థరూర్‌ను ప్రశ్నించిన సిట్
- సుదీర్ఘంగా నాలుగున్నర గంటల పాటు విచారణ
- సునంద కుమారుడు శివ్‌మీనన్ చెప్పిన అంశాలపై ఆరా
న్యూఢిల్లీ: సునంద హత్య కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందం గురువారం మరోసారి ప్రశ్నించింది. ఐపీఎల్ కోచి వ్యవహారంతో సునంద హత్య కేసుకు ముడిపడి ఉన్న సమాచారంపై పోలీసులు ఆరా తీశారు. థరూర్‌ను ఈ కేసులో ఇంతకుముందే జనవరి 19న సిట్ బృందం ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం దక్షిణ ఢిల్లీలోని ఏఏటీఎస్ కార్యాలయంలో రెండు దఫాలుగా ఐదు గంటల పాటు శశిథరూర్‌ను పోలీసులు ప్రశ్నించారు.
ఈ విచారణ రాత్రి వరకు కొనసాగింది. ఈ సమయంలో థరూర్ సహాయకులు బజ్‌రంగి, నారాయణ్ సింగ్, స్నేహితుడు సంజయ్‌దివాన్‌ను కూడా ప్రశ్నించినట్లు సమాచారం. థరూర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఐపీఎల్ కోచి ఫ్రాంచైజీ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై, రూ. 70 కోట్లను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ప్రధానంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు అంతే సొమ్మును ఐపీఎల్ కోచిలో 19 శాతం వాటాగా సునందకు చెల్లింపులు జరగడంపైనా వివరాలు సేకరించినట్లు సమాచారం.