సాక్షి, చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మూడు భవనాలు కూలి 15 మంది మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం. స్థానికులు, అగ్నిమాపక సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా మృతుల్లో ముగ్గురు పురుషులు, 10మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతుల వివరాలు గురు (45), రాంనాథ్ (20), ఆనంద్ కుమార్ (40), హరిసుధ (16), శివగామి (45), ఒవియమ్మా (50), నిత్యా (30), వైదేహి (20), తిలగవతి(50), అరుకాని (55), రుక్మణి (40), చిన్నమ్మాల్ (70), అక్షయ (7), లోగురాం (7). ఈ ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షం బీభత్సంగా కురుస్తోంది. నిన్న 14 జిల్లాల్లో 53 చోట్ల 10 సె.మీకి పైగానే వర్షం కురిసింది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు పూర్తిగా నిండాయి. లోతట్టు ప్రాంతాలు, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి. మరో రెండు రోజులు వర్షం కొనసాగనుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రులందరూ వారి వారి జిల్లాలకు పరుగులు తీశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ఇక, ఈశాన్య రుతుపవనాలతో ఈ ఏడాది పడాల్సిన వర్షం పూర్తి స్థాయిలో పడింది. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో అధికార యంత్రాంగం ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది.
వీడని వాన..
ఆదివారం ఒక్క రోజు 14 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగానే వర్షం పడింది. తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం, కడలూరులలో అతి భారీ వర్షాలు పడ్డాయి. తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, ఈరోడ్, నీలగిరి, కోయంబత్తూరు, దిండుగల్, తేని జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. మదురై, పెరంబలూరు, అరియలూరు, తిరుచ్చి, తంజావూరు, పుదుకోట్టై , నాగపట్నం , శివగంగై జిల్లాల్లో మోస్తరుగా వర్షం పడుతోంది. తూత్తుకుడి జిల్లాలో వర్ష విళయానికి లోట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కి ఉన్నాయి. వేలాది ఇళ్లల్లోకి నీళ్లు చొరబడడంతో అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరంచేసింది. తూత్తుకుడి ప్రధాన రైల్వే స్టేషన్‌ను మూసివేయాల్సినంతగా పరిస్థితి మారింది. ప్లాట్‌ఫామ్‌లు సైతం కనిపించని రీతిలో నీళ్లు ఇక్కడ చుట్టుముట్టాయి.
జాతీయ రహదారిలోనూ వరద ఉధృతి హోరెత్తడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం తప్పలేదు. తిరునల్వేలి జిల్లాల్లో అన్ని జలాశయాలు పూర్తిగా నిండాయి. కుట్రాలం మరీ కుండపోతగా మారడంతో ఆ దరిదాపుల్లో ఎవ్వర్నీ అనుమతించడం లేదు. తామర భరణి నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఆ తీరం వెంబడి గ్రామాలమధ్య సంబంధాలు తెగాయి. అనేక ఆలయాలు నీట మునిగి ఉన్నాయి. రామనాథపురం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. రామేశ్వరంలో గాలి ప్రభావానికి 30 పడవలు దెబ్బతిన్నాయి. కడలూరు జిల్లాలో అయితే, అతి పెద్ద చెరువుగా ఉన్న వీరానం నిండింది. ఉబరి నీటి విడుదలతో అనేక గ్రామాల్లోని పంట పొల్లాలు మునిగాయి. డెల్టాలోని తిరువారూర్, తంజావూరు, నాగపట్నం, అరియలూరు, పెరంబలూరు, పుదుకోట్టై జిల్లాల్లో అయితే, అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. వరి సాగులో అన్నదాత నిమగ్నమై ఉన్న దృష్ట్యా, వర్షం కారణంగా పొలాలన్నీ చెరువుల్ని తలపించే పరిస్థితి.
భారీ వర్షాలు, పలువురు మృతి
మరోవై ఈ వర్షాలతో నిన్నటి పది మంది ఇప్పటి వరకు మరణించారు. శుక్రవారం ఇళ్లు కూలడంతో కడలూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు మరో ఏడుగురు బలి అయ్యారు. తంజావూరులో ఇంటి గోడ కూలడంతో దురై కన్ను(70), పుదుకోట్టైలో మోటార్ సైకిల్‌తో పాటు వరదల్లో కొట్టుకెళ్లి ఓ యువకుడు గల్లంతయ్యాడు. చెన్నై అంబత్తూరులో రోడ్డుపై తవ్విన గోతిలో వర్షంపు నీరు చేరడంతో అది తెలియక అటు వైపుగా వచ్చిన షేక్ అలీ అందులోపడి విగతజీవి అయ్యాడు. తిరునల్వేలిలో తామరభరణిలో 81 ఏళ్ల వృద్ధుడు కొట్టుకెళ్లాడు. ఇక, కడలూరు, నాగపట్నంలలో కల్వర్టులను దాటుతూ వరద ఉదృతిలో మరో ముగ్గురు కొట్టుకెళ్లారు. వీరి జాడ కాన రాలేదు. మరణించి ఉంటారని నిర్ధారించిన పోలీసులు, మృతదేహాల కోసం గాలిస్తున్నారు.
మంత్రుల పరుగు..
వర్షం మరో రెండు రోజులు కొనసాగనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించడంతో అధికార వర్గాలు మరింత అప్రమత్తం అయ్యాయి. వర్షం బీభత్సంగా పడుతుండడంతో మంత్రులు అందరూ తమ తమ జిల్లాలకు చెన్నై నుంచి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. అధికార వర్గాలతో కలిసి సహాయక చర్యల్లో మునిగి ఉన్నారు. ఇక, ఈ వర్షం రూపంలో పెను విపత్తు అన్నది చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్ని మరింత విస్తృతం చేయాలని జిల్లాల కలెక్టర్లకు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. అలాగే, సోమవారం సచివాలయంలో సీఎం పళనిస్వామి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఇక, వర్షాల ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్టు ఆదేశాలు జారీ చేశారు. కాగా, వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ వర్గాలు సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని, బాధితులకు అండగా నిలవాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు.
విమాన సేవలకు ఆటంకం
వర్షం కారణంగా చెన్నైలో విమాన సేవలకు ఆటంకాలు నెలకొన్నాయి. కుండపోతగా విమానాశ్రయ పరిసరాల్లో ఉదయాన్నే వర్షం పడింది. దీంతో ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, బెంగళూరు వైపుగా వెళ్లాల్సిన అనేక విమానాలు టేకాఫ్ చేసుకునేందుకు ఇబ్బందులు నెలకొన్నాయి. దీంతో కాస్త ఆలస్యంగా ఈ విమానాలు బయలుదేరాయి. అలాగే, సింగపూర్, దోహా, దుబాయ్, బక్రెయిన్‌లకు బయలుదేరాల్సిన విమానాలు గంటన్నర ఆలస్యంగా టేకాఫ్ చేసుకున్నాయి. చెన్నై నుంచి కోలాలంపూర్ బయలుదేరిన విమానం టేకాఫ్ చేసుకున్న కాసేపటికి సాంకేతిక లోపం కారణంగా ల్యాండింగ్‌ను అనుమతించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ విమానాన్ని బెంగళూరుకు దారిమళ్లించారు. అలాగే, కొలంబోకు బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపానికి గురైంది. దీంతో ఆ విమానం మూడు గంటల సేపు ఆలస్యంగా బయలుదేరింది. ఈ కారణాలతో ఆదివారం చెన్నైలో విమాన సేవలకు ఆటంకాలు నెలకొన్నాయి. అలాగే, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment