాతం సబ్సిడీ. 12వ పంచవర్ష ప్రణాళిక(2012-17)లోనూ ఈ స్కీమ్‌ను పొడిగించారు. సబ్సిడీని రూ.3,000కు పెంచారు. ఈ ఐదేళ్లలో రూ.50,000 కోట్లు కావాలనేది విద్యుత్ శాఖ డిమాండ్.
 
విద్యుత్ సంస్కరణల్లో భాగంగా పొలాలు, గృహావసరాలకు విద్యుత్ సరఫరా చేసే ఫీడర్లను వేరుచేసి గ్రామాల్లో సరఫరా ఇబ్బందులను తొలగించాలనే లక్ష్యాన్ని సర్కారు నిర్దేశించుకుంది. బడ్జెట్‌లో గ్రామీణ విద్యుదీకరణకు రూ.4,500 కోట్లు, ఫీడర్లను వేరుచేసే కార్యక్రమానికి రూ.2,300 కోట్లు కేటాయించారు.
 
ఈ పథకం ప్రారంభమైననాటినుంచి ఇప్పటివరకూ 2.22 కోట్ల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు అంచనా. ఇక 1,08,280 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
     
గత ఆర్థిక సంవత్సరం(2014-15 జనవరి వరకూ)లో కొత్తగా 11,931 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. 5,55,737 బీపీఎల్ కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్‌లు ఇచ్చినట్లు అంచనా.
 
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)..
2015-16లో కేటాయింపు: 14,291 కోట్లు(0.7 శాతం తగ్గింపు)
2014-15లో కేటాయింపు: 14,391 కోట్లు
2013-14లో కేటాయింపు: 21,700 కోట్లు
 
గ్రామీణ ప్రాంతాలన్నింటికీ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకానికి పూర్తిగా కేంద్రమే నిధులు అందిస్తోంది. 2005లో దీన్ని భారత్ నిర్మాణ్‌లోకి యూపీఏ చేర్చింది.
 
గ్రామీణ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని చెప్పిన ఎన్‌డీఏ ప్రభుత్వం.. తన హయాంలో ప్రారంభించిన ఈ కీలక ఫ్లాగ్‌షిప్ పథకానికి తొలి బడ్జెట్‌లో కేటాయింపులను తగ్గిస్తుండటం గమనార్హం.
 
ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై)...
2015-16లో కేటాయింపు
10,025 కోట్లు(37 శాతం కోత)
2014-15లో కేటాయింపు: 16,000 కోట్లు
2013-14లో కేటాయింపు: 15,184 కోట్లు
 
దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలు, ఎస్‌సీ/ఎస్‌టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారిటీలు ఈ పథకంలో లబ్దిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి.
 
మైదాన ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి సాయాన్ని రూ.70,000కు, కొండ ప్రాంతాలు, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రూ.75,000 చొప్పున ఇస్తున్నారు. ఇక ఇప్పటికే ఉన్న ఇళ్ల అప్‌గ్రెడేషన్‌కు రూ.15,000 చొప్పున సాయం అందిస్తారు.
 
మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. అయితే, స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు.
 
2022కల్లా దేశవ్యాప్తంగా అందరికీ సొంతింటి కల సాకారం చేస్తామని చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం.. ఈ గ్రామీణ ఇంటి నిర్మాణ పథకానికి అరకొరగా నిధులను కేటాయిస్తుండటం గమనార్హం.
 
జాతీయ గ్రామీణ తాగునీటి పథకం
2015-16లో కేటాయింపు:
రూ.2,611 కోట్లు(76 శాతం తగ్గింపు)
2014-15లో కేటాయింపు: రూ. 11,000 కోట్లు
2013-14లో కేటాయింపు: రూ. 11,000 కోట్లు
దేశంలో తాగునీటి సౌకర్యం లేని(అన్‌కవర్డ్) అన్ని మారుమూల గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు కొన్ని నిధులు మంజూరవుతాయి. మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు వెచ్చించాలి. గతేడాది ఏప్రిల్ నాటికి దేశంలోని మొత్తం 16.97 లక్షల గ్రామీణ ఆవాస ప్రాంతాలకుగాను.. 12.50 లక్షల ప్రాంతాలకు మాత్రమే సురక్షితమైన, తగినంత తాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నారు.
 
గ్రామీణ టెలిఫోనీ..
2015-16లో కేటాయింపు: రూ. 2,400 కోట్లు(32 % తగ్గింపు)
2014-15లో కేటాయింపు: రూ. 3,553 కోట్లు
2013-14లో కేటాయింపు: 3,000 కోట్లు
గ్రామాల్లో ప్రతి 100 మందికీ 40 మందిని టెలిఫోన్ వినియోగదారులు(టెలీ డెన్సిటీ 40%)గా చేయాలనేది లక్ష్యం. ఇది సాకారమైంది.
 
దేశంలోని మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్(జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్-ఎన్‌ఓఎఫ్‌ఎన్) ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పంచాయతీ స్థాయిలో భారత్ నిర్మాణ్ కామన్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
మొత్తం 7.5 లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను ఇందుకోసం వేయనున్నట్లు జైట్లీ చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30,000 కోట్లు.
 
టెలికం శాఖకు చెందిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ నిధి(యూఎస్‌ఓఎఫ్) నుంచి ఈ స్కీమ్‌కు ఫండ్స్‌ను అందిస్తున్నారు. అయితే, సొంతంగా నిధులను వెచ్చించే రాష్ట్రాలకు కేంద్రం ఆతర్వాత తిరిగి చెల్లించేందుకు(వ్యయాల ఆధారంగా) జైట్లీ ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈసారి  నిధుల కేటాయింపులను తగ్గించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement