మనసులోని భావాలను వచన కవిత్వంలో సూటిగా చెప్పొచ్చు. పదునైన వచన కవిత్వానికన్నా పదునైనది ర్యాప్. తీవ్ర భావోద్వేగాలను సైతం ర్యాప్‌లో సున్నితంగా, అదే సమయంలో శక్తిమంతంగా చూపించవచ్చు. అంతటి శక్తిమంతమైన ర్యాప్‌తో ప్రణవ్ చాగంటి ప్రపంచాన్ని తన వైపుకి తిప్పుకుంటున్నాడు. ర్యాప్ పాడుతూ యువతకు తెలుగును పరిచయం చేస్తున్నాడు. న, మ అక్షరాలతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రెండు అక్షరాల ర్యాప్‌ను సృష్టించాడు. తనలో నిద్రాణంగా ఉండిపోయిన భావాలను బయటకు తీసుకురావడానికి ర్యాప్ తనను ఎంచుకుంది అంటున్న 29 ఏళ్ల ఈ హైదరాబాద్ ర్యాపర్ గురించి అతడి మాటల్లోనే..!
నా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తయి ఉద్యోగాన్వేషణలో ఉన్న సమయంలో మా చుట్టాలాయన ఒకరు వచ్చి, ‘నేవీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబ్ అవకాశాలు ఉన్నాయి. చేరిపో, మంచి భవిష్యత్తు ఉంటుంది’ అని చెప్పారు. నాకు అమ్మని వదిలి ఉండటం ఇష్టం లేదు. అయినా ఇంట్లో వారి బలవంతం మీద రెండేళ్లు నేవీలో చేరాను. క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ అవ్వడం వల్ల చాలాసేపు సముద్రం మీదే ఉండవలసి వచ్చేది. నౌక పోర్టులోకి వచ్చినా కొద్దిగంటల్లోనే మళ్లీ బయలుదేరిపోతుంది.
.
ఇంజనీరింగ్ చదివానన్న మాటే గానీ చిన్నప్పటి నుంచీ నాకు సంగీతమంటే చాలా ఇష్టం. భాషాభేదం లేకుండా అన్ని పాటలు వినేవాడిని. కానీ నౌకలో ఆ అవకాశం దొరికేది కాదు. అమ్మానాన్నలకు, సంగీతానికి దూరంగా ఉండటం నా మనసుకి నచ్చలేదు. అందుకే ఆ ఉద్యోగంలో ఉండలేక వచ్చేశాను. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉండటం నా నైజం. ఒక లైన్ రాయగానే, ఏదో ఒక పాట రాయొచ్చుగా అనుకుంటాను. నా మైండ్ క్షణం కుదురుగా ఉండేది కాదు. రచన, సంగీతం.. వీటి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండేది.
కదిలించిన యాసిడ్ ఘటన
ఢిల్లీలో 2004లో జరిగిన ఒక యాసిడ్ దాడి దేశంతోపాటు నన్నూ కదిలించేసింది. ప్రేమను ఒప్పుకోకపోతే యాసిడ్ దాడి చేయడమేంటి?! మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అనుకున్నాను. ఎమోషనల్‌గా షేక్ అయ్యాను. ఆ భావాన్ని ఎలా బయటపెట్టాలో ఆ చిన్న వయసులో నాకు అర్థం కాలేదు. పెద్దవాడినయ్యాక పాటల రూపంలో నాలోని ఉద్వేగాలను బయటకు తీసుకురావడం ప్రారంభించాను.
‘ఆవేదన’ అనే ర్యాప్‌గా ఆ యాసిడ్ దాడి గురించి నా ఎమోషన్ బయటకు వచ్చింది. నాలో ఏదో తెలియని రిలీఫ్. ఆ తరవాత నిర్భయ గురించి రాయడానికి నాలో ఆవేశం కట్టలు తెంచుకుని వచ్చింది. అప్పటికి నా భాష మెరుగైంది. తెలుగు భాష గొప్పదనం గురించి కూడా నలుగురికీ చెప్పాలనిపించింది. ఆ ప్రయత్నంగానే న, మ అక్షరాలతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రెండు అక్షరాల ర్యాప్‌ను సృష్టించాను. దానికి ‘దివ్యాక్షరి’ అని పేరు పెట్టాను.
– డా. వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment