తక్కువ ఆదాయ వర్గాలపైనా గురి!
వంటగ్యాస్ సబ్సిడీ రద్దుకు ఇదే సరైన సమయమంటూ ఐసీఆర్‌ఏ నివేదిక
జనవరి నుంచి 20 లక్షల మందిపై భారం
ముంబై: వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటితే గ్యాస్ సబ్సిడీ రద్దు నిర్ణయంతో ఏడాదికి ప్రభుత్వానికి రూ.500 కోట్లు ఆదా కానుంది. జనవరి నుంచి అమలు కానున్న ఈ నిర్ణయంతో దాదాపు 20 లక్షల మంది రాయితీ కోల్పోనున్నారు. రాయితీ రద్దుతో అధిక ఆదాయ వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండదని ఐసీఆర్‌ఏ(ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ) తెలిపింది. అధికాదాయ వర్గాలకు సబ్సిడీ నిలిపివేతకు ఇదే సరైన సమయమని, ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ తగ్గుతూ వస్తుండడమే ఇందుకు కారణమని ఐసీఆర్‌ఏ ఒక నివేదికలో వెల్లడించింది. గత 3 నెలలుగా గ్యాస్‌పై దాదాపు రూ.150 నుంచి రూ.190 సబ్సిడీ ఇస్తున్నారు.
అధికంగా వంట గ్యాస్ వినియోగిస్తున్న తక్కువ ఆదాయ వర్గాలకు కూడా సబ్సిడీ ఎత్తివేతకు ప్రభుత్వానికి ఇదే సరైన సమయమని ఐసీఆర్‌ఏ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల ప్రభుత్వం భారీగా ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లోని తక్కువ ఆదాయ వర్గాలే ఎల్పీజీని ఎక్కువగా వినియోగిస్తున్నారని, రాయితీ లేని గ్యాస్ కొనగలిగే స్థితిలో వారు ఉన్నారని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఒక కుటుంబం 45 రోజులకు ఒక సిలెండర్ వినియోగిస్తున్నారని అంచనావేసింది. తక్కువ ఆదాయ వర్గాలకు సబ్సిడీ ఎత్తివేస్తే కుటుంబంపై నెలకు అదనంగా రూ.100 నుంచి రూ.125 భారం మాత్రమే పడుతుంది. ప్రస్తుతమున్న క్రూడాయిల్, ఎల్పీజీ ధరల ఆధారంగా ఈ లెక్కలు వేసింది.