Auraiya
-
ఒకే ట్రక్కులో శవాలతో పాటు కూలీలు
ప్రయాగ్‌రాజ్ : ఇప్పటికే జీవనోపాధి కోల్పోయి జీవచ్ఛవాలుగా బతుకుతున్న వలస కూలీలను శవాలతో పాటు ఒకే ట్రక్కులో తరలించిన అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఔరాయలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వలస కూలీల ట్రక్కును మరో ట్రక్కు ఢీ కొట్టడంతో 27 మంది మృత్యువాత పడ్డారు. 33 మంది గాయాలపాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకుంటున్న కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ట్రక్కులను ఏర్పాటు చేసింది. అయితే వీటిలో ఓ వైపుగా పాలిథీన్ కవర్లలో కప్పిన శవాలుండగా, మరో వైపు కూలీలు కూర్చున్నారు. కనీసం శవాలను ఐస్ బాక్సుల్లోనూ భద్రపర్చలేదు. దీంతో వాటి నుంచి వస్తున్న దుర్వాసనతోనే వందల కి.మీ ప్రయాణిస్తూ ఉన్నారు. (యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 24 మంది మృతి) తమ పరిస్థితిని తెలియజేస్తూ ఓ ట్రక్కులోని వలస కార్మికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం దృష్టికి వచ్చిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్ వలస కార్మికులపై నిర్లక్ష్య ధోరణి వహిస్తున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. శవాలు తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లు, గాయపడినవారిని చేరవేసేందుకు బస్సులను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం ఆదివారం సాయంత్రం ప్రయాగ్‌రాజ్ వద్ద శవాలను అంబులెన్స్‌లోకి మార్చింది. ఇది ప్రమాదం జరిగిన ఔరియా నుంచి 300 కి.మీ దూరం కావడం గమనార్హం. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. (ఎంత దైన్యం.. ఎంతెంత దూరం..!) -
ఔరాయ ప్రమాదానికి కారణం వారే: మాయావతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శనివారం జరిగిన ఔరాయ ప్రమాదంపై బహుజన్ సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి స్పందించారు. యూపీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆమె మండిపడ్డారు. వారి వల్లే ఔరాయ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ఔరాయ వద్ద కొంత మంది వలసకూలీలు రాజస్థాన్ నుంచి గోరఖ్‌పూర్ ట్రక్‌లో వెళుతుండగా ఎదురుగా వస్తున్న మరో ట్రక్ ఢీ కొని 24 మంది మరణించారు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే. (యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 24 మంది మృతి) ఈ విషయం పై మాయావతి శనివారం మీడియాతో మాట్లాడుతూ ...‘రాష్ట్రంలోకి వచ్చే, వెళ్లే వారికి సంబంధించి అన్ని బాధ్యతలను ప్రభుత్వమే తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఈ విషయాన్ని అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రమాదం జరిగింది’ అని ఆమె ఆరోపించారు. దీనికి కారణమైన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని ఆమె ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌కి విజ్ఞప్తి చేశారు. అలాగే బాధితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని కూడా మాయవతి కోరారు. దీంతోపాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధికంగా అండగా నిలవాలని విన్నవించారు. అదేవిధంగా వలసకూలీలు ఎవరూ కాలినడకన రావొద్దని, రైల్వే స్టేషన్లకు వెళ్లి తమను ఇంటికి పంపే ఏర్పాట్లు చేయమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని సూచించారు. ప్రభుత్వం పేదలందరికి రక్షణ కల్పించాలని, ఆహారం అందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేదల సంక్షేమం గురించి ఆలోచన చేయాలని సూచించారు. కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టి పేదలకు సహాయాన్ని అందించాలని కోరారు. ('తినడానికి తిండి లేదు.. నడిచేందుకు ఓపిక లేదు') -
పట్టాలు తప్పిన కైఫియత్ ఎక్స్‌ప్రెస్
అరియా: ఉత్తర్‌ప్రదేశ్‌లో కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటన మరువక ముందే మరో రైలు పట్టాలు తప్పింది. అరియా వద్ద న్యూఢిల్లీ నుంచి హౌరా వెళ్తున్న కైఫియత్ ఎక్స్‌ప్రెస్ అచ్చాల్దా స్టేషన్ దాటాక పట్టాలు తప్పింది. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే శాఖ పీఆర్వో అనిల్ సక్సేనా తెలిపారు. ఈ ఘటనలో 74 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను అచ్చాల్దాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ హోంశాఖ కార్యదర్శి అనిల్‌కుమార్ తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై మాట్లాడిన రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.