సాక్షి, న్యూఢిల్లీ: చాయ్ పే చర్చా..! మోదీ వచ్చాక ఈ పదం తరచూ వినబడుతోంది. పోతూ పోతూ బ్రిటీష్ వారు మనకు వారసత్వంగా ఇచ్చి వెళ్లిన తేనీటి విందు సంప్రదాయం ఇప్పుడు ఖండాంతరాలకూ పాకింది. విదేశీ పర్యటనల్లో మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్కడి దేశాధ్యక్షులతో చాయ్ పే చర్చా.. కార్యక్రమాలు జరుపుతూ పలు కీలక ఒప్పందాలు కూడా చేసుకున్నారు.
అయితే, ఇప్పటి వరకు మనకు తెలిసిన టీ మాత్రమే కాకుండా పుణెలో కొత్త రకం చాయ్ అందుబాటులోకి వచ్చింది. సంప్రదాయ తేనీటికి అలవాటు పడిన వారు దీని విషయంలో కాస్త అలర్ట్‌గా ఉండాల్సిందే..! లేదంటే మట్టి పాత్రల్లో మాంచి వేడి మీద ఉండే ఈ టీతో నాలుక చుర్రుమంటుంది. ఎందుకంటే ఇది అల్లాటప్పా టీ కాదు..! ‘తందూరి చాయ్’. పుణెలోని ‘చాయ్ లా’రెస్టారెంట్ ఈ సరికొత్త చాయ్‌తో తేనీటీ ప్రియులకు కొత్త అనుభూతిని అందిస్తోంది. పొగలుగక్కే ఈ సువాసనల టీ కోసం జనం ఎగబడుతున్నారు.
తందూరి చాయ్ ఇలా మొదలైంది..
‘చాయ్ లా’ రెస్టారెంట్ నిర్వాహకులు ప్రమోద్ బంకర్, అమోల్ రాజ్‌డియో మాట్లాడుతూ.. ‘ పాలను మా అమ్మమ్మ లోతైన నిప్పల కుండలో పెట్టి మరిగించేది. దాన్నుంచే ఈ తందూరి చాయ్ ఐడియా వచ్చింద’ని తెలిపారు. ‘ముందుగా చిన్న చిన్న మట్టి పాత్రలను లోతైన నిప్పుల కొలిమిలో పెడతాం. అప్పటికే సగం తయారైన చాయ్‌ని ఆ పాత్రల్లో పోస్తాం. అంతే..! చుట్టూ వేడి తగలడంతో పొగలు కక్కే సువాసనల తందూరి చాయ్ రెడీ.
తందూరిపై ట్విటర్‌లో స్పందనలు..
ఇది సంప్రదాయ టీ కన్నా రుచిగా ఉంటుందా? అన్న ప్రశ్నకు ప్రమోద్ స్పందిస్తూ.. ఇప్పటికే అనూహ్య స్పందన వచ్చిందన్నారు. రాజస్థాన్‌కు చెందిన ఓ ఎంపీ ఈ చాయ్‌కి ముగ్ధుడయ్యారని ఆయన తెలిపారు. ‘టీ అంటే నాకు చాలా ఇష్టం. తందూరి చాయ్ కోసమే ఇంత దూరం వస్తున్నా’నంటూ ఒక తేనీటి ప్రియుడు తన ట్వీట్‌లో ఆనందం వ్యక్తం చేశారు.‘ చాయ్‌కి నేను విరాభిమానిని. కానీ, తందూరి చాయ్.. మరీ అంత రుచిగా ఏం లేదు. సంప్రదాయ తేనీటికే నా ఓటు అని మరొకరు పేర్కొన్నారు.‘ఈ కొత్త చాయ్ విధానం మనదే అని త్వరగా పేటెంట్ హక్కులు తీసుకోండి లేదంటే పశ్చిమ దేశీయులు. ఇది స్మోక్ టీ. మేమే కనుగొన్నాం అంటార’ని.. మరొకరు సరదా వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment