పనామా పత్రాల్లో ‘ఏపీ బ్రాండ్ అంబాసిడర్’!
♦ జాబితాలో అజయ్ దేవ్‌గణ్
♦ ‘బ్రిటిష్‌వర్జిన్ ఐలాండ్స్’ కంపెనీలో వాటాలు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన పనామా పత్రాల్లో బాలీవుడ్ హీరో, ఏపీ బ్రాండ్ అంబాసిడర్ అజయ్ దేవగణ్ పేరు ఉన్నట్లు వెల్లడైంది. 2013లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో మేరీలెబోన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటైన కంపెనీలో ఆయనకు వాటాలున్నట్లు తెలిసింది. హిందీ సినిమాల విదేశీ హక్కుల కొనుగోలుకు, కొల్లగొట్టడానికి ఈ కంపెనీని స్థాపించినట్లు సమాచారం. పనామా లీకేజీ స్కాంలో కీలకమైన మొసాక్ ఫోన్సెకా సంస్థ ఈ కంపెనీ ఏర్పాటుకు దోహదం చేసిందని, లావాదేవీల్లో మధ్యవర్తిగా సాయం చేసిందని తెలిసింది.
తొలుత లండన్‌కు చెందిన హసన్ ఎన్ సయానీ(వెయ్యి షేర్లు) ఆధ్వర్యంలో ఉన్న ఈ కంపెనీలో వాటాను దేవ్‌గణ్ సంస్థ నైసా యుగ్ ఎంటర్‌టైన్‌మెంట్ కొన్నది.ఈ సంస్థలో తన భార్య, నటి కాజోల్ భాగస్వామ్యం కూడా ఉంది. కంపెనీని స్థాపించిన ఏడాది తర్వాత 2014 డిసెంబర్‌లో విదేశీ ట్రస్ట్ అయిన ఈఎఫ్‌జీ ట్రస్ట్ కంపెనీని ఒక నామినీ డెరైక్టర్‌గా నియమించి దేవ్‌గణ్ డెరైక్టర్ పదవికి రాజీనామా చేశారు. కాగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారత రిజర్వ్‌బ్యాంక్ నిబంధల మేరకే ఈ కంపెనీని ఏర్పాటుచేశామని దేవ్‌గణ్ చెప్పారు. తమ కుటుంబ ట్యాక్స్ రిటర్న్స్‌లో ఈ వివరాలను వెల్లడించామన్నారు. మేరీలెబోన్‌లో వాటా విషయాన్ని నైనా యుగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన బ్యాలెన్స్‌షీట్‌లో చూపినట్లు తెలిపారు.