ఆరంభ శూరత్వమే.. | swach mumbai prabodhan abhiyan is the opening chivalry | Sakshi
Sakshi News home page

ఆరంభ శూరత్వమే..

Published Tue, Nov 25 2014 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

swach mumbai prabodhan abhiyan is the opening chivalry

 సాక్షి, ముంబై: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నెల కిందట ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘స్వచ్ఛ్ ముంబై ప్రభోదన్ అభియాన్’ను ప్రస్తుతం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. బైకల్లా హోల్‌సేల్ మార్కెట్‌గా పిలువబడే సంత్ గాడ్గే మహారాజ్ మార్కెట్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తర్వాత కొన్ని రోజులకే తిరిగి ఈ మార్కెట్‌లో యధాస్థితి నెలకొంది. ఇక్కడ కూరగాయలు, పండ్లకు సంబంధించిన చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం ప్రారంభించారు.

గత నెల 18వ తేదీన గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ డ్రైవ్‌ను మార్కెట్‌లో ఆర్భాటంగా ప్రారంభించారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ సీతారామ్ కుంటే, ఇతర వీవీఐపీలు పాల్గొన్నారు. అంతే.. ఆ తర్వాత రోజు నుంచి అక్కడ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. మార్కెట్‌లో డ్రైవ్ ప్రారంభించిన పెద్దలు ఆ తర్వాత ఆ విషయాన్నే మరిచిపోయారు.

దాంతో మార్కెట్ పరిసరాల్లో చెత్తాచెదారం గుట్టలుగా పేరుకుపోతోంది. మొదటి రెండుమూడు రోజులు హడావుడి చేశారని, తర్వాత ఎవరూ ఇటువైపు రాలేదని, ప్రవేశ ద్వారం వద్ద పరిశుభ్రతకు సంబంధించిన బ్యానర్ తప్ప మరేమీ మిగలలేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక స్టాల్ యజమాని మాట్లాడుతూ.. పరిశుభ్రతకు సంబంధించిన ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించిన మూడు నాలుగు రోజుల పాటు స్థానికులు బాగానే పాటించారన్నారు.

తర్వాత మళ్లీ పాత కథే కొనసాగుతోందని తెలిపారు. ఏడాది కిందటివరకు కార్పొరేషన్ సిబ్బంది ఈ మార్కెట్‌ను రోజుకు రెండు సార్లు శుభ్రపరిచేవారన్నారు. కాని ఇప్పుడు కేవలం ఉదయం మాత్రమే శుభ్రపరుస్తున్నారని తెలిపారు.  సంత్ గాడ్గే మార్కెట్ అధ్యక్షుడు యాసిమ్ క్యూరేషి మాట్లాడుతూ మార్కెట్‌లో దాదాపు 500 స్టాల్స్ ఉన్నాయని చెప్పారు. స్వచ్ఛ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి కార్పోరేషన్ చేతులు దులుపుకుందని.. తర్వాత పట్టించుకోవడమే మానేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్కెట్‌లోని వ్యాపారులు కూడా ఈ మార్కెట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు.

 ‘ఈ’వార్టు అధికారి మాట్లాడుతూ.. సిబ్బంది కొరత వల్ల  ఈ డ్రైవ్ అర్ధాంతరంగా ముగిసిపోయిందన్నారు. ఒక్క ఇన్‌స్పెక్టర్ 8 నుంచి 10 మార్కట్‌లను సందర్శించాల్సి ఉంటుందని అధికారి తెలిపారు. కాగా, బీఎంసీకి చెందిన లెసైన్స్ విభాగం అన్ని మార్కెట్లు, దుకాణా దారులకు తమ ఆవరణలో చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని నోటీసులను జారీ చేసింది. చెత్త కుండీలను ఏర్పాటు చేయని వ్యాపారుల లెసైన్సులను రద్దు చేస్తామని హెచ్చరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement