ఛత్తీస్‌లో ఎన్‌కౌంటర్
ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి
చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా అటవీప్రాంతంలో శనివారం నక్సల్స్, బీఎస్‌ఎఫ్ జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని పఖంజూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఛోటేబేటియా అటవీప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో బీఎస్‌ఎఫ్ 117వ, 122వ బెటాలియన్, జిల్లా పోలీసు బృందం సంయుక్తంగా గాలింపు చేపట్టింది. రాత్రి దాదాపు 2.30గంటలకు ఈ బృందం అడవిలో బేచా గ్రామ సమీపంలోని చిన్న నది దగ్గరకు చేరుకోగానే పోలీసులను చూసి నక్సల్స్ ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దాదాపు గంటపాటు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
ఈ కాల్పుల్లో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రగాయాలైన బీఎస్‌ఎఫ్ జవాన్లు విజయ్ కుమార్, రాకేశ్ నెహ్రాలను చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌కు హెలికాప్టర్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. రాయ్‌పూర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో జవాను మృతిచెందారు. కొందరికి రాయ్‌పూర్‌లోని రామకృష్ణ కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు కాంకేర్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ జయంత్ వైష్ణవ్ పీటీఐతో చెప్పారు. మరోవైపు బీజాపూర్ జిల్లాలో శనివారం ఓ యాత్రికుల బస్సును దగ్ధం చేసిన మావోయిస్టులు సుక్మా జిల్లా భెర్జీ వద్ద ఓ ఆటోను తగలబెట్టారు.