సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని తేని జిల్లాలో బోడినాయకనూర్ అటవీప్రాంతంలోని కురంగని కొండల్లో ఆదివారం చెలరేగిన కార్చిచ్చు ఘటనలో మృతి చెందిన ట్రెక్కర్ల సంఖ్య 10కి చేరుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు పురుషులతో పాటు ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై, తిరుప్పూర్, ఈరోడ్ నుంచి ఈ అటవీప్రాంతానికి ట్రెక్కింగ్ కోసం వచ్చిన 36 మంది ఉద్యోగులు, విద్యార్థులు తిరుగుప్రయాణంలో కార్చిచ్చులో చిక్కుకోవడం తెల్సిందే. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు సోమవారం నాటికి∙26 మంది ట్రెక్కర్లను రక్షించారు.
కాగా, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50 వేల నష్టపరిహారాన్ని సీఎం పళనిస్వామి ప్రకటించారు. రాష్ట్ర అగ్నిమాపక సిబ్బందితో పాటు, నాలుగు రక్షణశాఖ హెలికాప్టర్లు, 16 మంది గరుడ్ కమెండోలు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. కాగా, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్‌హాసన్‌తో పాటు సీపీఐ, పీఎంకే నేతలు అగ్నిప్రమాద మృతులకు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment