లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శనివారం జరిగిన ఔరాయ ప్రమాదంపై బహుజన్ సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి స్పందించారు. యూపీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆమె మండిపడ్డారు. వారి వల్లే ఔరాయ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ఔరాయ వద్ద కొంత మంది వలసకూలీలు రాజస్థాన్ నుంచి గోరఖ్‌పూర్ ట్రక్‌లో వెళుతుండగా ఎదురుగా వస్తున్న మరో ట్రక్ ఢీ కొని 24 మంది మరణించారు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే.
(యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 24 మంది మృతి)
ఈ విషయం పై మాయావతి శనివారం మీడియాతో మాట్లాడుతూ ...‘రాష్ట్రంలోకి వచ్చే, వెళ్లే వారికి సంబంధించి అన్ని బాధ్యతలను ప్రభుత్వమే తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఈ విషయాన్ని అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రమాదం జరిగింది’ అని ఆమె ఆరోపించారు. దీనికి కారణమైన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని ఆమె ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌కి విజ్ఞప్తి చేశారు. అలాగే బాధితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని కూడా మాయవతి కోరారు. దీంతోపాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధికంగా అండగా నిలవాలని విన్నవించారు. అదేవిధంగా వలసకూలీలు ఎవరూ కాలినడకన రావొద్దని, రైల్వే స్టేషన్లకు వెళ్లి తమను ఇంటికి పంపే ఏర్పాట్లు చేయమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని సూచించారు. ప్రభుత్వం పేదలందరికి రక్షణ కల్పించాలని, ఆహారం అందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేదల సంక్షేమం గురించి ఆలోచన చేయాలని సూచించారు. కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టి పేదలకు సహాయాన్ని అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment