సాక్షి, ముంబై: నగరంలో తెలుగు ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల అభివృద్ధికి చొరవ తీసుకోవాలని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును మహిళా మండళ్ల సభ్యులు కోరారు. ముంబై ప్రాంతీయ పద్మశాలి సంఘం మహిళా మండలి సభ్యులతోపాటు ఇతర సంఘాలకు చెందిన ప్రముఖులు సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కలిసి తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఎస్‌బీసీ కుల ధ్రువీకరణ వాలిడిటీ పత్రం త్వరగా అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని, నగరంలో మహిళల భద్రత, వర్నకట్న వేధింపులు తదితర అంశాలను పరిష్కరించాలని గవర్నర్‌ను కోరారు.
అంతేకాకుండా ‘పట్టణ వేదిక రీడర్స్ ఫోరం’ను ప్రారంభించామని కానీ తెలుగు పుస్తకాలు అందుబాటులో లేవన్నారు. నగరంలో తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు సంఘం అధ్యక్షురాలు గుంటుక శైలజ తెలిపారు. తెలుగు వారు అధిక సంఖ్యలో ఉంటున్న కామాటిపుర, వర్లీ, నాయిగావ్ తదితర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేవిధంగా చొరవ తీసుకోవాలని కోరామన్నారు. అలాగే తెలుగు మహిళలకు రోజువారి పని లభించే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విన్నవించామని ఆమె తెలిపారు. గవర్నర్‌ను కలిసినవారిలో మామిడి సరోజ, కట్కం విజయ, ప్రమీలా రామ్‌దిన్, మచ్చ సుజాత, కట్కం విజయ, నీత రాయ్‌పెల్లి, గుంటుక అరుణ, వీణ భోగ, నంద్యాల సంగీత ఉన్నారు.
గవర్నర్‌తో తెలుగు మహిళా సంఘాల భేటీ
Published Mon, Nov 24 2014 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement