సాక్షి, న్యూఢిల్లీ : ఆరుషి తల్లిదండ్రులు ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. కూతురు, పని మనిషి హేమరాజ్‌లను హత్య చేశారంటూ ఆరోపణలు ఎదుర్కున్న తల్వార్ దంపతులు జైలు నుంచి విడుదలయ్యాక అజ్ఞాతవాసంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. కూతురిని కోల్పోయిన నాటి నుంచి విడుదలయ్యే సమయం దాకా ఏనాడూ వాళ్లు మీడియా ముందు నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలో హాట్‌స్టార్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్లు తొలిసారి స్పందించారు.
‘‘దస్న జైల్లో ఉన్న నాలుగేళ్లు నరకం అనుభవించాం. ప్రతీరోజూ ఏడుస్తూనే ఉన్నాం. అక్కడనుంత సేపు ఎంతో భావోద్వేగంగా గడిపాం. పక్క సెల్‌లో ఉన్న ఓ అమ్మాయిలో మా కూతురి(ఆరుషి)ని చూసుకుంటూ గడిపాం. ఎట్టకేలకు విడుదలతో కాస్త ఉపశమనం దొరికినట్లయ్యింది. కానీ, బయటికొచ్చాక ఎలా? అది ఇంకా భయంకరమైన పరిస్థితి. లోకం మా గురించి ఏమనుకుంటుందో అంటూ క్షణక్షణం మనోవేదనతో గడపాలి. నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేంత వరకు మాకీ పరిస్థితి తప్పదు’’ అని వారన్నారు.
అయితే పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త మారుతుందని.. కోర్టు తీర్పు తర్వాత కొందరు తమపై సానుభూతి చూపించటం మొదలుపెట్టారని రాజేశ్ తల్వార్ చెప్పారు. కూతురిని కోల్పోయామని, ఇక మిగిలిన జీవితం ఆమె జ్ఞాపకాలతోనే బతుకుతామని, కూతురి పేరిట సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామని నుపుర్ తల్వార్ తెలిపారు. అసలు హంతకులు ఎవరు అన్న ప్రశ్నకు సమాధానానికి.. ఆ విషయం భగవంతుడే తేల్చాలని వారన్నారు.
ఇక హేమరాజ్ మరణంపై ఆ సమయంలో స్పందించే ఆస్కారం లేకుండా పోయిందన్న తల్వార్ దంపతులు.. అతని కుటుంబానికి అభ్యంతరం లేకపోతే ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment