భారత్‌కు వ్యతిరేకంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో అమెరికా ఫిర్యాదు చేసింది. బియ్యం, ఆపిల్‌లతోపాటు అన్ని రకాల జన్యుమార్పిడి ఆహార దిగుమతు లపై భారత్ నియంత్రణలు విధించడాన్ని ప్రశ్నించింది. జన్యుమార్పిడి ఆవాల పంటకు ‘పర్యావరణ అనుమతులు’ మన దేశంలో ఇచ్చినప్పుడే ఈ పరిణామాలు జరగడం గమనార్హం.
సురక్షితం కాని జన్యుమార్పిడి ఆహార దిగుమతులను అనుమతించేలా మన చట్టాలను మార్చుకోమని బలవంత పెట్టడం కంటే... తమ దేశ వ్యవసాయ రంగాన్ని అమెరికా ఎందుకు సరిచేసుకోదు? క్యాన్సర్ కారకమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గడ్డిమందుల విషయంలోనూ అమెరికా వైఖరి ఇదే. తమకు జన్యుమార్పిడి మొక్కజొన్న వద్దని మెక్సికో కరాఖండీగా చెప్పింది. అంత స్పష్టత మన దేశానికీ ఉండాలి.
అభివృద్ధి చెందుతున్న దేశాలు జన్యు మార్పిడి పంటల దిగుమతికి అనుమతిచ్చేలా అమెరికా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఆహారంపై ‘జన్యుమార్పిడి పంటలు కాదు’ అన్న లేబుల్ తగిలించాలని భారత్ డిమాండ్ చేస్తూండటం అమెరికా వ్యవసాయ ఎగుమతులకు నష్టం కలిగి స్తోందని అమెరికా ఫిర్యాదు. ఈ పరిణామాలన్నీ భారత పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జన్యుమార్పిడి ఆవాల పంటకు ‘పర్యావరణ అనుమతులు’ ఇచ్చినప్పుడే జరగడం గమనార్హం.
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో అమెరికా ఫిర్యాదు చేసింది ఒక్క భారతదేశంపై మాత్రమే కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు జన్యు మార్పిడి పంటలు, దిగుమతులు, టెక్నాలజీపై నిషేధం తొలగించేలా చేసేందుకు అమెరికా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. యూరో పియన్ యూనియన్‌తోపాటు ఇండియా, మెక్సికో, కెన్యా, ఇండోనేసి యాలను లక్ష్యంగా చేసుకుని పని చేస్తోంది.
మెక్సికో అధ్యక్షుడు ఆడ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్‌పై అమెరికా పెట్టిన ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉందంటే– తమకు జన్యు మార్పిడి మొక్కజొన్న అస్సలు వద్దు. స్వేచ్ఛాయుతమైన, సార్వభౌమ అధికారులున్న దేశం కావాలని కరాఖండీగా చెప్పేంత. గత ఏడాది మెక్సికో ఒక అధ్యక్ష ఉత్తర్వు జారీ చేస్తూ... జన్యుమార్పిడీ మొక్క జొన్నను దశలవారీగా తొలగిస్తామని స్పష్టం చేసింది. హానికారక గ్లైఫాసేట్ వాడకాన్ని కూడా 2024 నాటికి నిషేధిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయాల ప్రభావం అమెరికా నుంచి దిగుమతి అవుతున్న కోటీ డెబ్భై లక్షల టన్నుల మొక్కజొన్నలపై ఉంటుంది.
మెక్సికో తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు మిగిలిన దేశాలు వ్యవహరించడం కష్టం. అశోకా యూనివర్సిటీ అసోసియేట్ అధ్యా పకుడు అనికేత్ ఆఘా ఇలాంటి వ్యవహారాన్ని వ్యవసాయ పెట్టుబడి దారీ విధానం అంటారు. కెన్యా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి మోజెస్ కురియా చేసిన ప్రకటన అందరినీ నిర్ఘాంత పరిచింది. ‘‘ఈ దేశంలో ఉన్నామంటే చావుకు సిద్ధమైన వ్యక్తిగా ఉన్నట్లే. చావుకు పోటీ పడుతున్నవాటికి జన్యుమార్పిడి పంటలను కూడా చేర్చడం తప్పేమీ కాదు.
అందుకే ఉద్దేశపూర్వకంగానే ఈ దేశంలోకి జన్యుమార్పిడి పంటలను అనుమతించాం’’ అన్నారు మోజెస్. ఆ తరువాత పదేళ్ల నిషేధాన్ని ఎత్తివేయడమే కాకుండా, ఆరు నెలలపాటు జీఎం మొక్క జొన్న, సాధారణ మొక్కజొన్నల దిగుమతులపై పన్నులను కూడా ఎత్తేశారు. ఈ ప్రకటన జరిగిన కొన్ని వారాల్లో 32 మంది సభ్యులున్న అమెరికా వాణిజ్య బృందం నైరోబీలో పర్యటించింది. మెక్సికో నిషేధం తరువాత అమెరికన్ రైతులపై ఉన్న జీఎం పంటల భారాన్ని కెన్యా కొంత భరిస్తుందని వారి నమ్మకం మరి.
ఇండొనేసియా విషయానికొస్తే... అక్కడ వ్యవసాయ సంబంధిత సంఘాల తీవ్ర వ్యతిరేకత మధ్య అధ్యక్షుడు జోకో వైడోడో దేశంలో పడిపోతున్న సోయాబీన్ దిగుబడులు పెంచేందుకు జన్యుమార్పిడి పంటల సాగు చేపట్టాలనీ, అవసరమైతే జీఎం విత్తనాలను దిగుమతి చేసుకోవాలనీ అంటూండటం గమనార్హం.
అసురక్షితమైన, ప్రమాదాలతో కూడిన జన్యుమార్పిడి ఆహారపు దిగుమతులను అనుమతించేలా మన చట్టాలను మార్చుకోమని అమెరికా బలవంత పెట్టడం కంటే... తమ దేశంలో వ్యవసాయ రంగాన్ని ఎందుకు సరిచేసుకోదు? అమెరికా తన ప్రజల కోసం జన్యుమార్పిడి పంటలను సాగు చేసుకోవాలనుకుంటే మనకేమీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ... ఎగుమతి అవసరాల కోసం సాధారణ బియ్యం, ఆపిల్‌లను సాగు చేయడం ఎందుకు మొదలుపెట్టదు? యూరోపియన్ యూనియన్, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు హానికారక జన్యుమార్పిడి పంటల నుంచి రక్షణకు చేసుకున్న ఏర్పాట్లను బలహీనపరచాలని అమెరికా ఎందుకు ఒత్తిడి చేస్తోంది? ఈ జన్యుమార్పిడి ఉత్పత్తులు గడ్డి మందులను తట్టుకోగలవు కాబట్టి. వీటిని వాడటం మొదలుపెడితే విషపూరిత మైన కీటకనాశినుల విక్రయాలు గణనీయంగా పెరుగుతాయి. భారత్‌లో 2002లో బీటీ కాటన్ ప్రవేశించింది మొదలు పత్తిపై చల్లే కీటకనాశినుల ఖర్చు హెక్టారుకు 37 శాతం పెరిగింది.
సాధారణ మొక్కజొన్నల విషయంలో మెక్సికో డిమాండ్‌ను తాము తీర్చగలమని అమెరికాలోని రైతులు కొందరు ప్రకటించిన విషయాన్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గుర్తుంచుకోవాలి. నిజానికి భారత్ కూడా అమెరికా నుంచి జన్యుమార్పిడి ఆహార దిగుమతులను అడ్డుకునే విషయంలో గట్టిగా నిలుస్తుందని భావిస్తున్నాను. అలా చేయగలిగితే సాధారణ పంటలవైపు మళ్లాల్సిందిగా అమెరికాలోని జీఎం రైతులకు ఒక స్పష్టమైన సందేశం పంపినట్లు అవుతుంది.
ప్రపంచానికి కావాల్సింది కూడా అదే. పైగా అభివృద్ధి చెందుతున్న దేశాల భద్రత, ఆరోగ్యాన్ని కాపాడటం, ఆహార అవసరాలను తీర్చడం కంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు అమెరికా వాణిజ్య ప్రయో జనాలు తీర్చడం ముఖ్యం కాబోదు. తమకు ఏది అవసరం లేదో దాన్ని విస్పష్టంగా చెప్పే హక్కు ఆయా దేశాలకు ఉండాలి. ఈ అంశాల్లో బలహీనంగా ఉన్న కారణంగానే చాలా దేశాలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు దూరంగా జరుగుతున్నాయి.
అమెరికా ఈ వైఖరి ఒక్క జన్యుమార్పిడి ఆహారానికే పరిమితం కాదు. క్యాన్సర్ కారకమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గడ్డి మందుల విషయంలో వందల కోట్ల డాలర్ల జరిమానాలు పడ్డా, వేల సంఖ్యలో కోర్టు కేసులు ఎదుర్కొంటున్నా ఆ పరిశ్రమ ఎగుమతుల కోసం అతురతతో ఎదురు చూస్తోంది. ఈ కారణంగానే ఏమో... జీఎం టెక్నాలజీకి అనూహ్యంగా భారత్, కెన్యా, ఇండోనేసియాల్లో మంచి మద్దతు లభిస్తోంది. తక్కువ దిగుబడులిచ్చే జన్యుమార్పిడి ఆవాల విషయాన్నే తీసుకుందాం. భారత్‌లో ఇదో అర్థం లేని వంగడం.
భారత్ తన వంటనూనె అవసరాల్లో దాదాపు 55 శాతాన్ని దిగుమతుల ద్వారా పూర్తి చేసుకుంటోంది. ఈ దిగుమతులు సుమారు కోటీ ముప్ఫై లక్షల టన్నుల వరకూ ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక వంటనూనె దిగుమతిదారుల్లో ఇటీవలే భారత్ రెండో స్థానానికి చేరింది. తగినంత వంటనూనె సొంతంగా ఉత్పత్తి చేసుకోలేక కాదు... ప్రభుత్వ ప్రాథమ్యాల్లో, విధానాల్లో తేడాలు ఇందుకు కారణం.
చౌక దిగుమతులకు అనుమతులివ్వడం, దిగుమతి సుంకాలను తగ్గించడం సరేసరి. ఈ చర్యల ద్వారా వంటనూనెల విషయంలో స్వావలంబన సాధించేందుకు 1993 – 94లో మొదలుపెట్టిన పసుపు విప్లవం కాస్తా నిర్వీర్యమవుతోంది.
తక్కువ దిగుబడినిచ్చే జన్యుమార్పిడి ఆవాల వంగడాన్ని డీఎంహెచ్–11 అని పిలుస్తున్నారు. దీంట్లో కీటకనాశినులను తట్టు కునే మూడు జన్యువులుంటాయి. దీని ద్వారా హెక్టారుకు 2,626 కిలోల దిగుబడి వస్తుందని అంచనా. దాదాపు 3,012 కిలోలతో ఇప్పటికే డీఎంహెచ్–4 వంగడం డీఎంహెచ్–11 కంటే 14.7 శాతం ఎక్కువ దిగుబడి ఇస్తోంది.
ఇలాంటివే ఇంకో నాలుగు వంగడాలు ఉండటం గమనార్హం. విచిత్రమైన విషయం ఏమంటే– డీఎంహెచ్–11 వంగడాన్ని అతితక్కువ దిగుబడినిచ్చే వరుణ వంగ డంతో పోల్చి, తమది 25 – 30 శాతం ఎక్కువ దిగుబడి ఇస్తుందని చెప్పడం!
ఇంకోపక్క అందుబాటులో ఉన్న వంగడాలతోనే కొన్ని కొత్త టెక్నాలజీల సాయం (సిస్టమ్ ఆఫ్ మస్టర్డ్ ఇంటెన్సిఫికేషన్)తో మధ్య ప్రదేశ్‌లో ఆవాల దిగుబడి హెక్టారుకు 4,693 కిలోల స్థాయికి తేగల మని ఇప్పటికే నిరూపితమైంది. ఎల్లో రివల్యూషన్‌ను మళ్లీ పట్టా లెక్కించేందుకు ఇలాంటి పద్ధతులను దేశవ్యాప్తంగా ప్రచారంలో పెట్టడం, సాగు విస్తీర్ణాన్ని ప్రోత్సహించడం అవసరం.
దేవీందర్ శర్మ
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు
ఈ–మెయిల్: hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment