swachcha bharat
-
ఆ ‘ఫొటోల’తో దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రీసైక్లింగ్‌కు పనికిరాని ప్లాస్టిక్‌ను నిషేధించాలని దేశ ప్రజలకు సందేశమిస్తూ అందుకు స్ఫూర్తిగా తమిళనాడులో మామల్లాపురం బీచ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్లాస్టిక్‌తోపాటు ఇతర చెత్తాచెదారాన్ని ఏరడం, ఆ తర్వాత దానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను విడుదల చేయడం తెల్సిందే. చెనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, మోదీల మధ్య శనివారం జరిగిన చర్చల నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంపై రాద్ధాంతం చెలరేగింది. మోదీ చెత్తా చెదారాన్ని ఏరివేయడానికి ముందు, బాంబులను గుర్తించే స్క్వాడ్ వచ్చి ఆ బీచంతా తనిఖీ చేసిందని, అనంతరం కొంత మంది పారిశుద్ధ్య కార్మికులు వచ్చి ఆ బీచ్‌లో ఉద్దేశపూర్వకంగా చెత్తా చెదారాన్ని చల్లారని, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వచ్చి బీచ్‌లో చెత్తా చెదారాన్ని ఏరారని, అప్పటికే అక్కడ కెమెరాలు, లైట్లతో సిద్ధంగా ఉన్న వీడియో సిబ్బంది ఆ దృశ్యాన్ని చిత్రీకరించిందంటూ కొన్ని ఫొటోలు మూడు రోజులుగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అందులో ఎంత వాస్తవం ఉంది ? చక్కర్లు కొడుతున్న మూడు, నాలుగు ఫొటోలు ఆ నాడు తీసినవేనా ? కనీసం అవన్నీ మామల్లాపురంకు చెందినవేనా? జాగ్రత్తగా గమనిస్తే అవి నకిలీవని తెలుసుకోవడానికి పెద్ద సమయం పట్టదు. ప్రధాని పర్యటన సందర్భంగా బాంబు స్క్వాడ్ తనికీ చేయడం అన్నది సర్వ సాధారణం. మోడీ ఏరిన ప్లాస్టిక్, చెత్త కొంచెం మాత్రమే. ఆ కొంచెం బీచ్‌లో చల్లేందుకు అంత మంది పారిశుధ్ధ్య కార్మికులు, అన్ని సంచులతో అక్కడికి రారు. పైగా పారిశుద్ధ్య కార్మికుల్లా వారు కనిపించడం లేదు. పగట పూట మోదీ యాక్షన్‌ను చిత్రీకరించేందుకు సినిమా షూటింగ్ లాంటి లైట్లు అవసరం లేదు. ఇలాంటి సందేహాలతోనే ఫొటోలను తనిఖీ చేయగా, వీడియా సిబ్బందిలా భావించిన ఫొటో స్కాట్లాండ్లోని, సెయింట్ ఆండ్రూస్ నగరంలోని ‘వెస్ట్ స్యాండ్స్’ బీచ్‌కు చెందినది. వీడియా సిబ్బందిలా భావిస్తున్నవారు. సినిమా సిబ్బంది. అక్కడ ఆ బీచ్‌లో దేశ దేశాల షూటింగ్‌లు తరచుగా జరుగుతాయి. అలాంటి ఓ షూటింగ్‌కు సంబంధించిన ఓ ఫొటోను ‘టేస్క్రీన్ డాట్ కామ్’ ఎన్నడో ప్రచురించింది. ఇక బాంబ్ స్క్వాడ్ బీచ్‌ను తనిఖీ చేస్తున్న దశ్యం ఫొటో కేరళలోని కోజికోడ్ బీచ్‌కు చెందినది. 2019 లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని ఏప్రిల్, 23న మోదీ ఎన్నికల సభ సందర్భంగా తనిఖీ చేసినప్పటి చిత్రం. ఇక బీచ్‌లో చెత్త పారేస్తున్నట్లు భావిస్తున్నవారు వాస్తవానికి చెత్త ఏరుతున్నారు. అది ఎక్కడి ఫొటోనో, ఎవరి ఫొటోను తెలియలేదు. అయితే స్వచ్ఛంద కార్యకర్తలు బీచ్‌ను శుభ్రం చేస్తున్న ఫొటోగా అది అర్థం అవుతోంది. మోదీ తన వీడియో క్లిప్‌ను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే మోదీ దుష్ప్రచారానికి సంబంధించిన ఫొటోలు విడుదలవడంతో అవి వేగంగా సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. మోదీకి వ్యతిరేకంగా మొదట తమిళనాడులోని శివగంగ కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం మూడు ఫొటోలను విడుదల చేసినట్లు తెలుస్తోంది. అందులో రెండు ఫొటోలు బీచ్‌లో మోదీ చెత్తా చెదారాన్ని ఏరివేస్తున్నవి కాగా, ఆ దశ్యాలను చిత్రీకరిస్తున్న వీడియా సిబ్బంది అంటూ మరో చిత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఆ తర్వాత కొంత సేపటికి ‘రోఫి రిపబ్లిక్’ నాలుగు ఫొటోలను పోస్ట్ చేసింది. 1. బీచ్‌ను తనిఖీ చేస్తున్న బాంబ్ స్క్వాడ్, 2.ఆ తర్వాత చెత్త వేస్తున్న దశ్యం, 3. కెమేరాలు సర్దుకున్న వీడియో సిబ్బంది, 4. ఏరుతున్న మోదీకి ఆస్కార్....అంటూ వ్యాఖ్యానాలు కూడా చేసింది. ఈ నకిలీ ఫొటోల దుష్ప్రచారంతో సంబంధం లేకుండానే ప్రధాని మోదీ యాక్షన్ కృతకంగా ఉందని, వ్యక్తిగత ప్రచారం కోసమే ఈ ఆర్భాటం అన్న వాళ్లు, ప్రజలకు స్ఫూర్తినివ్వడానికి ఆ మాత్రం యాక్షన్ ఉండాల్సిందే అంటున్న వాళ్లు లేకపోలేదు. -
స్వచ్ఛ భారతం ఇదేనా?
విశ్లేషణ స్వచ్ఛ భారత్ ప్రజల తలకెక్కలేదు. వారు వీధులలో చెత్తను వేస్తున్నారు, మూత్ర విసర్జన చేస్తున్నారు. సుగమ్య భారత్‌ను నిజం చేయాల్సిన వారు ప్రచారం తప్ప వికలాంగులకు అనువైన సదుపాయాలను కల్పించడంలేదు. ప్రశంసనీయమైన లక్ష్యాలతో దేశంలో ప్రస్తుతం రెండు ఉద్య మాలు సాగుతున్నాయి. ఒకటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం. రెండవది, రైలు, బస్సు స్టేషన్లు, భవనాలు తదితరా లను వికలాంగులకు అందు బాటులోకి తేవడానికి ఉద్దేశిం చిన సుగమ్య భారత్. వాటిపై భారీ ప్రచారం సాగుతోంది. శుద్ధి ప్రణా ళికకు 2019 తుది గడువు. ఆలోగా ఎక్కడబడితే అక్కడ కనిపించే చెత్తనంతా తొలగించి దేశాన్ని పరిశుభ్రం చేయాల్సిఉంది. ప్రతి ఒక్కరూ, పౌరులు, అధికారులు అందుకు పూనుకుని వ్యక్తిగత ఆరోగ్యం, ప్రజారోగ్యం వంటి ప్రయోజనాలను పొం దాల్సి ఉంటుంది. ఇక వికలాంగులంతా వారికి కల్పిం చిన సదుపాయాలను వాడుకుంటూ ఉండాలి. అలా జరుగుతుంటే చాలా చక్కగా ఉంటుంది. కానీ ప్రజలు పరిశుభ్రతను బలవంతంగా రుద్దగలి గేది కాదని, అలవ రచుకోవాల్సినదని ఇంకా గుర్తిం చలేక పోవడం వల్ల ఈ రెండు లక్ష్యాలు నెరవేరడమూ కష్టమే. సబ్సిడీల పంపిణీకి అవినీతి క్యాన్సర్ సోకక పోతే, ప్రోత్సాహకాలు మరుగు దొడ్ల నిర్మాణానికి తోడ్ప డతాయి. సుగమ్య భారత్ భావనను నిజం చేయా ల్సిన వారు దాన్ని ప్రచారం చేయడమే తప్ప వికలాం గులకు అనువైన సదుపాయాల నిర్మాణానికి తోడ్పడటం లేదు. ఒక సాధారణమైన మనిషి తాత్కాలిక వైకల్యానికి గురైతే తప్ప వికలాంగులు అనుభవించే బాధ ఎలాంటిదో తెలియదు. మహారాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత్ పాటిల్ ప్రమాదానికి గురై రెండు కాళ్లు విరి గాయి. దీంతో ఆ మంత్రి శాసనసభలోకి ప్రవేశించడా నికి వీలుగా ఒక రాంప్‌ను (వాలు దారి), ట్రెజరీ బెంచ్ కు చేరడానికి మరో రాంప్‌ను ఏర్పాటు చేశారు. సెక్ర టేరియట్‌లో నిరాటంకంగా ఆయన విధులను సాగించ డానికి వీలుగా ఆగమేఘాలపై ఇంకో రాంప్ ప్రత్యక్ష మైంది. రాష్ట్ర ప్రభుత్వ భవనాలను వికలాంగు లకు అను వైనవిగా మార్చడానికి బడ్జెట్లో సంకేతాత్మ కంగానైనా నిధులను కేటాయించడానికి ఆయనను ఒప్పించినట్టు గుర్తుంది. అయినా ఎక్కడా రాంప్లు కనబడటం లేదు. వికలాంగులు బాధలు పడుతూనే ఉన్నారు. స్వచ్ఛ భారత్ సైతం నరేంద్ర మోదీ ఆశిస్తున్నట్టు విజయవంతం అయ్యేలా సాగడం లేదు. గ్రామాల నుంచి నగరాల వరకు స్థానిక సంస్థలు ఈ పరిశుభ్రతా పరిరక్షణ కృషి, పౌరులను చైతన్యవంతులను చేసే కృషి అభిలషణీయ స్థాయిలో సాగడానికి హామీని కల్పించ డానికి సహాయపడాల్సి ఉంది. అయినా, ఎక్కడో కొద్ది చోట్ల తప్పితే, ఒక నియమం అన్నట్టు ప్రతి చోటా ఈ కృషి తీవ్రంగా కొరవడటమే కనబడుతోంది. అసలు పరిశుభ్రత పట్లనే వ్యక్తులలో, సంస్థలలో పట్టింపు లేనితనం ఉంది. సబ్సిడీల వల్ల మరుగుదొడ్లను నిర్మించి ఉండొచ్చు. కానీ వాటి ఉపయోగం రెండు కారణాల వల్ల అభిలషణీయ స్థాయికన్నా తక్కువగా ఉంటోంది. ఒకటి, పాత అలవాట్లు అంత తేలికగా వదిలేవి కాకపోవడం. రెండు, వాటిని శుభ్రంగా ఉంచడానికి నీరు కొరవడటం. గణాంకాలను చూస్తే ప్రశంసనీయమైన కృషి జరిగినట్టే అనిపిస్తుంది. కలగాల్సిన ప్రయోజనాలను బట్టి చూస్తే నిర్మించిన మరుగు దొడ్లు అందుకు అనుగుణంగా ఉండ టంలేదు. అదే పెద్ద సమస్య. ఇది కేవలం మరుగు దొడ్లను నిర్మించడానికి సం బంధించిన సమస్య కాదు, వాటిని ఉపయోగించడంలో ప్రజలకు శిక్షణ గరపడమే సమస్య. అయితే మరుగుదొడ్లు లేకపోవడం వల్ల తలెత్తే సమస్యలూ ఉన్నాయి.. బాలికలు మధ్యలోనే చదువు మానుకుంటున్నారు, నగరాలలో మహిళలు ‘మూత్ర విసర్జనా హక్కు’ను కోరుతున్నారు. ఈ కార్యక్రమం ఇంకా ప్రజల తలకెక్కలేదు. వారు ఆనందంగా వీధులలో చెత్తను వేస్తున్నారు, ఉమ్ముతు న్నారు, మూత్ర విసర్జన చేస్తున్నారు. స్వచ్ఛ భారత్‌ను ప్రారంభించిన ప్రధానే వచ్చి శుభ్రం చేస్తారన్నట్టు వ్యవ హరిస్తున్నారు. ఇదేదో ప్రభుత్వ కార్యకలాపం అన్నట్టు చాలా కార్యక్రమాల్లాగే ఇదీ వారిని తాకలేదు. ఎవరైనా వీధుల్లో ఉమ్మితే లేదా వాడేసిన ఖాళీ గుట్కా ప్యాకెట్‌ను పారేస్తే, సిగరెట్ పీకలను పారేస్తే వారిని ఎగతాళి చేస్తుంటాను. పరిశుభ్రత ఆవశ్యకతను వివారిస్తాను. పరిశుభ్రతకు సంబంధించిన ప్రజా ప్రమాణాలను ఉల్లం ఘించిన వ్యక్తిని అది సిగ్గుపడేలా చేస్తుంది. తేలికగా చేయగలిగేది.. ఉమ్మిన వ్యక్తిని చెప్పులు విప్పి కేవలం అతని కాలిబొటన వేలిని ఉమ్మిన దానిలో లేదా కళ్లెలో పెట్టమనాలి. ‘‘మీరు ఉమ్మినదాన్ని మీరు ఒక్కసారి తాకి చూసి, మరొకరు దాన్ని తాకితే ఎలా ఉంటుందో ఊహిం చండి’’ అంటే సరి. ఆ ఆలోచనే చీదర పుట్టించడం అతని మొహంలో కనిపిస్తుంది, ఈ సుదీర్ఘ ప్రయా ణంలో మనం, ప్రజారోగ్యకర పరిస్థితులకు హామీని కల్పించగలగడంలోనే మనందరి సొంత ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించడం అవసరం. ఇక వికలాంగులకు సదుపాయాలను అందుబాటులోకి తేవడం మనందరి తప్పనిసరి బాధ్యత. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేష్ విజాపుర్కార్ ఈ మెయిల్ : mvijapurkar@gmail.com -
ఫ్లాగ్‌షిప్‌లోకి ‘స్వచ్ఛభారత్'...
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్వచ్ఛ భారత్‌ను ఫ్లాగ్‘షిప్’ లోకి ఎక్కించారు. గత యూపీఏ సర్కారు మొదలుపెట్టిన పలు పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే మోదీ మార్కును చూపించేలా ఆర్థిక మంత్రి జైట్లీ జాగ్రత్త పడ్డారు. సెస్‌ల రూపంలో స్వచ్ఛ భారత్‌కు తగినన్ని నిధులను సమకూర్చేలా పకడ్బందీ ప్రణాళికను రూపొందించారు. ఇంకా దీనికోసం ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేయడమేకాకుండా.. దీనికిచ్చే విరాళాలకు పన్ను మినహాయింపులనూ అందిస్తామని చెప్పడం విశేషం. మరోపక్క, ఉపాధి హామీకి అత్యధికంగానే నిధులను కేటాయించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలపై అత్యధికంగా దృష్టిసారిస్తున్నామన్న సంకేతాలిచ్చారు. స్వచ్ఛ భారత్.. 2015-16 కేటాయింపులు: రూ.3,625 కోట్లు 2019 అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు 100 శాతం పారిశుధ్యాన్ని(సెప్టిక్ మరుగుదొడ్ల నిర్మాణం) కల్పించడం లక్ష్యం. దేశంలోని 627 జిల్లాల్లోని అన్ని గ్రామాలనూ ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఎస్బీఏ ప్రాజెక్టులో మొత్తం 9 కోట్ల టాయిలెట్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యమని.. 2014-15లో 50 లక్షల టాయిలెట్లను నిర్మించినట్లు జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. భారత్‌ను పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మోదీ ఈ వినూత్న కార్యక్రమాన్ని గతేడాది అక్టోబర్ 2న ప్రారంభించారు. దీనికి సంబంధించిన నిధుల కల్పన కోసం అవసరమైతే సర్వీస్ పన్నుకు అదనంగా(కొన్ని లేదా అన్ని సేవలపై) మరో 2 శాతం స్వచ్ఛ భారత్ సెస్‌ను కూడా జతచేస్తామని జైట్లీ 2015-16 బడ్జెట్లో ప్రతిపాదించారు. కేంద్రం నోటిఫై చేసిననాటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది. కాగా, స్వచ్ఛ భారత్ నిధి(కోష్)కి ఇచ్చే విరాళాలపై 100 శాతం ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తామని కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అయితే, కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద కంపెనీలు ఈ నిధికి ఇచ్చే మొత్తాలు పన్ను మినహాయింపుల్లోకి రావని పేర్కొన్నారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని తమ ప్రభుత్వం ఒక ఉద్యమంలా చేపడుతోందని చెప్పారు. స్వచ్ఛ భారత్ పరిధిలోకి స్వచ్ఛ భారత్ అభియాన్(పారిశుధ్యం), జాతీయ గ్రామీ ణ తాగునీటి పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన... 2015-16లో కేటాయింపు: రూ.6,800 కోట్లు(32.19 శాతం పెంపు) 2014-15లో కేటాయింపు: రూ.5,144 కోట్లు 2013-14లో కేటాయింపు: రూ.4,500 కోట్లు విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు... దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న 2.34 కోట్ల కుటుం బాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది. నోడల్ ఏజెన్సీగా ఆర్ఈసీ వ్యవహరిస్తోంది. రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనగా గత యూపీఏ ప్రారంభించిన భారత్ నిర్మాణ్ పథకం పేరును మోదీ సర్కారు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనగా మార్చింది. బీపీఎల్ కుటుంబాలకు కనెక్షన్‌కు రూ.2,200 చొప్పున 100 శాతం సబ్సిడీ. 12వ పంచవర్ష ప్రణాళిక(2012-17)లోనూ ఈ స్కీమ్‌ను పొడిగించారు. సబ్సిడీని రూ.3,000కు పెంచారు. ఈ ఐదేళ్లలో రూ.50,000 కోట్లు కావాలనేది విద్యుత్ శాఖ డిమాండ్. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా పొలాలు, గృహావసరాలకు విద్యుత్ సరఫరా చేసే ఫీడర్లను వేరుచేసి గ్రామాల్లో సరఫరా ఇబ్బందులను తొలగించాలనే లక్ష్యాన్ని సర్కారు నిర్దేశించుకుంది. బడ్జెట్లో గ్రామీణ విద్యుదీకరణకు రూ.4,500 కోట్లు, ఫీడర్లను వేరుచేసే కార్యక్రమానికి రూ.2,300 కోట్లు కేటాయించారు. ఈ పథకం ప్రారంభమైననాటినుంచి ఇప్పటివరకూ 2.22 కోట్ల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు అంచనా. ఇక 1,08,280 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2014-15 జనవరి వరకూ)లో కొత్తగా 11,931 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. 5,55,737 బీపీఎల్ కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు అంచనా. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై).. 2015-16లో కేటాయింపు: 14,291 కోట్లు(0.7 శాతం తగ్గింపు) 2014-15లో కేటాయింపు: 14,391 కోట్లు 2013-14లో కేటాయింపు: 21,700 కోట్లు గ్రామీణ ప్రాంతాలన్నింటికీ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకానికి పూర్తిగా కేంద్రమే నిధులు అందిస్తోంది. 2005లో దీన్ని భారత్ నిర్మాణ్‌లోకి యూపీఏ చేర్చింది. గ్రామీణ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వం.. తన హయాంలో ప్రారంభించిన ఈ కీలక ఫ్లాగ్షిప్ పథకానికి తొలి బడ్జెట్లో కేటాయింపులను తగ్గిస్తుండటం గమనార్హం. ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై)... 2015-16లో కేటాయింపు 10,025 కోట్లు(37 శాతం కోత) 2014-15లో కేటాయింపు: 16,000 కోట్లు 2013-14లో కేటాయింపు: 15,184 కోట్లు దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలు, ఎస్సీ/ఎస్టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారిటీలు ఈ పథకంలో లబ్దిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి. మైదాన ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి సాయాన్ని రూ.70,000కు, కొండ ప్రాంతాలు, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రూ.75,000 చొప్పున ఇస్తున్నారు. ఇక ఇప్పటికే ఉన్న ఇళ్ల అప్‌గ్రెడేషన్‌కు రూ.15,000 చొప్పున సాయం అందిస్తారు. మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. అయితే, స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు. 2022కల్లా దేశవ్యాప్తంగా అందరికీ సొంతింటి కల సాకారం చేస్తామని చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం.. ఈ గ్రామీణ ఇంటి నిర్మాణ పథకానికి అరకొరగా నిధులను కేటాయిస్తుండటం గమనార్హం. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం 2015-16లో కేటాయింపు: రూ.2,611 కోట్లు(76 శాతం తగ్గింపు) 2014-15లో కేటాయింపు: రూ. 11,000 కోట్లు 2013-14లో కేటాయింపు: రూ. 11,000 కోట్లు దేశంలో తాగునీటి సౌకర్యం లేని(అన్కవర్డ్) అన్ని మారుమూల గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు కొన్ని నిధులు మంజూరవుతాయి. మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు వెచ్చించాలి. గతేడాది ఏప్రిల్ నాటికి దేశంలోని మొత్తం 16.97 లక్షల గ్రామీణ ఆవాస ప్రాంతాలకుగాను.. 12.50 లక్షల ప్రాంతాలకు మాత్రమే సురక్షితమైన, తగినంత తాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. గ్రామీణ టెలిఫోనీ.. 2015-16లో కేటాయింపు: రూ. 2,400 కోట్లు(32 % తగ్గింపు) 2014-15లో కేటాయింపు: రూ. 3,553 కోట్లు 2013-14లో కేటాయింపు: 3,000 కోట్లు గ్రామాల్లో ప్రతి 100 మందికీ 40 మందిని టెలిఫోన్ వినియోగదారులు(టెలీ డెన్సిటీ 40%)గా చేయాలనేది లక్ష్యం. ఇది సాకారమైంది. దేశంలోని మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్(జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్-ఎన్ఓఎఫ్ఎన్) ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పంచాయతీ స్థాయిలో భారత్ నిర్మాణ్ కామన్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 7.5 లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను ఇందుకోసం వేయనున్నట్లు జైట్లీ చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30,000 కోట్లు. టెలికం శాఖకు చెందిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ నిధి(యూఎస్ఓఎఫ్) నుంచి ఈ స్కీమ్‌కు ఫండ్స్‌ను అందిస్తున్నారు. అయితే, సొంతంగా నిధులను వెచ్చించే రాష్ట్రాలకు కేంద్రం ఆతర్వాత తిరిగి చెల్లించేందుకు(వ్యయాల ఆధారంగా) జైట్లీ ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈసారి నిధుల కేటాయింపులను తగ్గించింది. -
పరమ పవిత్రులందరికీ ప్రణామాలు!
ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛభారత్ అభియాన్ ప్రచారభారాన్ని వెంకయామాత్యుడు తన భుజస్కంధాలపైన వేసుకున్నారు. కడు నిరాడంబరంగా కనిపించే వెంకయామాత్యుడు తనకు నచ్చిన తారలను ఎంపిక చేసి వారిని పరిశుభ్రతకు ప్రతీకలుగా, నిర్మల హృదయులుగా, పరమపావనులుగా తెలుగునాట స్వచ్ఛభారత్ కార్యక్రమ ప్రచారదూతలుగా ఒకానొక మహాసభలో ప్రకటించినారు. మన దేశానికి నిజంగానే అచ్ఛేదిన్ వచ్చేశాయి. ఇకపైన మనదేశం పరిశుభ్రంగా, నందనవనంగా, ఆనందమ యంగా, శక్తిమంతంగా, అద్భుతంగా, అందంగా ఉండబో తోందనే ఆశ కలుగుతోంది. అధర్మం నుంచి భూమిని కాపాడటానికి శ్రీమన్మహావిష్ణువు అవతారం దాల్చినట్టు భారతావనిని కాంగ్రెస్ రాక్షస(సి)పాలననుంచి విముక్తం చేయడానికి ధిల్లీలో వెలసిన నరేంద్ర ప్రభువు ధర్మపాల నలో దేశం అన్ని సమస్యలనూ అధిగమించి అగ్ర రాజ్యంగా అవతరించబోతోందనడంలో సందేహం లేదు. కారణజన్ముడైన మోదీ మహాశయుడు ఒకానొక అప్రాచ్య మహిళ సారథ్యంలోని సైన్యాన్ని వధించి సకల కుంభకోణాలకూ, అక్రమాలకూ, అసమర్థతకూ, ఆశ్రీత పక్షపాతానికీ, చీకటిబజారుకూ, బంధుప్రీతికీ తటాలున తెరదించిన వైనం తెలిసిందే. ఆనక స్వాతంత్య్ర దినోత్స వంనాడు ఒక గొప్ప సంకల్పం జాతికి వెల్లడించారు ప్రధాన్. స్వచ్ఛభారత్ అభియాన్ మంత్రోపదేశం చేశారు. యాభైమూడు అంగుళాల ఛాతీ, చెక్కుచెదరని కుర్తా, పైజమా, నెహ్రూ (పాపము శమించుగాక)జాకెట్టూ, రాజ స్థానీ తలపాగా పెట్టుకొని జలపాత సదృశంగా సాగిపో తున్న ప్రసంగమధ్యంలో స్వచ్ఛభారత్ అభియాన్‌ను అత్యంత నాటకీయంగా ప్రకటించారు. భారత దేశాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికలలోగా అద్దంలాగా చేయాలంటూ ఉద్బోధించి చరిత్ర సృష్టించారు. ఇంతటి మౌలికమైన సమస్యను, అవమానకరమైన పరిస్థితిని ఎర్రకోట ప్రసంగంలో ప్రస్తావించడమే కాకుండా జాతి చేత ప్రమా ణం చేయించడం సాహసం. దుర్భర దారిద్య్రంలో పుట్టి చాయ్‌తో కడుపు నింపుకొని ఆరెస్సెస్ కార్యకర్తగా పని చేసి, తాళికట్టిన భార్యకు దూరంగా హిమాలయ సాను వుల్లోకి వెళ్ళి తపస్సు చేసి దివ్యశక్తులు పొంది జన్మభూమి రుణం తీర్చుకోవాలనే అంకితభావంతో రాజకీయాలలో ప్రవేశించి కొండెత్తు ఎదిగిన మోదీ వంటి గండరగండడికే ఇది సాధ్యం. జాతీయ స్థాయిలో సముజ్జ్వలంగా వెలిగిపోతున్న అమితాబ్ బచ్చన్, ఆమిర్‌ఖాన్ వంటి తారలనూ, మీడియా మొఘల్ రామోజీరావు వంటి సచ్ఛీలురనూ స్వచ్ఛభారత్ అభియాన్ ప్రచారదూతలుగా నియమించి జాతిని ప్రేరేపించాలనీ, జనానికి స్ఫూర్తి ప్రసాదించాలని మోదీ నిర్ణయించినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛభారత్ అభియాన్ ప్రచారభా రాన్ని వెంకయామాత్యుడు తన భుజస్కంధాలపైన వేసు కున్నారు. కడు నిరాడంబరంగా కనిపించే వెంకయా మాత్యుడు తనకు నచ్చిన తారలను ఎంపిక చేసి వారిని పరిశుభ్రతకు ప్రతీకలుగా, నిర్మల హృదయులుగా, ఆదర్శ మూర్తులుగా, పరమపావనులుగా తెలుగునాట స్వచ్ఛ భారత్ కార్యక్రమ ప్రచారదూతలుగా ఒకానొక మహా సభలో ప్రకటించినారు. తెలుగు తేజాల జాబితాను పత్రికలలో చదువుకొనీ, టీవీలలో వినీ తెలుగుజాతి కడుంగడు సంతసించింది. వాజపేయి అయినా మోదీ అయినా మరెవరు ప్రధాని అయినా చక్రం తిప్పే తెలుగు సచివుడు వెంకయ్యే కావడం తెలుగువారు చేసుకున్న అదృష్టం. తెలుగు సమాజానికి ఎటువంటి ఉపకారం ఎన్డిఏ ప్రభుత్వాల హయంలో జరిగినా అది వెంకయా మాత్యుడి చలవే. పద్మ అవార్డులు ఇప్పించడం కావచ్చు. డీలర్‌షిప్పులు కావచ్చు. అనేక రకాల పదవులు కావచ్చు. ఇదిగో ఇటువంటి పురస్కారాలు కావచ్చు. ఆయన ఆశీస్సులు లేకుండా అసంభవం. ప్రతిభామూర్తుల జాబితా చదివినవారిలో కొందరు ఫలానావారు ఎందుకు న్నారని ఆగ్రహిస్తే మరికొందరు ఫలానావారు ఎందుకు లేరంటూ తిట్టిపోశారు. దూషణభూషణలను సమంగా తనదైన శైలిలో చిరునవ్వుతో స్వీకరించే సాత్వికుడు వెంకయామాత్యుడి చెవికి కొన్ని ఫిర్యాదులు చేరినా కలత చెందలేదు. దూతలందరూ సంపన్నులే. మోదీ భావజాలాన్ని అభిమానించేవారే. రైతుల ఆత్మహత్యలూ, ఘర్ వాప్సీలూ, భూసేకరణ చట్టానికి తూట్లూ, కార్మికుల చట్టా లకు కంతలూ వంటి చిన్ని చిన్ని విషయాలను వినకుండా, కనకుండా, మూర్కొనకుండా తమతమ వ్యాపార సామ్య్రాజ్యాలనూ, పరిశ్రమాలనూ, కీర్తిప్రతిష్ఠలనూ జాగ్రత్తగా కాపాడుకుంటూ సమాజంలో ఉన్నతులుగా చలామణి అవుతున్నవారే. ఈ జాబితాలో అరుణారాయ్, హర్షమందిర్, మేధాఫాట్కర్ వంటివారు ఉండరు. మురికి బట్టలతో, పేదరికంతో, బక్కచిక్కి అసహ్యంగా కనిపించే నిరక్షరాస్యులను, అనాగరికులను ఉద్ధరిస్తున్నామనే భ్రమలలో జీవించే సామాజిక కార్యకర్తలు ఉండరు. వెంకయామాత్యుడి జాబితాలో కనిపించేవారందరికంటే గొప్పగా, ధాటిగా ఇంగ్లీషు రాసే, మాట్లాడే అరుంధ తీరాయ్ సైతం దూతగా అనర్హురాలే. దండకారణ్యంలో క్రిమికీటకాదులు వేధిస్తుంటే లెక్కపెట్టకుండా వనవా సులను పరామర్శించడానికీ, మావోయిస్టులు నడిపిస్తున్న జనతన సర్కారు వివరాలు స్వయంగా చూసి తెలుసుకో వడానికి నడుచుకుంటూ వెళ్ళిన అరుంధతికి కార్పొరేట్ల సరసం తెలియదు. పల్లెలు చల్లగా ఉండాలని కోరుకునే వారికీ, దున్నేవాడికి భూమి ఉండాలని వాదించేవారికీ, పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ ఉద్యమించేవారికీ, మానవహక్కులకోసం పరితపించేవారికీ, ప్రభుత్వరంగం చదువుకీ, ఆరోగ్యానికీ పూచీపడాలంటూ ఉద్ఘోషించేవారికీ వెంకయామాత్యుడి జాబితాలో చోటు దక్కకపోవడంలో ఆశ్చర్యం లేదు. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తిరిగి వచ్చి వందేళ్ళు నిండిన సందర్భంగా చేస్తున్న హడా విడిలో గాంధీతత్వాన్ని గౌరవించనివారూ, గ్రామస్వరా జ్యాన్ని విశ్వసించనివారూ, సత్యం, అహింస వంటి సూత్రాలను పెద్దగా పట్టించుకోనివారూ కొందరు జాబితాలో ఉండవచ్చు. స్వచ్ఛభారత్ ఉద్యమ ప్రచా రానికి ఈ జాబితాలోని పుణ్యపురుషులూ, స్త్ర్రీలూ మనస్ఫూర్తిగా సహకరిస్తారనీ, వారికి ఎనలేని గౌరవం ఆపాదిస్తున్న కారణంగా మోదీకి ఎల్లవేళలా రుణపడి ఉం టారనే భావనకావచ్చు. జాబితా అంతా వెంకయా మాత్యులు ఒక్కరే తయారు చేశారని అనుకోనక్కరలేదు. ఈ దేశంలో నరేంద్రుడి ఆజ ్ఞలేకుండా చీమ కూడా కుట్ట దట. మధ్యతరగతినీ, ఎగువతరగతినీ, బడా వ్యాపార సంస్థలనీ, పారిశ్రామిక సంస్థలనీ కలుపుకొని ఒక మహా సంకీర్ణ సమాజాన్ని నిర్మించడానికి మోదీ, అమిత్‌షా, కమలనాధులలో ఇతర అగ్రనేతలూ ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగా చేస్తున్న ప్రయత్నంలో ఇది భాగం కావచ్చు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామా లలో కాలకృత్యాలు బహిరంగ ప్రదేశాలలో తీర్చుకునే దుస్థితిలేకుండా అవసరమైన సౌచాలయాలను కట్టిం చడం వంటి పనులు ప్రచారార్భటి లేకుండా సమర్థంగా చేయవచ్చు. కానీ స్వచ్ఛభారత్ అభియాన్‌ను వినియోగిం చుకొని అధికార పార్టీకీ, అగ్రవాద వ్యవస్థకూ సన్నిహితు లైనవారినీ, ఆమోదయోగ్యులైనవారినీ, పనికివచ్చేవారినీ సమాజంలో ఉన్నతులుగా, అనుసరణీయులుగా నిలబెట్టి వారికి నమస్కారం చేయవలసిందిగా ప్రజలను పరోక్షం గా పురమాయించడమే ఇది. మరుగుదొడ్ల నిర్మాణానికి మించిన మర్మక్రీడ. ప్రస్తుత వ్యవస్థలో రాణించాలంటే, ప్రభువులను మెప్పించాలంటే, నజరానా అందుకోవాలం టే సంపద సృష్టించడం తెలియాలి. అడ్డదారులు తొక్కినా పర్వాలేదు కానీ పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించాలి. అన్నిటికంటే ముఖ్యంగా అందంగా కనిపించాలి. నిరు పేదల గురించీ, నిర్వాసితుల గురించీ, నిరుద్యోగుల గురించీ, నిర్భాగ్యుల గురించీ, పీడితుల గురించీ, తాడి తుల గురించీ ఆలోచించకూడదు. వారి మానాన వారిని చావనివ్వాలి. అభివృద్ధి గురించీ, పెట్టుబడుల గురించీ, లాభాల గురించీ, ఆకాశహర్మ్యాల గురించీ మాట్లాడాలి. డబ్బు సంపాదించేందుకు ఏమైనా చేయవచ్చు. డబ్బుతో ఏమైనా చేయవచ్చు. ఇదీ యుగధర్మం. అర్థం చేసుకోక పోతే మీ ఖర్మం. వెంకయామాత్యుని మిత్రులందరికీ శిరస్సువంచి నమస్కరించాలి. ఆ జాబితాలోని వారి అడు గుజాడలలో నడిచి జాతిపిత కలలో కూడా ఊహించనట్టు ఈ దేశాన్ని అభివృద్ధి చేద్దాం. జై భారత్. -క్రీడి -
స్వచ్చ భారతి
-
స్వచ్ఛభారత్‌లో మంచు మనోజ్, లక్ష్మి
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ లింగంపల్లి రైల్వేస్టేషన్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమం వల్ల దేశం బాగుపడుతుందంటే అందుకు తమ మద్దతు తప్పనిసరిగా ఉంటుందని మనోజ్ తెలిపాడు. అయితే ప్రచార ఆర్భాటాల కోసం మాత్రం స్వచ్ఛభారత్‌ను ఉపయోగించుకోవద్దని రాజకీయ, సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశాడు. తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్, సినిమా హీరోలు అంతా కలిసి ప్రతిచోటా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపాడు. ఇక మరోవైపు మనోజ్ సోదరి, నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా ఫిల్మ్‌నగర్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఫిల్మ్‌నగర్ బస్తీ రోడ్లతో పాటు, అక్కడి ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు. Supporting #SwachhBharat campaign today at Lingampally Railway Station.Welcoming all to Join Me. Be there darlings :) pic.twitter.com/ryRwa1sj7e — Manchu Manoj (@HeroManoj1) November 21, 2014 -
చెత్త శుభ్రం చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తా
విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ అద్దాల్లాంటి రోడ్లు చూసి ముచ్చట పడతామని, అదే సమయంలో మనకు మన దేశంలో చెత్తతో నిండిన రోడ్లు గుర్తుకొస్తాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికే బాపూ జయంతి రోజున స్వచ్ఛభారత్ అభియాన్ ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. సిడ్నీలోని ఆల్ఫోన్స్ ఎరీనాలో హాజరైన దాదాపు 20 వేల మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భారత్‌లో అన్ని వర్గాల వాళ్లు హృదయపూర్వకంగా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారని మోదీ చెప్పారు. చెత్తను శుభ్రం చేసుకోవడాన్ని తాను గౌరవంగా భావిస్తానని ఆయన చెప్పారు. మన ఆలోచనా విధానంలో మార్పు రావాలని, చెత్త ఎత్తడానికి చెత్తవాళ్లే రానక్కర్లేదని తెలిపారు. దీపావళి తర్వాతి రోజు ఇళ్లు శుభ్రం చేసుకోవాలంటేనే కష్టపడతామని, అలాంటిది ఊరు మొత్తాన్ని కొద్దిమంది ఎలా శుభ్రం చేస్తారని ఆయన అడిగారు. ఆస్ట్రేలియాలో ఏం నేర్చుకున్నారని అడిగితే.. శ్రమకిచ్చే గౌరవం అని చెబుతానన్నారు. -
రజనీకాంత్ బీజేపీలోకి వస్తే బాగుంటుంది: కృష్ణంరాజు
రాజకీయాల పట్ల రజనీకాంత్ వైఖరి మెత్తబడిందని, గతంలో రాజకీయాలంటే ఆమడ దూరంలో ఉన్న రజనీ కాంత్.. ఇప్పుడు భగవంతుడు ఆదేశిస్తే వస్తానంటున్నారని మాజీ ఎంపీ, రెబల్ స్టార్ కృష్ణంరాజు అన్నారు. రజనీకాంత్ బీజేపీలో చేరితే తమిళనాడులోనే కాక దక్షిణాది మొత్తం పార్టీ మరింత బలపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దుమ్ములపేట రాజీవ్ గృహకల్ప సమీపంలో ఆయన సతీసమేతంగా రోడ్లు ఊడ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆ ప్రాంత వాసులకు సూచించారు. -
భీమవరంలో కేంద్ర, రాష్ట్రమంత్రుల స్వచ్ఛభారత్
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వాస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మారుస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. భీమవరం డీఎన్ఆర్ కాలేజిలో ఆయన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన భీమవరం ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. ఆస్పత్రిలో అసలు సరైన సౌకర్యాలే లేవని స్థానికులు కామినేని శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలను మెరుగు పరుస్తామని, దీన్ని వంద పడకల ఆస్పత్రిగా కూడా మారుస్తామని ఆయన స్థానికులకు హామీ ఇచ్చారు. -
'స్వచ్ఛభారత్’లో సమంత
-
సమంత కూడా చీపురు పట్టింది!
అందాల తార సమంత చీపురు పట్టింది. చేతులకు గ్లోవ్స్ తొడుక్కుని కర్ర చీపురు, మామూలు చీపురు కూడా పట్టుకుని పలు ప్రాంతాలను శుభ్రం చేసింది. హీరో రామ్ స్వచ్ఛభారత్‌కు ఆమెను నామినేట్ చేయడంతో ఆ సవాలు స్వీకరించింది. ప్రభుత్వ పాఠశాల ఆవరణ, చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేసింది. స్వయంగా సమంతే తమ స్కూలు వద్దకు వచ్చి చీపురు పట్టుకుని తుడుస్తుండటంతో విద్యార్థులు, చుట్టుపక్కల వాళ్లు అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సమంత చెప్పింది. దాంతోపాటు, పారిశుధ్య కార్మికులను కలుసుకుని వాళ్లతో ఫొటోలు దిగింది. వాళ్లు ప్రతిరోజూ ఈ పని చేస్తుంటారని, కానీ అందుకు వాళ్లకు కేవలం నెలకు 5వేల రూపాయలు మాత్రమే లభిస్తుందని, అది సరికాదని చెప్పింది. అందువల్ల మీ చెత్తను మీరే శుభ్రం చేసుకోవాలని కూడా అందరికీ ట్విట్టర్ ద్వారా సలహా ఇచ్చింది. ఇక ఈ కార్యక్రమంలో తనతో పాటు ఉంటూ సహకారం అందించిన వాళ్లకు కృతజ్ఞతలు తెలిపింది. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో సమంతతో పాటు నీరజా కోన, మరికొంతమంది పాల్గొన్నారు. They do this everyday. So you think, so what they get paid. 5000rs.enough? No right. So clean your crap yourself!! pic.twitter.com/cvRsh5gSGt — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) November 15, 2014 #swachhbharath glad to be a part of the bigger picture. pic.twitter.com/YnQU2PW3O3 — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) November 15, 2014 "@sravi_sam: The besties @NeerajaKona and @Samanthaprabhu2 at the campaign #swachBharath! pic.twitter.com/XxXLrJGXOh" — Tarun (@tarun5848) November 15, 2014 Our @Samanthaprabhu2 doing her part for #SwachhBharath :) pic.twitter.com/ayC1JBvGQK — ?ai s?ava? (@sravan523) November 15, 2014 -
విశాఖ నెమ్మదిగా కోలుకుంటోంది: చంద్రబాబు
హుదూద్ తుపాను నుంచి విశాఖపట్నం నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలోని ఆరిపాక ప్రాంతంలో జన్మభూమి - మాఊరు కార్యక్రమంలోను, సబ్బవరం ప్రాంతంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలోను చంద్రబాబు పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో విద్యార్థులతో ఆయన ప్రమాణం చేయించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తమవంతు కృషి చేస్తామని వాళ్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఇక విశాఖపట్నానికి తాను పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పారు. మొక్కలు నాటుదామని, పరిశుభ్రత పాటిద్దామని విశాఖ వాసులకు ఆయన పిలుపునిచ్చారు. -
విశాఖలో చీపురు పట్టిన వెంకయ్య
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చీపురు పట్టుకున్నారు. రెండు వారాల క్రితం హుదూద్ తుఫాను అల్లకల్లోలలం సృష్టించిన విశాఖపట్నం ప్రాంతంలో ఆయన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొన్నారు. తన మద్దతుదారులతో కలిసి బీచ్ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. తుఫాను గాలులకు తీరానికి కొట్టుకొచ్చిన శిథిలాలను వెంకయ్య బృందం తొలగించింది. స్వచ్ఛభారత్‌ను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు వ్యాధుల బారి నుంచి తమను తాము కాపాడుకోవాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ ఉద్యమానికి అపూర్వ స్పందన వస్తోందన్నారు. గత మూడు రోజులుగా ఆయన విశాఖలో ఉన్నారు. తుఫాను ప్రభావంతో అల్లకల్లలోంగా మారిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సాయం అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. తుఫాను కారణంగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 46 మంది మరణించారు.