
లక్నో : బుల్లెట్ కారణంగా గాయపడిన ఆపిల్ కంపెనీ ఉద్యోగి వివేక్ తివారి సరైన సమయంలో చికిత్స అందలేదు కాబట్టే మృతి చెందాడని పోస్ట్‌మార్టమ్ నివేదిక వెల్లడించింది. కాల్పుల్లో గాయపడిన తర్వాత 55 నిమిషాల పాటు వివేక్ ప్రాణాలతోనే ఉన్నాడని పేర్కొంది. కాగా బూటకపు ఎన్‌కౌంటర్ వల్లే వివేక్ మరణించాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోస్ట్‌మార్టమ్ నివేదిక, ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన విషయాలు కీలకంగా మారాయి.
ఈ ఘటనలో ప్రత్యక్షసాక్షి అప్సా ఖాన్(పేరు మార్చాం) తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే..
‘కాల్పులు జరిగిన తర్వాత తివారి తన కారును నడుపుకొంటూ సుమారు 300 మీటర్లు ప్రయాణించాడు. ఆ తర్వాత షాహిద్ పాత్‌లోని అండర్‌పాస్ పిల్లర్‌ను ఢీకొన్నాడు. అప్పటివరకు అతడిని వెంబడించిన కానిస్టేబుల్లు ప్రశాంత్ చౌధురి, సందీప్ కుమార్ మాయమయ్యారు. ఆ తర్వాత పోలీసు పెట్రోలింగ్ వాహనం వచ్చింది. అయితే వారు అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. చాలా సేపటివరకు ఎదురుచూశారు. అంబులెన్స్ రాకపోవడంతో ఓ కారులో అతడిని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నిజానికి ఆ సమయంలో కేవలం పది నిమిషాల్లో ఆస్పత్రికి చేరుకోవచ్చు. అయితే ఆస్పత్రికి తీసుకువెళ్లిన తర్వాత కూడా తివారి చికిత్సపై కాకుండా.. కేవలం నా సాక్ష్యాన్ని రికార్డు చేయడంలోనే వారు దృష్టి కేంద్రీకరించారు’.
55 నిమిషాల పాటు బతికే ఉన్నాడు..
శుక్రవారం ప్రశాంత్ చౌధురి అనే కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో టెకీ వివేక్ తివారి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అర్ధరాత్రి 1. 45 నిమిషాల ప్రాంతంలో తివారిపై దాడి జరగగా అతడిని 2.05 నిమిషాలకు ఆస్పత్రిలో చేర్చారు. తీవ్ర గాయాలపాలైన అతడు 2.25 నిమిషాలకు ప్రాణాలు కోల్పోయాడు. అయితే గాయపడినప్పటి నుంచి మృతి చెందేవరకు సుమారు 55 నిమిషాల పాటు తివారి ప్రాణాలతో ఉన్నాడని పోస్ట్‌మార్టమ్ నివేదిక పేర్కొనడం, ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాలను బట్టి చూస్తుంటే కేవలం పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే వివేక్ మృతిచెందాడనే విమర్శలకు బలం చేకూరుతోంది. కాగా ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపానని ప్రశాంత్ చౌధురి చెబుతుండగా... ఇది ప్రభుత్వ హత్యే అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేగుతోంది. దీంతో ఈ ఘటనపై సిట్‌తో విచారణ జరిపిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment