పట్టాలు తప్పిన కైఫియత్ ఎక్స్‌ప్రెస్
అరియా: ఉత్తర్‌ప్రదేశ్‌లో కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటన మరువక ముందే మరో రైలు పట్టాలు తప్పింది. అరియా వద్ద న్యూఢిల్లీ నుంచి హౌరా వెళ్తున్న కైఫియత్ ఎక్స్‌ప్రెస్ అచ్చాల్దా స్టేషన్ దాటాక పట్టాలు తప్పింది. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే శాఖ పీఆర్వో అనిల్ సక్సేనా తెలిపారు.
ఈ ఘటనలో 74 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను అచ్చాల్దాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ హోంశాఖ కార్యదర్శి అనిల్‌కుమార్ తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై మాట్లాడిన రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.