Transgenic crops
-
జీఎం ఆవాలు.. జనానికి సవాలు
మనదేశంలో ఇప్పటివరకు ప్రభుత్వ అనుమతి ఉన్న ఏకైక జన్యుమార్పిడి పంట బీటీ పత్తి. ఇప్పుడు ఆహార పంటల్లోకీ జన్యుమార్పిడి సాంకేతికత విస్తరిస్తోంది. జన్యుమార్పిడి ఆవాల సాగుకు కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన జెనిటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జేఈఏసీ) ఇటీవల అనుమతులు ఇవ్వటంతో చాలా ఏళ్ల తర్వాత జీఎం టెక్నాలజీ మళ్లీ చర్చనీయాంశమైంది. చీడపీడలను తట్టుకునే బీటీ జన్యువుతోపాటు కలుపుమందును తట్టుకునేలా కూడా జన్యుమార్పిడి చేసిన (హెచ్‌టీబీటీ) హైబ్రిడ్ ఆవాల రకం డీఎంహెచ్–11కు జేఈఏసీ పచ్చజెండా ఊపింది. ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ వ్యాప్తిని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వమే.. రసాయన కలుపుమందులను తట్టుకునే జన్యుమార్పిడి ఆహార పంటలకు గేట్లు తెరవటం విమర్శలకు తావిస్తోంది. సేంద్రియ సాగులో రసాయనాలతోపాటు జన్యుమార్పిడి పంటలూ నిషిద్ధమే. దేశవాళీ విత్తన పరిరక్షణ కృషిలో నిమగ్నమైన స్వచ్ఛంద సంస్థ ‘భారత్ బీజ్ స్వరాజ్ మంచ్’ హెచ్‌టీబీటీ ఆవ పంటపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘మంచ్’ కన్వీనర్ జాకబ్ నెల్లితానంతో ‘సాక్షి’తో చెప్పిన ముఖ్యాంశాలు.. కేంద్రం చెబుతున్నట్లు దేశంలో ఆవాల దిగుబడి పెంచటం కోసమే అయితే కలుపుమందును తట్టుకునే హైబ్రిడ్ బీటీ ఆవ వంగడానికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. అధిక దిగుబడినిచ్చే వంగడాలు మన దగ్గర ఇప్పటికే ఉన్నాయి. జన్యుమార్పిడి ఆవ రకం హెక్టారుకు 30–32 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, అంతకన్నా ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలు మన రైతుల దగ్గర ఉన్నాయి. ఉదాహరణకు.. ‘గోబి సార్సమ్ మస్టర్డ్’ రకం. ఇది సేంద్రియ సేద్యంలో హెక్టారుకు 40 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ప్రభుత్వం దిగుబడులు పెంచాలనుకుంటే ఇటువంటి వంగడాలను పోత్సహించుకోవచ్చు కదా? ఆహార పంటల్లో కూడా జన్యుమార్పిడి సాంకేతికతను ప్రవేశపెట్టడమే ప్రభుత్వ ఉద్దేశం. జన్యుమార్పిడి ఆవ పంట కావాలని రైతులు అడగలేదు. ప్రజలు స్పందించి ఉద్యమించి అడ్డుకోకపోతే మరిన్ని ఆహార పంటలకు సంబంధించి జన్యుమార్పిడి విత్తనాలకు అనుమతులిచ్చే ముప్పు పొంచి ఉంది. రైతులకు ఉండే సంప్రదాయ విత్తనాల హక్కులను జన్యుమార్పిడి విత్తనాలు ధ్వంసం చేస్తాయి. వీటిని కార్పొరేట్ కంపెనీల లాభాపేక్ష కోసమే జన్యుమార్పిడి చేసి, విత్తనాలను కంపెనీల ఆస్తిగా మార్చే ప్రక్రియకు ప్రభుత్వం పూనుకుంటోంది. అదీగాక జన్యుమార్పిడి విత్తనాల వల్ల సంప్రదాయ పంటల స్వచ్ఛత దెబ్బతింటుంది. జన్యుకాలుష్యం జరిగితే తర్వాత మళ్లీ పాత స్థితికి తేవటం సాధ్యం కాదు. అందుకే జన్యుమార్పిడి పంటలను మేం వ్యతిరేకిస్తున్నాం. –సాక్షి, సాగుబడి -
జన్యుమార్పిడి పంటలకు ఊతమా?
భారత్‌కు వ్యతిరేకంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో అమెరికా ఫిర్యాదు చేసింది. బియ్యం, ఆపిల్లతోపాటు అన్ని రకాల జన్యుమార్పిడి ఆహార దిగుమతు లపై భారత్ నియంత్రణలు విధించడాన్ని ప్రశ్నించింది. జన్యుమార్పిడి ఆవాల పంటకు ‘పర్యావరణ అనుమతులు’ మన దేశంలో ఇచ్చినప్పుడే ఈ పరిణామాలు జరగడం గమనార్హం. సురక్షితం కాని జన్యుమార్పిడి ఆహార దిగుమతులను అనుమతించేలా మన చట్టాలను మార్చుకోమని బలవంత పెట్టడం కంటే... తమ దేశ వ్యవసాయ రంగాన్ని అమెరికా ఎందుకు సరిచేసుకోదు? క్యాన్సర్ కారకమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గడ్డిమందుల విషయంలోనూ అమెరికా వైఖరి ఇదే. తమకు జన్యుమార్పిడి మొక్కజొన్న వద్దని మెక్సికో కరాఖండీగా చెప్పింది. అంత స్పష్టత మన దేశానికీ ఉండాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలు జన్యు మార్పిడి పంటల దిగుమతికి అనుమతిచ్చేలా అమెరికా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఆహారంపై ‘జన్యుమార్పిడి పంటలు కాదు’ అన్న లేబుల్ తగిలించాలని భారత్ డిమాండ్ చేస్తూండటం అమెరికా వ్యవసాయ ఎగుమతులకు నష్టం కలిగి స్తోందని అమెరికా ఫిర్యాదు. ఈ పరిణామాలన్నీ భారత పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జన్యుమార్పిడి ఆవాల పంటకు ‘పర్యావరణ అనుమతులు’ ఇచ్చినప్పుడే జరగడం గమనార్హం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో అమెరికా ఫిర్యాదు చేసింది ఒక్క భారతదేశంపై మాత్రమే కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు జన్యు మార్పిడి పంటలు, దిగుమతులు, టెక్నాలజీపై నిషేధం తొలగించేలా చేసేందుకు అమెరికా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. యూరో పియన్ యూనియన్‌తోపాటు ఇండియా, మెక్సికో, కెన్యా, ఇండోనేసి యాలను లక్ష్యంగా చేసుకుని పని చేస్తోంది. మెక్సికో అధ్యక్షుడు ఆడ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్పై అమెరికా పెట్టిన ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉందంటే– తమకు జన్యు మార్పిడి మొక్కజొన్న అస్సలు వద్దు. స్వేచ్ఛాయుతమైన, సార్వభౌమ అధికారులున్న దేశం కావాలని కరాఖండీగా చెప్పేంత. గత ఏడాది మెక్సికో ఒక అధ్యక్ష ఉత్తర్వు జారీ చేస్తూ... జన్యుమార్పిడీ మొక్క జొన్నను దశలవారీగా తొలగిస్తామని స్పష్టం చేసింది. హానికారక గ్లైఫాసేట్ వాడకాన్ని కూడా 2024 నాటికి నిషేధిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయాల ప్రభావం అమెరికా నుంచి దిగుమతి అవుతున్న కోటీ డెబ్భై లక్షల టన్నుల మొక్కజొన్నలపై ఉంటుంది. మెక్సికో తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు మిగిలిన దేశాలు వ్యవహరించడం కష్టం. అశోకా యూనివర్సిటీ అసోసియేట్ అధ్యా పకుడు అనికేత్ ఆఘా ఇలాంటి వ్యవహారాన్ని వ్యవసాయ పెట్టుబడి దారీ విధానం అంటారు. కెన్యా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి మోజెస్ కురియా చేసిన ప్రకటన అందరినీ నిర్ఘాంత పరిచింది. ‘‘ఈ దేశంలో ఉన్నామంటే చావుకు సిద్ధమైన వ్యక్తిగా ఉన్నట్లే. చావుకు పోటీ పడుతున్నవాటికి జన్యుమార్పిడి పంటలను కూడా చేర్చడం తప్పేమీ కాదు. అందుకే ఉద్దేశపూర్వకంగానే ఈ దేశంలోకి జన్యుమార్పిడి పంటలను అనుమతించాం’’ అన్నారు మోజెస్. ఆ తరువాత పదేళ్ల నిషేధాన్ని ఎత్తివేయడమే కాకుండా, ఆరు నెలలపాటు జీఎం మొక్క జొన్న, సాధారణ మొక్కజొన్నల దిగుమతులపై పన్నులను కూడా ఎత్తేశారు. ఈ ప్రకటన జరిగిన కొన్ని వారాల్లో 32 మంది సభ్యులున్న అమెరికా వాణిజ్య బృందం నైరోబీలో పర్యటించింది. మెక్సికో నిషేధం తరువాత అమెరికన్ రైతులపై ఉన్న జీఎం పంటల భారాన్ని కెన్యా కొంత భరిస్తుందని వారి నమ్మకం మరి. ఇండొనేసియా విషయానికొస్తే... అక్కడ వ్యవసాయ సంబంధిత సంఘాల తీవ్ర వ్యతిరేకత మధ్య అధ్యక్షుడు జోకో వైడోడో దేశంలో పడిపోతున్న సోయాబీన్ దిగుబడులు పెంచేందుకు జన్యుమార్పిడి పంటల సాగు చేపట్టాలనీ, అవసరమైతే జీఎం విత్తనాలను దిగుమతి చేసుకోవాలనీ అంటూండటం గమనార్హం. అసురక్షితమైన, ప్రమాదాలతో కూడిన జన్యుమార్పిడి ఆహారపు దిగుమతులను అనుమతించేలా మన చట్టాలను మార్చుకోమని అమెరికా బలవంత పెట్టడం కంటే... తమ దేశంలో వ్యవసాయ రంగాన్ని ఎందుకు సరిచేసుకోదు? అమెరికా తన ప్రజల కోసం జన్యుమార్పిడి పంటలను సాగు చేసుకోవాలనుకుంటే మనకేమీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ... ఎగుమతి అవసరాల కోసం సాధారణ బియ్యం, ఆపిల్లను సాగు చేయడం ఎందుకు మొదలుపెట్టదు? యూరోపియన్ యూనియన్, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు హానికారక జన్యుమార్పిడి పంటల నుంచి రక్షణకు చేసుకున్న ఏర్పాట్లను బలహీనపరచాలని అమెరికా ఎందుకు ఒత్తిడి చేస్తోంది? ఈ జన్యుమార్పిడి ఉత్పత్తులు గడ్డి మందులను తట్టుకోగలవు కాబట్టి. వీటిని వాడటం మొదలుపెడితే విషపూరిత మైన కీటకనాశినుల విక్రయాలు గణనీయంగా పెరుగుతాయి. భారత్‌లో 2002లో బీటీ కాటన్ ప్రవేశించింది మొదలు పత్తిపై చల్లే కీటకనాశినుల ఖర్చు హెక్టారుకు 37 శాతం పెరిగింది. సాధారణ మొక్కజొన్నల విషయంలో మెక్సికో డిమాండ్‌ను తాము తీర్చగలమని అమెరికాలోని రైతులు కొందరు ప్రకటించిన విషయాన్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గుర్తుంచుకోవాలి. నిజానికి భారత్ కూడా అమెరికా నుంచి జన్యుమార్పిడి ఆహార దిగుమతులను అడ్డుకునే విషయంలో గట్టిగా నిలుస్తుందని భావిస్తున్నాను. అలా చేయగలిగితే సాధారణ పంటలవైపు మళ్లాల్సిందిగా అమెరికాలోని జీఎం రైతులకు ఒక స్పష్టమైన సందేశం పంపినట్లు అవుతుంది. ప్రపంచానికి కావాల్సింది కూడా అదే. పైగా అభివృద్ధి చెందుతున్న దేశాల భద్రత, ఆరోగ్యాన్ని కాపాడటం, ఆహార అవసరాలను తీర్చడం కంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు అమెరికా వాణిజ్య ప్రయో జనాలు తీర్చడం ముఖ్యం కాబోదు. తమకు ఏది అవసరం లేదో దాన్ని విస్పష్టంగా చెప్పే హక్కు ఆయా దేశాలకు ఉండాలి. ఈ అంశాల్లో బలహీనంగా ఉన్న కారణంగానే చాలా దేశాలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు దూరంగా జరుగుతున్నాయి. అమెరికా ఈ వైఖరి ఒక్క జన్యుమార్పిడి ఆహారానికే పరిమితం కాదు. క్యాన్సర్ కారకమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గడ్డి మందుల విషయంలో వందల కోట్ల డాలర్ల జరిమానాలు పడ్డా, వేల సంఖ్యలో కోర్టు కేసులు ఎదుర్కొంటున్నా ఆ పరిశ్రమ ఎగుమతుల కోసం అతురతతో ఎదురు చూస్తోంది. ఈ కారణంగానే ఏమో... జీఎం టెక్నాలజీకి అనూహ్యంగా భారత్, కెన్యా, ఇండోనేసియాల్లో మంచి మద్దతు లభిస్తోంది. తక్కువ దిగుబడులిచ్చే జన్యుమార్పిడి ఆవాల విషయాన్నే తీసుకుందాం. భారత్‌లో ఇదో అర్థం లేని వంగడం. భారత్ తన వంటనూనె అవసరాల్లో దాదాపు 55 శాతాన్ని దిగుమతుల ద్వారా పూర్తి చేసుకుంటోంది. ఈ దిగుమతులు సుమారు కోటీ ముప్ఫై లక్షల టన్నుల వరకూ ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక వంటనూనె దిగుమతిదారుల్లో ఇటీవలే భారత్ రెండో స్థానానికి చేరింది. తగినంత వంటనూనె సొంతంగా ఉత్పత్తి చేసుకోలేక కాదు... ప్రభుత్వ ప్రాథమ్యాల్లో, విధానాల్లో తేడాలు ఇందుకు కారణం. చౌక దిగుమతులకు అనుమతులివ్వడం, దిగుమతి సుంకాలను తగ్గించడం సరేసరి. ఈ చర్యల ద్వారా వంటనూనెల విషయంలో స్వావలంబన సాధించేందుకు 1993 – 94లో మొదలుపెట్టిన పసుపు విప్లవం కాస్తా నిర్వీర్యమవుతోంది. తక్కువ దిగుబడినిచ్చే జన్యుమార్పిడి ఆవాల వంగడాన్ని డీఎంహెచ్–11 అని పిలుస్తున్నారు. దీంట్లో కీటకనాశినులను తట్టు కునే మూడు జన్యువులుంటాయి. దీని ద్వారా హెక్టారుకు 2,626 కిలోల దిగుబడి వస్తుందని అంచనా. దాదాపు 3,012 కిలోలతో ఇప్పటికే డీఎంహెచ్–4 వంగడం డీఎంహెచ్–11 కంటే 14.7 శాతం ఎక్కువ దిగుబడి ఇస్తోంది. ఇలాంటివే ఇంకో నాలుగు వంగడాలు ఉండటం గమనార్హం. విచిత్రమైన విషయం ఏమంటే– డీఎంహెచ్–11 వంగడాన్ని అతితక్కువ దిగుబడినిచ్చే వరుణ వంగ డంతో పోల్చి, తమది 25 – 30 శాతం ఎక్కువ దిగుబడి ఇస్తుందని చెప్పడం! ఇంకోపక్క అందుబాటులో ఉన్న వంగడాలతోనే కొన్ని కొత్త టెక్నాలజీల సాయం (సిస్టమ్ ఆఫ్ మస్టర్డ్ ఇంటెన్సిఫికేషన్)తో మధ్య ప్రదేశ్‌లో ఆవాల దిగుబడి హెక్టారుకు 4,693 కిలోల స్థాయికి తేగల మని ఇప్పటికే నిరూపితమైంది. ఎల్లో రివల్యూషన్‌ను మళ్లీ పట్టా లెక్కించేందుకు ఇలాంటి పద్ధతులను దేశవ్యాప్తంగా ప్రచారంలో పెట్టడం, సాగు విస్తీర్ణాన్ని ప్రోత్సహించడం అవసరం. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
అసంబద్ధత మన జన్యుగతం
జాతిహితం మనం పండిస్తున్న, తీసుకుంటున్న ఆహారంలో జన్యుమార్పిడి పంటలకి ఇప్పటికే చాలా చోటు ఇచ్చాం. కానీ దీని గురించి ఎవరూ ఫిర్యాదు చేయడంలేదు. దేశీయంగా జన్యు మార్పిడి విధానంతో తయారుచేసిన ఆవాల వినియోగాన్ని అనుమతించడం వెనుక అలుముకున్న అర్థంలేని భయాలు ఇకనైనా సమసిపోవాలి. వాటిలోని విషపు లక్షణాలు, ఎలర్జీ లక్షణాల గురించి జరిగిన అధ్యాయాలన్నీ కూడా ఆ ఆవాలు నిరపాయకరమనే చెప్పాయి. ఇప్పుడు మన పత్తి విత్తనం కూడా జన్యుమార్పిడి పంట నుంచి వచ్చినదే. మనకీ, భవిష్యత్ తరాలకీ కూడా ఎంతో కీలకమని చెప్పదగిన అంశాలు వాస్తవాలకు ఎంత దూరంగా ఉన్నాయో గమనించాలంటే ఢిల్లీ విశ్వవిద్యా లయం దక్షిణ క్యాంపస్‌కి ఒక్కసారి నాతో కలసిరండి. ఢిల్లీలోని రావు తులా రామ్ మార్గ్‌కు ఒక కొసన వాయువ్యంగా ఉన్న ఈ విద్యా ప్రాంగణం ఉనికి గురించి బహుశా ఢిల్లీలో కూడా చాలామందికి తెలియదు. నిజానికి ఇప్పుడు అక్కడికి చేరుకోవడం కూడా పెద్ద సవాలే. ఎందుకంటే నత్తనడకన సాగు తున్న మా మెట్రో నిర్మాణం మూడో దశ కోసం ఆ ప్రదేశమంతా గోతులు తవ్వారు. ఆ ప్రాంగణమంతా ఈ వారంతంలో జరిగే విద్యార్థి ఎన్నికలకి సంబంధించిన వాల్‌పోస్టర్లతో నిండిపోయి ఉంది. ఆ ప్రాంగణం ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంది. అక్కడ చాలా ముఖ్యమైన కార్యాలయాలతో పాటు, బహుశా దేశంలోనే చెప్పుకోదగిన బయోటెక్నాలజీ ప్రయోగశాల కూడా ఉంది. మూడు దశాబ్దాల శ్రమ అదొక చిన్న ప్రయోగశాల. ఒక అంతస్తులో ఒక భాగంలో ఏర్పాటు చేశారు. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండవచ్చు. అందులో 22 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసు ఉన్న దాదాపు రెండు డజన్ల మంది పరిశోధకులు పనిచేస్తున్నారు. పట్టణ ప్రాంతాల వారి పాలిట భూతంలా తయారైన వివిధ రకాల జన్యు మార్పిడి పంటల సాంకేతిక పరిజ్ఞానం మీదే పరిశోధనలు సాగిస్తున్నారు. అయితే ఈ పరిశోధనా కేంద్రానికి నాయకత్వం వహిస్తున్న ఆచార్య దీపక్ పెంతాల్ మాత్రం జన్యు మార్పిడి పంట అన్న పదమే తప్పుదోవ పట్టించే విధంగా ఉందని మరీ మరీ చెప్పారు. జన్యమార్పిడి పంటలు (జెనెటికల్లీ మోడీఫైడ్) అనడానికి బదులు జెనెటికల్లీ ఇంజనీయర్డ్ (జీయీ) అని చెప్పడం సముచితంగా ఉంటుందని ఆయన అంటున్నారు. కానీ ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూశాక, వికృతమైపోయిన ఈ పారిభాషిక పదాల ఇబ్బంది పెద్ద విషయమే కాదని అనిపిస్తుంది. ప్రొఫెసర్ పెంతాల్, జన్యు, వంగడాల సృష్టి పరిశోధనలో ఆయనతో పని చేస్తున్న ఐదుగురు ముఖ్య పరిశోధకులు 32 ఏళ్ల పాటు శ్రమించి తయారుచేసిన దేశవాళీ జన్యు మార్పిడి ఆవాలు అన్ని కోణాల నుంచి నిరపాయకరమైనవని జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ (జీఈఏసీ) ఆమోద ముద్ర వేయ డంతో ఊపిరి పీల్చుకున్నారు. జన్యు మార్పిడి ద్వారా సృష్టించిన ఈ విత్తనం 2002 నుంచి అందు బాటులోనే ఉందని ప్రొఫెసర్ పెంతాల్ చెప్పారు. అప్పటి నుంచే విజ్ఞానశాస్త్ర శంకితులు, నిరాశావాదులతో ఎడతెగని యుద్ధం ఆరంభమైంది. ఇలాంటి శంకలకు తెరపడాలని ప్రొఫెసర్ పెంతాల్ అన్నారు. ఈ ఆవాలు ఎంత సురక్షితమైనవో వివరిస్తూ జీఈఏసీకి తమ శాస్త్రవేత్తల బృందం సమర్పించిన నాలుగు వేల పేజీల నివేదికలోని అంశాలను కూడా చూపించారు. ఈ పరిశోధన మీద లేవనెత్తిన సందేహాలు, శంకల గురించి ఆయన కొంత తాత్విక ధోరణిని ప్రదర్శిస్తున్నప్పటికీ, కొన్ని అపనిందలు, దూషణలు కూడా ఆయన ఎదుర్కొనవలసి వచ్చింది. ప్రొఫెసర్ పెంతాల్ నాకు గుర్తు చేసినంత వరకు ఆఖరికి గ్రంథచౌర్యం వంటి విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. ఇలాంటి విమర్శలు ఆయనను పరిశోధన తృష్ణ నుంచి పక్కకి తప్పించినా ఆశ్యర్యం లేదు. జన్యు మార్పిడి పంటలు మనకు తెలిసినంత వరకు రాజకీయ రంగును అద్దుకున్న, ఉద్విగ్నపూరిత అంశం. అలాగే ఈ పంటల గురించి వాస్తవాలను ఇతర పరిశోధనలతో బేరీజు వేసినప్పటికీ అవి ఊహాజనిత వాస్తవాలూ, భయాల ముందు వీగిపోతూ, మితవాద, అతివాద సిద్ధాంతాల వారిని కూడా ఏకం చేస్తున్నాయి. పవిత్ర గ్రీన్‌పీస్, పరమ పవిత్ర స్వదేశీ ఉద్య మకారులనీ లేదా ఆరెస్సెస్ వారినీ కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఉద్యమకారుల భయాలు వీరి భయాలలో చాలా ముఖ్యమైనది విదేశీ భయం. జన్యుమార్పిడి పంటకు ఉపయోగించే విత్తనాలను దుష్టశక్తులు తయారు చేశాయనీ, పీక్కు తినే బహుళజాతి సంస్థలు పేటెంట్ హక్కులు కలిగి ఉన్నాయనీ, అవి జన్యు పంటల నిల్వల ధరలనూ, సరఫరానూ శాసిస్తాయనీ, పేద దేశాల రైతులను బానిసలుగా మార్చుకుంటాయనీ ఉద్యమకారులకు భయాలు ఉన్నాయి. కానీ ఈ ఆవాలు మాత్రం పూర్తిగా ప్రభుత్వ నిర్వహణలోని ఒక ప్రయోగశాలలో తయారై, దాని అధీనంలోనే ఉన్నాయి. ఈ ప్రయోగశాలకు ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా నిధులు అందిస్తున్నాయి. రాజీవ్‌గాంధీ జాతీయ విత్తన సంస్థకు నిధులు అందిస్తున్న డాక్టర్ వర్ఘీస్ కురియన్ జాతీయ పాడి పరిశ్ర మాభివృద్ధి బోర్డు కూడా అలా నిధులు అందిస్తున్న సంస్థలలో ఒకటి. భారతదేశంలో వంటనూనెల కొరత ఉంది. ఏటా పెద్ద ఎత్తును దిగుమతులు కూడా జరుగుతాయి. దేశంలో చమురు గింజల పంటలలో ఆవ పంటది మూడో స్థానం. దీని ఉత్పత్తి ఇప్పుడు 25 నుంచి 30 శాతం పెరగబోతోంది. 1987లో దీపక్ పెంతాల్ అనే ఆ యువ శాస్త్రవేత్త ఈ ప్రయోగశాలను ప్రారం భించినప్పుడు కురియన్ కన్న కల కూడా అదే (ప్రొఫెసర్ పెంతాల్ నేను చండీగడ్‌లోని పంజాబ్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థులం. ఆయన నాకంటే కొన్నేళ్లు ముందు చేరినా ఒకే విద్యార్థి వసతిగృహంలో ఉండేవాళ్లం). పరిశోధన క్రమం ప్రొఫెసర్ పెంతాల్ వృక్షశాస్త్రజ్ఞుడు. రట్జర్స్ నుంచి పీహెచ్. డీ. పట్టా తీసుకున్నారు. ఈ పరిశోధన చేస్తున్నప్పుడు, తరువాత పోలండ్‌లో కొద్ది కాలం బోధనావృత్తిలో ఉన్నప్పుడు ఆయన ఆవాల పరిశోధన మీద మమ కారం పెంచుకున్నారు. ఒక పోలండ్ రకంతో, భారతీయ రకం విత్తనంతో సాధారణ సంకరీకరణ తీరులో పరపరాగ సంపర్కం గావించడానికి (క్రాస్ పోలినేషన్) జరిగిన పరిశోధనలో ఆయన పనిచేశారు. నిజానికి అది సాధ్యం కాని సంగతి. ఆవపువ్వు లక్షణమే అందుకు కారణం. దీనిని వృక్షశాస్త్రజ్ఞులు హెర్మాఫ్రోడైట్ అని పిలుస్తారు. స్త్రీపురుషాంగాలు రెండూ ఈ పువ్వులోనే ఉంటాయి. అంటే వేరే జాతి వీర్యాన్ని ప్రవేశపెట్టడానికే ముందే తానే స్వయంగా ఫలదీకరణం చెందుతుంది. అయితే ఏమైంది? అని ఆలోచించారా యన. అందులోని పురుష లక్షణాన్ని పరిపూర్ణంగా నిర్మూలిస్తే సరిపోతుందని అందుకు మార్గం కనిపెట్టారు (ఇక్కడ నేను కావాలనే పారిభాషిక పదాలను వదిలి, సాధారణ భాషను ప్రయోగిస్తున్నాను). అలా ఆయన ఒక స్త్రీరకంతో వేరేదానితో పరపరాగ సంపర్కం చేయించారు. నిజానికి అప్పటికి జెనెటికల్ ఇంజనీరింగ్ అనేది చాలా కొత్త అంశం. ప్రొఫెసర్ పెంతాల్, ఆయన కీలక అనుయాయులు దీనిని ఒక సవాలుగా తీసుకున్నారు. బర్నేస్, బారస్టర్, బార్ అనే మూడు కొత్త జన్యువులను దేశీయమైన మన ఆవ రకంలో ప్రవేశ పెట్టారు. మొదటి రెండు రకాలు సాధారణ నేల బాక్టెరియం నుంచి వచ్చాయి. మూడో జన్యువు స్ట్రెప్టోమైస్ అనే జాతికి చెందినది. ఇవన్నీ కూడా నిరపాయకరమైనవే (లేదా నాన్ పేథోజనిక్). నిజానికి ఆవలో 85,000 జన్యువులు ఉంటాయి. పెంతాల్ బృందం కృషి ప్రొఫెసర్ పెంతాల్ బృందంలోని శాస్త్రవేత్తలంతా వారి యవ్వన ప్రాయం నుంచి వృద్ధాప్యం వరకు కలసికట్టుగానే పనిచేశారు. అనేక పత్రిక లలో నలభైకి పైగా పరిశోధన పత్రాలను ప్రచురించారు. అనేక మంది యువతీ యువకుల చేత పరిశోధనలు చేయించారు. అందరికీ చాలామంది అవకాశాలు వచ్చాయి. ప్రొఫెసర్ పెంతాల్ ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పదవికి ఎంపికయ్యారు. అయినప్పటికీ ఆయన ఎన్నడూ తన ప్రయోగశాలను విడిచిపెట్టలేదు. పైగా వీసీ పదవీకాలం ముగియగానే మళ్లీ పూర్తి సమయం ఆ ప్రయోగశాలకే కేటాయించారు. అయితే గడచిన దశా బ్దాలుగా దేశీయమైన మన విజ్ఞానశాస్త్రంలో సంభవించిన పతనానికీ, ప్రతిభకు పట్టిన దుస్థితికీ, మన పరతంత్రతకీ మనమంతా సామూహికంగా సంతాపం ప్రకటించాలి. అతి పెద్ద సమస్య ఏమిటంటే, మన శాస్త్రవేత్తలు ఏదైనా ఉన్నతోద్యోగంలోకి ప్రవేశిస్తే వెంటనే పరిశోధనకు మంగళం పాడడమేనని అంటారు ప్రొఫెసర్ పెంతాల్. ఇలాంటి వాళ్లనే ఆయన సైన్స్ బ్యూరోక్రాట్స్ అని పిలుస్తారు. ఆయనకి యూపీఎస్సీ సభ్యత్వం కూడా వచ్చింది. ఐదేళ్లపాటు నరకప్రాయంగా ఉండే ఆ పదవిలో చేరకుండా తన ఆవాల పరిశోధనకే పునరంకితమయ్యారు. భారతీయులంతా రుచిచూసినవారే! మీరు పండించిన జన్యు మార్పిడి పంటల ద్వారా వచ్చిన ఆవాలను మీరు వినియోగించి, మీ సంతానం కూడా ఉపయోగించేటట్టు చేయగలరా అని మీరు వారిని అడగవచ్చు. తప్పకుండా అని వారు చెబుతారు. వాటికి అనుమతి వచ్చినప్పటి నుంచి తమ కుటుంబాలు వినియోగిస్తున్నాయనీ చెబుతారు. వాటిలోని విషపు లక్షణాలు, ఎలర్జీ లక్షణాల గురించి జరిగిన అధ్యాయాలన్నీ కూడా ఆ ఆవాలు నిరపాయకరమనే చెప్పాయి. ప్రపంచ వ్యాప్తంగా జన్యుమార్పిడి పంటల ఉత్పత్తులతో చేసిన కోట్లాది వంటకాలను ప్రజలు ఆరగిస్తున్నారు. నిజానికి వీటిని తీసుకోవడం వల్ల హాని జరగదని హామీ ఇచ్చే ఎలాంటి పత్రాలు లేకుండానే వారంతా ఆ ఆహారాన్ని విని యోగిస్తున్నారు. అలా ఆమోదం పొందిన మొదటి జన్యుమార్పిడి ఆవ పంట పేరు కానోలా. కెనడాలో 1996లో రూపొందించిన జన్యుమార్పిడి ఆవ గింజలవి. వాటినే ఏటా భారతదేశం దాదాపు నాలుగు లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటుంది. వీటి గురించి ఎలాంటి ఫిర్యాదు లేదు. సోయాబీన్ ఉన్న వంటనూనెలు, వనస్పతి కూడా అంతకంటే ఎక్కువ దిగుమతి అవుతున్నాయి. వీటికి మూలం జన్యుమార్పిడి పంటలే. ఇప్పుడు మన పత్తి విత్తనం కూడా జన్యుమార్పిడి పంట నుంచి వచ్చినదే, లేదా బీటీ కాటన్. ప్రతి భారతీయుడు ఇప్పుడు జన్యుమార్పిడి వంటనూనెలు తీసుకుంటున్నా డని కచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఎవరూ ప్రతిఘటించడం లేదు. అమెరికా, కెనడా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలలో చాలా భాగం, నిజానికి చైనా కూడా జెనెటిక్ ఇంజనీరింగ్‌ను ఆశ్రయించినవే. రచయిత:శేఖర్ గుప్తా twitter@shekargupta -
బహుళజాతి కంపెనీలకు ఝలక్
* జన్యుమార్పిడి ప్రయోగాలపై అభ్యంతరాలు * సాంకేతిక సమాచారం కోరిన వ్యవసాయశాఖ సాక్షి, హైదరాబాద్: జన్యుమార్పిడి పంటలపై ప్రయోగాలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని బహుళ జాతి కంపెనీలు (ఎంఎన్సీ) చేసుకున్న దరఖాస్తులను రాష్ట్ర వ్యవసాయశాఖ పక్కనపెట్టింది. కంపెనీలు దరఖాస్తుల్లో వెల్లడించిన వివరాలు సంతృప్తి కలిగించకపోవడంతో ఆ శాఖ అభ్యంతరం వ్యక్తంచేసింది. ప్రయోగాలు ఎందుకు చేయదలిచారు? ఏ పంటలపై చేస్తారు? రైతులకు కలిగే లాభమేంటి? ప్రయోగించబోయే విత్తన మూలకాలు ఏ లేబరేటరీలో, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో తయారుచేశారు? ఆ విత్తన మూలకాన్ని ఈ రాష్ట్రంలో జన్యుమార్పిడి చేస్తే విషపూరితం కావడానికి అవకాశం ఉందా? లేదా? తదితర సందేహాలను నివృత్తి చేస్తూ సమాచారంతో రావాలని వ్యవసాయశాఖ ఆదేశించింది. శాస్త్రీయ సమాచారంతో వస్తే అప్పుడు పరిశీలిస్తామని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పినట్లు సమాచారం. జన్యుమార్పిడి పంట ప్రయోగాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటికి అనుమతి ఇవ్వకూడదని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. కంపెనీలు సాంకేతిక సమాచారం తీసుకొచ్చినా వాటిపట్ల సంతృప్తి చెందే పరిస్థితి కనిపించడం లేదు. గోధుమలు, వరి, కూరగాయలు వంటి వాటిల్లో జన్యుమార్పిడి ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటికి అనుమతి సంపాదిస్తే తర్వాత పప్పుధాన్యాల్లోనూ దూరిపోవాలనేది బహుళజాతి కంపెనీల యోచనగా తెలుస్తోంది.