డిప్యూటీ సీఎంకు 44వేల పెళ్లి ఆఫర్లు!
డిప్యూటీ సీఎంకు 44వేల పెళ్లి ఆఫర్లు!
Published Fri, Oct 21 2016 2:11 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఇప్పుడక్కడ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. ఎందుకంటే, ఎక్కడైనా రోడ్లు బాగోకపోతే ఫిర్యాదుచేయాలని ఆయన ఒక నెంబర్ ఇస్తే.. దానికి బదులు ఆయన్ను పెళ్లి చేసుకుంటామంటూ ఏకంగా 44వేల ప్రపోజల్స్ ఆ నంబరుకు వాట్సప్‌లో వచ్చాయట. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. ప్రియ, అనుపమ, మనీష, కంచన్, దేవిక.. ఇలా మొత్తం 44 వేల మందికి పైగా అమ్మాయిలు ఆయన ఓకే అంటే పెళ్లి చేసుకోడానికి సిద్ధమంటూ ప్రతిపాదనలు పంపారు. ఈ నంబరుకు మొత్తం 47వేల మెసేజిలు వచ్చాయని, వాటిలో 44వేలు ఈ పెళ్లి ప్రతిపాదనలేనని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. కేవలం 3వేల మెసేజిలు మాత్రమే రోడ్ల గురించి ఉన్నాయి.
తమ శరీర కొలతలు, రంగు, ఎత్తు లాంటి వివరాలన్నింటినీ కూడా ఆ మెసేజిలలో ఇచ్చారు. కొన్నాళ్ల పాటు క్రికెట్ ఆడి.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తేజస్వి యాదవ్ (26).. ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ చిన్న కొడుకు. చాలామంది అది తేజస్వి యాదవ్ సొంత నెంబరు అనుకుని ఈ మెసేజిలు పెట్టేశారట. ఇప్పటికి తాను ఇంకా బ్రహ్మచారిని కాబట్టి సరిపోయింది గానీ, పెళ్లి అయి ఉంటే తాను పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయి ఉండేవాడినని తేజస్వి సరదాగా అన్నారు. అయితే తాను పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించే తేజస్వికి గతంలో ఒక విద్యార్థి తనకు రావల్సిన స్కాలర్‌షిప్ రావట్లేదంటూ ఫేస్‌బుక్‌లో ఫిర్యాదుచేయగా, ఆయన సంబంధిత అధికారులకు చెప్పి వెంటనే ఇప్పించారు.
Advertisement
Advertisement