న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) వద్ద పేదల ప్రయోజనాలను గత యూపీఏ ప్రభుత్వం పణంగా పెట్టిందన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యలపై సోమవారం రాజ్యసభ దద్ధరిల్లింది. ఈ వ్యాఖ్యపై ప్రధాని వివరణ ఇవ్వాలని, దీనిపై చర్చ కూడా జరగాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. దీనికి సంబంధించి వాణిజ్య శాఖ సహాయమంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలకు, ప్రధాని వ్యాఖ్యలకు పొంతన లేదని విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉండగా.. ప్రజలకు తప్పుడు సమాచారంఇచ్చి పార్లమెంటు ప్రతిష్టను ప్రధాని దిగజార్చారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ సభ్యుల ఆందోళన వల్ల ప్రశ్నోత్తరాల సమయంలో సభ రెండు సార్లు వాయిదా పడింది. బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో శనివారం ప్రధాని ప్రసంగిస్తూ.. డబ్ల్యూటీవో ఒప్పందం పై సంతకం చేసి పేద రైతుల ప్రయోజనాలకు యూపీఏ దెబ్బతీసిందని విమర్శించిన విషయం తెలిసిందే. ‘ప్రధాని వ్యాఖ్యలకు విరుద్ధంగా.. డబ్ల్యూటీవో వద్ద యూపీఏ వైఖరినే కొనసాగిస్తున్నామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీనిపై ప్రధాని వివరణ కావాలి’ అని వాణిజ్య శాఖ మాజీ మంత్రి ఆనంద్‌శర్మ డిమాండ్ చేశారు.
ప్రధాని వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం
Published Tue, Aug 12 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM
Advertisement
Advertisement