అదిగో.. ఆటోమేటెడ్ భూతం..! | That was Automated devil | Sakshi
Sakshi News home page

అదిగో.. ఆటోమేటెడ్ భూతం..!

Published Sun, Dec 13 2015 1:57 AM | Last Updated on Thu, Jul 11 2019 6:28 PM

అదిగో.. ఆటోమేటెడ్ భూతం..! - Sakshi

అదిగో.. ఆటోమేటెడ్ భూతం..!

‘ఐటీ’ జనులారా.. జర భద్రం..!

♦ ఐఓటీ, ఏఐ విప్లవంతో అన్ని రంగాల్లో సమూల మార్పులు
♦ వేగంగా విస్తరిస్తున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధస్సు
♦ మనుషులకన్నా తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యంతో పనులు
 
 ఇరవయ్యో శతాబ్దం ముగిసే సమయానికి సమాచార విప్లవం ప్రపంచ స్వరూపాన్నే మార్చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సమాచార సాంకేతికత) విశాల ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేసింది. ఐటీ .. అన్ని రంగాలనూ అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది.  21వ శతాబ్ది ఆరంభంలో అన్ని రంగాల్లోనూ ఐటీ అత్యంత ముఖ్యమైన భాగమైంది. అయితే.. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో కార్మికుల ఉపాధి అవకాశాలను యాంత్రీకరణ, కంప్యూటరీకరణ విప్లవాలు దెబ్బతీసినట్లుగా.. ఐటీ రంగాన్నీ ముంచుకొస్తోన్న మరో విప్లవం వణికిస్తోంది. దానితో మున్ముందు ఐటీ రంగం.. అందులోని ఉపాధి అవకాశాల పరిస్థితులు సమూలంగా మారిపోనున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఆ విప్లవమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్! అంటే.. ఇంటర్నెట్‌తో కూడిన వస్తుజాలం.. వాటికి కృత్రిమ మేధస్సు!  కార్మికుల ఉపాధి అవకాశాలు తగ్గిపోవటానికి కంప్యూటరీకరణే ప్రధాన కారణమైతే.. ఆ కంప్యూటర్ల నిర్వహణలో పని చేసే నిపుణులు ఐటీ ఉద్యోగులుగా విలసిల్లుతున్నారు. భవిష్యత్తులో ఈ కంప్యూటర్ల నిర్వహణ సర్వస్వమూ కంప్యూటర్లే  చూసుకోనున్నాయి. ఒక్క ఐటీనే కాదు.. సమస్త రంగాలనూ రానున్న విప్లవం ప్రభావితం చేయనుంది! సకల వస్తుజాలమూ ఇంటర్నెట్‌తో అనుసంధానమై.. కృత్రిమ మేధస్సుతోమనుషులకన్నా ఎక్కువ కచ్చితత్వంతో మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి.
                 - పృథ్వీరాజ్

 
 ఏమిటీ.. ఐఓటీ - ఏఐ?
 ఎలక్ట్రానిక్ పరికరాలు.. హైటెక్ పరికరాలు కానీ, మామూలు పరికరాలు కానీ.. అన్నీ ఒక దానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. మెషీన్ టు మెషీన్ (ఎం టు ఎం) ప్రొటోకాల్ సాయంతో పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుంటాయి. అదే సమయంలో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) సాయంతో ఆ సమాచారాన్ని విశ్లేషించుకుని తమకు తాముగానే పనులు చేసుకుంటూ పోతుంటాయి. ఇందులో మానవ ప్రమేయం కానీ.. సూచనలు కానీ అవసరం ఉండదు. కానీ.. వీటిని దూరం నుంచి నియంత్రించవచ్చు (రిమోట్ కంట్రోలింగ్).

 స్మార్ట్ ఇళ్లు, ఆటోమేటెడ్ రైళ్లు, రోబోటిక్ ట్రక్కులు, ఎస్కలేటర్లు, మినరల్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, కార్ల తయారీ తదితర చాలా పారిశ్రామిక రంగాల్లో ఇప్పటికే ఈ తరహా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతోంది. అంటే.. ఇప్పటివరకూ యంత్రాలను నియంత్రించేందుకు అవసరమైన మానవ శ్రమ కూడా మరింతగా తగ్గిపోతోంది. యంత్రాలు తమకు తాముగా పని చేసుకుపోవటం.. సుదూరంగా ఎవరో ఒకరు మాత్రమే అన్ని యంత్రాలనూ నియంత్రించటం జరుగుతోంది. ఒక్క మాటలో చెప్తే.. వేర్వేరు ప్రాంతాల్లోని వివిధ స్వయంచలిత యంత్ర పరిశ్రమలను.. ఒకే కేంద్రం నుంచి అతి తక్కువ సంఖ్యలో మానవులు నియంత్రించవచ్చన్నమాట. ఆ నియంత్రణను కూడా ఆటోమేటెడ్ చేసేస్తే.. మానవ పర్యవేక్షణను అత్యంత కనిష్ట స్థాయికి కుదించవచ్చు. దీనివల్ల భారీ పరిశ్రమల్లో కార్మికులు, ఉద్యోగుల జీతభత్యాల వంటి నిర్వహణ వ్యయం కనిష్టానికి తగ్గిపోవటమే కాదు.. ఐఓటీ, ఏఐల వల్ల ఎప్పటికప్పుడు సమాచార మార్పిడి, విశ్లేషణ జరుగుతుంది కాబట్టి.. అవసరమైన పరికరాలను, అవసరమైన మార్పులతో ఉత్పత్తి చేస్తుంటాయి.  

 అన్ని రంగాల్లోనూ సమూల మార్పులు...
 మనుషులకు అవసరమైన సమస్త సేవల్లోనూ ఐఓటీ, ఏఐ విస్తరిస్తుంది. వాటితో కూడిన పరికరాలు ఆరోగ్య రంగంలో సైతం మనుషుల్లో రక్తపోటు, చక్కెర వంటి వాటిని నిరంతరం పరిశీలిస్తూ, సమాచార మార్పిడి ద్వారా విశ్లేషిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన చికిత్సలు, మందులను అందించటం చేస్తాయి. న్యాయవ్యవస్థలోనూ ఐఏ, ఐఓటీ పెను మార్పులు తీసుకువస్తుంది. ఆర్టిఫిషియల్ జ్యుడీషియల్ ఇంటెలిజెన్స్‌తో.. వాహనాలు ప్రమాదాలకు గురైనపుడు, లేదా ప్రమాదాలు చేసినపుడు వాటికవిగానే ఆగిపోతాయి. వాటికవిగానే ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసి.. సాక్ష్యాధారాలను రికార్డు చేసి.. అక్కడికక్కడే తీర్పు చెప్పటం జరిగిపోతుంది. పోలీసులు లేదా వైద్య సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఇలా.. కేవలం పారిశ్రామిక, ఉపాధి రంగాల్లోనే కాదు మొత్తం ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే సమూలంగా మారిపోతాయని.. ప్రస్తుత స్వేచ్ఛా మార్కెట్ ఆర్థికవ్యవస్థ ‘స్మార్ట్, క్లౌడ్ ఎకానమీ’గా మారుతుందని విశ్లేషకుల అంచనా.

 మానవ శ్రమకు డిమాండ్ పడిపోతుంది
 కృత్రిమ మేధస్సుతో కూడిన ప్రత్యేక అప్లికేషన్లు, రోబోటిక్ పరికరాలు, ఇతర ఆటోమేషన్ రూపాల ఫలితంగా.. మానవ శ్రమకు డిమాండ్ గణనీయంగా పడిపోతుంది. వాటి ఉత్పత్తి, వినియోగం పెరిగిపోతున్న కొద్దీ.. నిరుద్యోగితా పెరిగిపోతూ ఉంటుంది. తరచుగా చేసే ఒక తరహా పనుల్లో మనుషుల శక్తి సామర్థ్యాల కన్నా యంత్రాల శక్తి సామర్థ్యాలు అధికంగా ఉండటం దీనికి కారణం. ముందుగా ప్రభావితమయ్యే రంగం.. సమాచారం ఆధారంగా నడిచే ఐటీ ఉద్యోగ రంగమని, అందులోనూ ప్రవేశ స్థాయిలో ఉద్యోగాలపై ప్రభావం అధికంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. భారీ స్థాయిలో సమాచార మార్పిడి, విశ్లేషణలు చేయగల ఎక్స్‌పర్ట్ సిస్టమ్స్, మెషీన్ లెర్నింగ్ వ్యవస్థల వినియోగంతో ఈ రంగంలో ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోతాయన్నది అంచనా.

 ఐటీ రంగం ఆటోమేటెడ్ అవుతుంది..!
 రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్‌పీఏ) వంటి ‘ఆటోనామిక్స్’లో వస్తున్న పరిణామాల ఫలితంగా.. కాల్ సెంటర్, టెక్నికల్ ఆపరేషన్ వర్క్ వంటి మనుషులు చేసే పనులు ఆటోమేటెడ్ అయిపోయే అవకాశముందని ఐటీ రంగ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. మెషీన్ లెర్నింగ్, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాల పురోభివృద్ధితో పలు పనుల ఆటోమేషన్ జరుగుతుందని.. ఫలితంగా ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతూ వస్తుందని నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) చైర్మన్ బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి తాజాగా హైదరాబాద్‌లో జరిగిన స్పిన్ (సాఫ్ట్‌వేర్ ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్ నెట్‌వర్క్) సదస్సులో పేర్కొన్నారు. ప్రస్తుత ఐటీ రంగ నిపుణులకు కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంలో పునఃశిక్షణనివ్వటం పెద్ద సవాలు అవుతుందన్నారు. ఇప్పటికే దేశంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని.. గత ఏడాది 2.5 లక్షల మందికి ఈ రంగంలో ఉద్యోగాలు లభించగా.. ఈ ఏడాది అది 2.3 లక్షలకు తగ్గుతుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు.

 మేధస్సును మెషీన్లు అనుకరించగలవా?
 మానవ మెదళ్లను మెషీన్లు అనుకరించగలవని.. మానవ మెదళ్లు తెలివైనవి కాబట్టి మెషీన్లు అనుకరించే మెదళ్లు కూడా తెలివైనవిగా తయారయ్యే అవకాశముందని కొందరు నిపుణుల వాదన. మెదడును నేరుగా హార్డ్‌వేర్‌లోకి, సాఫ్ట్‌వేర్‌లోకి కాపీ చేయటం సాధ్యమేనని.. అలా కాపీ చేసిన మెదళ్లు తెలివిగలవై ఉంటాయని పలువురు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే.. యంత్రాలు ఇప్పటికే తెలివైనవని.. కానీ దానిని గుర్తించటంలో పరిశీలకులు విఫలమవుతున్నారని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. డీప్ బ్లూ అనే సూపర్ కంప్యూటర్ గ్యారీ కాస్పరోవ్‌ను చదరంగంలో ఓడించినపుడు ఆ యంత్రం తెలివిగా ప్రవర్తించిందని వారు ఉదహరిస్తున్నారు. అయితే.. ఈ ఆటను చూసిన వారు అది కేవలం యంత్రపు కృత్రిమ మేథస్సు ప్రవర్తనేనని.. నిజమైన మేధస్సు కాదని వాదిస్తున్నారని చెప్తున్నారు.

 ఐఏ పరిశోధనలు.. పరిణామాలివీ...
 తర్కశాస్త్రం - గణితశాస్త్రంలో పరిశోధనల ఫలితంగా ప్రోగ్రామబుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌ను తయారు చేశారు. అదే సమయంలో న్యూరాలజీ (నాడీ శాస్త్రం)లో పరిశోధనలు, సమాచార సిద్ధాంతం, సైబర్‌నెటిక్స్ (సమాచార నియంత్రణ యంత్రాధ్యయనం)ల్లో కొత్త ఆవిష్కరణల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మెదడును నిర్మించవచ్చని శాస్త్రవేత్తలు బలమైన విశ్వాసానికి వచ్చారు. ఈ క్రమంలో 1956లో అమెరికాలో డార్ట్‌మౌత్ కాలేజ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనకు బీజం పడింది. చెకర్స్ ఆటలో గెలిచే కంప్యూటర్లు, అల్‌జీబ్రాలో పద సమస్యలను పరిష్కరించే, ఇంగ్లిష్ మాట్లాడే కంప్యూటర్లను తయారు చేశారు. 1997లో ఐబీఎం తయారు చేసిన డీప్ బ్లూ సూపర్ కంప్యూటర్ తయారైంది. అది.. నాటి ప్రపంచ చదరంగం చాంపియన్‌ను ఓడించి తన మేధస్సును చాటింది. 2011లో ఐబీఎం సంస్థే తయారు చేసిన వాట్సన్ సూపర్ కంప్యూటర్ జియోపార్టీ క్విజ్ (ప్రశ్న - సమాధానాలు) షోలో ఇద్దరు గొప్ప చాంపియన్లను ఓడించింది.  

 ఐఓటీ పరిశోధన.. పరిణామాలిలా...
 ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్, సెన్సర్స్, నెట్‌వర్క్ కనెక్టివిటీ అన్నీ కలసివున్న భౌతిక వస్తువులను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వస్తువులు సమాచారాన్ని సేకరించి.. పరస్పరం మార్పిడి చేసుకోగలవు. వైర్‌లెస్ కమ్యూనికేషన్ నుంచి ఇంటర్నెట్ వరకూ.. ఎంబెడెడ్ సిస్టమ్స్ నుంచి మైక్రో ఎలక్ట్రానికల్ సిస్టమ్స్ వరకూ అనేక సాంకేతిక పరిజ్ఞానాల కలయికతో ఐఓటీ ఏర్పడుతుంది. స్మార్ట్ పరికరాల అనుసంధానం విధానాన్ని 1982లో తొలిసారిగా చర్చించారు. కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో తొలిసారిగా ఒక కోక్ మెషీన్‌ను ఇంటర్నెట్‌తో అనుసంధానించారు. తనవద్ద ఉన్న కోక్ బాటిళ్ల వివరాలు, కొత్త బాటిళ్లు చల్లగా ఉన్నాయా లేదా అన్న సమాచారాన్ని అది ఎప్పటికప్పుడు నివేదిస్తుంటుంది.

1999 నాటికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చింది. అక్కడి నుంచి మీడియా, పర్యావరణ పర్యవేక్షణ, మౌలికవసతుల నిర్వహణ, తయారీ, ఇంధన నిర్వహణ, వైద్య, ఆరోగ్యపరిరక్షణ వ్యవస్థలు, భవనాలు, ఇళ్ల ఆటోమేషన్, రవాణా తదితర రంగాల్లో ఐఓటీ విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ అనుసంధానం పెరుగుతోంది. ప్రస్తుతం అత్యధికంగా దక్షిణ కొరియాలో ప్రతి 100 మందికీ 37.9 వస్తువులు ఐఓటీలో ఉండగా.. 24వ స్థానంలో ఉన్న భారత్‌లో ప్రతి వేయి మందికీ ఆరు వస్తువులు ఐఓటీలో ఉన్నాయి. ఈ ఐఓటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను జతచేయటంతో.. అది పెను విప్లవంగా మారుతోంది. 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఐదువేల కోట్ల పరికరాలు ఐఓటీలో ఉంటాయని పరిశీలకుల అంచనా.
 
 కృత్రిమ మేధస్సుతో మానవ మనుగడకే ముప్పు!
 పూర్తిస్థాయి కృత్రిమ మేథస్సు అభివృద్ధి చెందితే.. అది మానవ జాతి అంతానికి దారితీయవచ్చని ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేర్కొన్నారు. అదెలాజరుగుతుందనే దానిపై నిక్‌బోస్ట్రామ్ అనే రచయిత తన ‘సూపరింటెలిజెన్స్’ పుస్తకంలో అంచనా వేశారు. దాని ప్రకారం.. తొలుత మనుషులు కృత్రిమ మేథస్సుకు బీజం వేస్తారు. ఆ ఏఐ మనుషులపై ఆధారపడుతూ తన మేధస్సును పెంచుకుంటుంటుంది. రెండో దశలో తనకు తానుగా మేధస్సును మెరుగుపరచుకునే స్థాయికి చేరుతుంది. ఈ దశలో మానవ మేధస్సు పరిమితులను అధిగమించిపోయే అవకాశముంది. ఈ దశలో మానవ మేధస్సుకు అందని నైపుణ్యాలను, వ్యూహాలను సంతరించుకుని తన రూపురేఖలను (డిజైన్‌ను) తానే మార్చుకోగల స్థాయికి చేరే అవకాశం ఉంటుంది.

మూడో దశలో మరింత దీర్ఘ కాలిక లక్ష్యాల కోసం రహస్యంగా వ్యూహాలను తయారు చేసుకుని, రహస్యంగా ఏర్పాట్లు  చేసుకునే పరిస్థితిలోకి వెళ్లవచ్చు. చివరిదైన నాలుగో దశలో ఏఐ మనుషులపై దాడికి దిగవచ్చు.. మనుషులు తనను ఎదుర్కోవటానికి ముందుగా సిద్ధం చేసిపెట్టుకున్న ఏర్పాట్లను ధ్వంసం చేసి.. మనుషులు తన మనుగడకు ప్రమాదకరమన్న భావనతో మానవజాతినే నిర్మూలించే ప్రయత్నం చేయవచ్చు. ఈ క్రమంలో మొత్తం భూగోళాన్నే తీవ్రంగా ధ్వంసం చేసే పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. ఈ అంచనాలతో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అనేక సైన్స్ ఫిక్షన్ నవలలు, సినిమాలు వచ్చాయి. ఇస్సాక్ అసిమోవ్ ‘త్రీ లాస్ ఆఫ్ రోబోటిక్స్’ నుంచి.. ఆర్థర్ సి. క్లార్క్ రాసిన 2001 ఎ స్పేస్ షిప్ ఒడిస్సీ నవల, సినిమా.. అనంతరం వచ్చిన టెర్మినేటర్ సినిమాలు ఈ కోవలోనివే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement