మనదేశంలో ఇప్పటివరకు ప్రభుత్వ అనుమతి ఉన్న ఏకైక జన్యుమార్పిడి పంట బీటీ పత్తి. ఇప్పుడు ఆహార పంటల్లోకీ జన్యుమార్పిడి సాంకేతికత విస్తరిస్తోంది. జన్యుమార్పిడి ఆవాల సాగుకు కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన జెనిటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జేఈఏసీ) ఇటీవల అనుమతులు ఇవ్వటంతో చాలా ఏళ్ల తర్వాత జీఎం టెక్నాలజీ మళ్లీ చర్చనీయాంశమైంది.
చీడపీడలను తట్టుకునే బీటీ జన్యువుతోపాటు కలుపుమందును తట్టుకునేలా కూడా జన్యుమార్పిడి చేసిన (హెచ్‌టీబీటీ) హైబ్రిడ్ ఆవాల రకం డీఎంహెచ్–11కు జేఈఏసీ పచ్చజెండా ఊపింది. ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ వ్యాప్తిని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వమే.. రసాయన కలుపుమందులను తట్టుకునే జన్యుమార్పిడి ఆహార పంటలకు గేట్లు తెరవటం విమర్శలకు తావిస్తోంది.
సేంద్రియ సాగులో రసాయనాలతోపాటు జన్యుమార్పిడి పంటలూ నిషిద్ధమే. దేశవాళీ విత్తన పరిరక్షణ కృషిలో నిమగ్నమైన స్వచ్ఛంద సంస్థ ‘భారత్ బీజ్ స్వరాజ్ మంచ్’ హెచ్‌టీబీటీ ఆవ పంటపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘మంచ్’ కన్వీనర్ జాకబ్ నెల్లితానంతో ‘సాక్షి’తో చెప్పిన ముఖ్యాంశాలు..
కేంద్రం చెబుతున్నట్లు దేశంలో ఆవాల దిగుబడి పెంచటం కోసమే అయితే కలుపుమందును తట్టుకునే హైబ్రిడ్ బీటీ ఆవ వంగడానికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. అధిక దిగుబడినిచ్చే వంగడాలు మన దగ్గర ఇప్పటికే ఉన్నాయి. జన్యుమార్పిడి ఆవ రకం హెక్టారుకు 30–32 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, అంతకన్నా ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలు మన రైతుల దగ్గర ఉన్నాయి. ఉదాహరణకు.. ‘గోబి సార్సమ్ మస్టర్డ్’ రకం. ఇది సేంద్రియ సేద్యంలో హెక్టారుకు 40 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ప్రభుత్వం దిగుబడులు పెంచాలనుకుంటే ఇటువంటి వంగడాలను పోత్సహించుకోవచ్చు కదా?
ఆహార పంటల్లో కూడా జన్యుమార్పిడి సాంకేతికతను ప్రవేశపెట్టడమే ప్రభుత్వ ఉద్దేశం. జన్యుమార్పిడి ఆవ పంట కావాలని రైతులు అడగలేదు. ప్రజలు స్పందించి ఉద్యమించి అడ్డుకోకపోతే మరిన్ని ఆహార పంటలకు సంబంధించి జన్యుమార్పిడి విత్తనాలకు అనుమతులిచ్చే ముప్పు పొంచి ఉంది.
రైతులకు ఉండే సంప్రదాయ విత్తనాల హక్కులను జన్యుమార్పిడి విత్తనాలు ధ్వంసం చేస్తాయి. వీటిని కార్పొరేట్ కంపెనీల లాభాపేక్ష కోసమే జన్యుమార్పిడి చేసి, విత్తనాలను కంపెనీల ఆస్తిగా మార్చే ప్రక్రియకు ప్రభుత్వం పూనుకుంటోంది. అదీగాక జన్యుమార్పిడి విత్తనాల వల్ల సంప్రదాయ పంటల స్వచ్ఛత దెబ్బతింటుంది. జన్యుకాలుష్యం జరిగితే తర్వాత మళ్లీ పాత స్థితికి తేవటం సాధ్యం కాదు. అందుకే జన్యుమార్పిడి పంటలను మేం వ్యతిరేకిస్తున్నాం.
–సాక్షి, సాగుబడి
Comments
Please login to add a commentAdd a comment