ఫలితాలు అదుర్స్ | tenth class results are released | Sakshi
Sakshi News home page

ఫలితాలు అదుర్స్

Published Tue, Jun 17 2014 10:16 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

ఫలితాలు అదుర్స్

ఫలితాలు అదుర్స్

సాక్షి, ముంబై: రాష్ట్ర విద్యార్థులు పదోతరగతిలో రికార్డుస్థాయి ఫలితాలను సాధించారు. మంగళవారం ప్రకటించిన ఎస్సెస్సీ ఫలితాల్లో గతసంవత్సరం కంటే 5.36% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 15,49,834 మంది విద్యార్థులు పరీక్షలు అందులో 88.32% మంది.. అంటే 13,68,796 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరం కూడా బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికల్లో 90.55% మంది ఉత్తీర్థులుకాగా బాలురు 86.47% ఉత్తీర్ణత సాధించారు.

ఇక విభాగాలవారీగా పరిశీలిస్తే మొత్తం తొమ్మిదింటిలో మరోసారి కొంకణ్  విభాగం తన పట్టును నిలుపుకుంది. కొంకణ్ విభాగంలో గతంలోకంటే 2% మంది విద్యార్థులు అధికంగా పాసయ్యారు. దీంతో ఈసారి 95.57 శాతంతో కొంకణ్ విభాగం ప్రథమ స్థానంలో నిలిచింది. రెండోస్థాన్నాన్ని కోల్హాపూర్ విభాగం దక్కించుకుంది. ఇక్కడ 93.83అధికంగా ఉత్తీర్ణత నమోదైంది.  గత ఏడాది నాలుగోస్థానంలో నిలిచిన పుణే ఈసారి 92.35 శాతం ఉత్తీర్ణతతో తృతీయ స్థానంలో నిలువగా, గతంలో మూడవ స్థానంలో ఉన్న ముంైబె  88.84 శాతంతో ఐదో స్థానానికి పడిపోయింది.
 
 ఇక చివరి స్థానంలో లాతూర్ విభాగం నిలిచింది. అయితే గతంలోకంటే ఇక్కడ ఈసారి మెరుగైన ఫలితాలే నమోదయ్యాయి. గత సంవత్సరం 73.75  శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఈసారి మాత్రం 81.68 శాతం విద్యార్థులు ఈ విభాగం నుంచి ఉత్తీర్ణత సాధించారు. మునుపెన్నడులేని విధంగా రికార్డుస్థాయిలో ఫలితాలు సాధించడం సంతోషకరమైన విషయమని శిక్షణ మండలి అధ్యక్షులు గంగాధర్ మీడియాకు తెలిపారు.
 
 21.32 శాతం ఉత్తీర్ణత సాధించిన రిపీట్ విద్యార్థులు...

 రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,68,508 మంది విద్యార్థులు రిపీటర్లుగా పరీక్షలు రాశారు. వీరిలో 21.323 శాతం(35,926) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. బాలికల ఉత్తీర్ణత శాతం 24.34 కాగా బాలురు 19.86  శాతం మంది పాసయ్యారు.  
 
 అత్యధికంగా గ్రేడ్‌లు దక్కించుకున్న బాలురు..
 ఎస్సెస్సీ ఫలాతాలను గ్రేడ్‌ల వారీగా పరిశీలిస్తే బాలురే పైచేయిగా నిలిచారు. 7,32,218 మంది బాలురు గ్రేడ్‌లు సాధించగా బాలిక వరకు వచ్చేసరికి ఈ సంఖ్య 6,36,578కు పరిమితమైంది. ఫస్ట్‌క్లాస్, సెకండ్ క్లాస్‌లలో పాసైన వారిలో కూడా బాలురే అధికంగా ఉన్నారు.
 
సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
పదోతరగతి పరీక్షా ఫలితాల్లో నగరంలోని తెలుగు పాఠశాలలు సత్తాచాటాయి. వడాలాలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ(ఏఈఎస్) హైస్కూల్ ఈసారి కూడా అత్యుత్తమ ఫలితాలను సాధించింది. 2013-14కుగాను ఏఈఎస్ నుంచి మొత్తం 353 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 97.73 శాతం(345) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
 
ఈ పాఠశాల నుంచి 91.8 శాతం మార్కులతో వి. ఓంకార్ ప్రథమ స్థానంలో, పి.సాగర్ 91.6 శాతం మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరిలో 79 మంది డిస్టింక్షన్, 114 మంది ఫస్ట్ క్లాస్, 119 మంది సెకండ్ క్లాస్ సాధించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ మార్క్‌షీట్‌లు, ప్రమాణపత్రాలు ఇచ్చేరోజు మంచిమార్కులు ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని సత్కరించనున్నట్టు ఎఈఎస్ అధ్యక్షులు స్వరూపరావ్, కార్యదర్శి పి.ఎం. రావ్, ప్రిన్సిపాల్ కె. లక్ష్మీలలిత తెలిపారు.  
 
100 శాతం ఫలితాలతో మోడ్రన్ హ్యాట్రిక్..

ఘాట్కోపర్‌లో తెలుగువారి ఆధ్వర్యంలో నడిచే మోడ్రన్ ఇంగ్లిష్ హైస్కూల్ వరుసగా మూడోసారి నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించింది. దీనిపై పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఘాట్కోపర్ కామ్‌రాజ్‌నగర్‌లో ఉన్న ఈ స్కూల్‌లో తెలుగు విద్యార్థులతోపాటు ఇతర విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఈసారి  పరీక్షలు రాసిన 25 మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో 87 శాతంతో అంకుష్ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. వరుసగా మూడోసారి నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి హ్యాట్రిక్ సాధించిందని గాలి మురళి, జక్కుల తిరుపతి, బండారు శేశాద్రి, మంజ్రేకర్ తెలిపారు.
 
గీతా విద్యాలయం 98శాతం

గోవండీలోని తెలుగువారికి చెందిన శ్రీ గీతా వికాస మండలి ఆధ్వర్యంలో నడిచే గీతా విద్యాలయం ఈ సారి కూడా మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 55 మంది పరీక్షలు రాయగా 98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాదించారు.  1979లో సాపించిన ఈ స్కూల్‌లో తెలుగు మీడియం లేకపోయినప్పటికీ అనేక మంది తెలుగు విద్యార్థులు ఇందులో చదువుతున్నారు. ప్రస్తుతం ఈ స్కూల్‌లో మొత్తం 1,800 మంది విద్యార్థులున్నారని చెర్మైన్ వాసాల కిషన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement