
రాష్ట్రపతి, స్పీకర్‌తో టీ సభాపతుల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో పాటు శాసన సభ కార్యదర్శి సదారాం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ కంటే ముందు వీరు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కూడా కలిశారు. వీరితో పాటు టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, పార్టీ ఎంపీలు వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, కల్వకుంట్ల కవిత, జి.నగేశ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రొఫెసర్ సీతారాంనాయక్, బీబీ పాటిల్, బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్, శాసనసభ్యుడు ఇంద్రకరణ్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రుడు, వేణుగోపాలాచారి ఉన్నారు. రాష్ర్టంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సభా సాంప్రదాయాలపై అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు లోక్‌సభ స్పీకర్‌కు మధుసూదనాచారి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. దీంతో ఆమె కూడా సానుకూలంగా స్పందించి సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ర్టపతితో భేటీ సందర్భంగా తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల తీరుతెన్నులను స్పీకర్ బృందం వివరించింది. ఈ సందర్భంగా ప్రణబ్ స్పందిస్తూ.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో ఎదురయ్యే సమస్యలను అర్థంచేసుకుని ముందుకు సాగుతూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని సూచించారు. ఇటీవల జూబ్లీహాల్‌లో జరిగిన శాసనమండలి సమావేశాల గురించి మండలి చైర్మన్ స్వామిగౌడ్ వివరించగా.. ఆ భవనానికి ఉన్న చారిత్రక విశేషాలను, ఆ భవనంతో తనకున్న అనుబంధాన్ని రాష్ర్టపతి గుర్తు చేసుకున్నారు.