రాయ్‌పూర్/చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టులు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులతో గురువారం ఉదయం బీజాపూర్ అటవీ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర డీజీపీ డీఎం అవస్థి మీడియాకు వెల్లడించారు. బీజాపూర్ జిల్లా బైరంగఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యులు రాజ్‌మన్ మందవీ, సుఖ్‌లాల్‌లు సుమారు 50 నుంచి 60 మంది సభ్యులతో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు బుధవారం రాత్రి నుంచి అక్కడ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.
గురువారం ఉదయం సుమారు 11 గంటల సమయానికి భద్రతా బలగాలు బోర్గా గ్రామ పరిధిలోకి ప్రవేశించగానే వారిపైకి మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు కూడా మావోయిస్టులపైకి ఎదురు కాల్పులు ప్రారంభించారు. సుమారు రెండున్నర గంటల సేపు జరిగిన ఈ కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి లోడ్ చేసిన 11 గన్లు, 315 రివాల్వర్లు, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను గుర్తించాల్సి ఉందని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోనూ, ఈ ఏడాదిలోనూ ఇది తొలి ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment