కేటాయించాల్సింది ట్రిబ్యునలే
- ‘విభజన’ సెక్షన్ 89పై కేంద్రం వైఖరి సరికాదు
- కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్89 ప్రకారం కృష్ణా నదీ జలాల పంపిణీని రెండు కొత్త రాష్ట్రాల మధ్యే చేపట్టాల్సి ఉంటుందంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు తెలియపరచడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టింది. కృష్ణా నదీ జలాల వివాద పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు.
‘‘కొత్త రాష్ట్రంగా ఏర్పడిన నేపథ్యంలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో తెలంగాణ హక్కులను సాధించుకునేందుకు, మా వాదనలు వినిపించేందుకు వీలుగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్3 ద్వారా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం. లేకుంటే ప్రస్తుతమున్న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లోనే అన్ని రాష్ట్రాల వాదనలు మళ్లీ విని నీటి కేటాయింపులు మళ్లీ జరిపేలా చూడాలన్నాం. అర్జీని పరిష్కరించేందుకు కేంద్రానికి ఏడాది గడువు ఉంది. ఆలోగా పరిష్కరించకుంటే ట్రిబ్యునల్‌కు నివేదించడమే కేంద్రం విధి. అయితే కేంద్రం ఏడాదిలోగా వివాదాన్ని పరిష్కరించకపోగా.. తన అభిప్రాయాన్ని అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు ఇస్తూ సెక్షన్ 89 కేవలం రెండు నూతన రాష్ట్రాలకే అమలవుతుందని చెప్పింది. ఇది దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా కేంద్రం వ్యవహరించింది. పూర్తిగా బుర్ర పెట్టకుండానే ఈ అభిప్రాయానికి వచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 ప్రకారం పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వానికి నీటి కేటాయింపులు జరిపే అధికారం లేదు. ఆ బాధ్యత నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌దే. అందువల్ల మా నీటి హక్కులను సెక్షన్ 89 ద్వారా లేదా ఇంకేదైనా చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం కాలరాయజాలదు’ అని వాదించారు.
వాదలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేసింది. విచారణకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, న్యాయవాదులు రవీందర్‌రావు, విద్యాసాగర్‌రావు హాజరయ్యారు.