'క్యాబ్ ఓనర్లకు సుప్రీం ఝలక్'
న్యూఢిల్లీ: ఇక నుంచి ఢిల్లీ రోడ్లపై పెట్రోల్, డీజిల్ క్యాబ్లను అనుమతించబోమంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డెడ్ లైన్ ఇక పొడిగించడం కుదరదని స్పష్టం చేసింది. మే 1నుంచి సీఎన్జీతో ఉన్న క్యాబులను మాత్రమే అనుమతిస్తామంటూ శనివారం తీర్పులో తెలిపింది. అయితే, ఆల్ ఇండియా పర్మిట్ ఉన్న వాహనాలకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఢిల్లీలో విపరీతంగా కాలుష్యం పెరిగిన నేపథ్యంలో క్యాబ్లను ఏప్రిల్ 30లోగా పెట్రోల్, డీజిలేతర సీఎన్జీ వాహనాలుగా మార్చుకోవాలని ఆదేశించింది.
అయితే, ఆ గడువును మరోసారి పొడిగించాలని క్యాబ్స్ తరుపువారు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ మే 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాహనాలు అనుమతించబోమని స్పష్టం చేసింది. మన దేశంలో డీజిల్, పెట్రోల్ వాహనాలను సీఎన్ జీ వాహనాలుగా మార్చుకునే సాంకేతిక పరిజ్ఞానం తమకు అందుబాటులో లేదని, అందుకే తమకు కొంత గడువు ఇవ్వాలని క్యాబ్స్ యజమానులు సుప్రీంను అభ్యర్థించగా ఇప్పటికే చాలినంత సమయం ఇచ్చామని, దేశంలో ఉన్నత న్యాయ స్థానం ఇచ్చే ఆదేశాలు, మార్గదేశాలు పాటించి తీరాలని సుప్రీం గట్టిగా మందలించింది.