
న్యూఢిల్లీ : దేశ రాజధాని ముఖర్జి నగర్‌లో ఆదివారం సాయంత్రం పోలీసులకు, ఆటో డ్రైవర్‌కు మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. పోలీసులు ఆటో డ్రైవర్‌ను దారుణంగా చితక బాదడం.. అతను కాస్త కత్తితో పోలీసుల మీద ఎదురు దాడికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో ఉన్నతాధికారులు ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.
ఈ వివాదం గురించి సదరు ఆటో డ్రైవర్ తండ్రి మంజీత్ సింగ్(75) మాట్లాడుతూ.. ‘ప్రాణ రక్షణ కోసం నా కుమారుడు కత్తి తీశాడు. అంతే తప్ప ఎవరిని గాయపర్చలేదు. కానీ పోలీసులు మాత్రం నా కొడుకును, మనవడిని దారుణంగా హింసించారు. వారిని కృరంగా కొట్టారు. దాడి చేసిన పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మైనర్ అయిన నా మనవడి పట్ల పోలీసుల తీరు తల్చుకుంటే నాకు చాలా భయం వేసింది’ అన్నారు.
మంజీత్ సింగ్ కుమారుడు సరబ్‌జీత్ సింగ్(45), అతని మనవడు ప్రయాణిస్తున్న ఆటో అనుకోకుండా పోలీసు వాహానాన్ని ఢీ కొట్టింది. ఆగ్రహించిన పోలీసులు సరబ్‌జీత్ సింగ్‌ను, అతని కుమారుడిని రోడ్డు మీదకు లాగి.. బూట్లతో తంతూ.. దారుణంగా చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిపై స్పందించారు. పూర్తి విచారరణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment