అసంబద్ధత మన జన్యుగతం
జాతిహితం
మనం పండిస్తున్న, తీసుకుంటున్న ఆహారంలో జన్యుమార్పిడి పంటలకి ఇప్పటికే చాలా చోటు ఇచ్చాం. కానీ దీని గురించి ఎవరూ ఫిర్యాదు చేయడంలేదు. దేశీయంగా జన్యు మార్పిడి విధానంతో తయారుచేసిన ఆవాల వినియోగాన్ని అనుమతించడం వెనుక అలుముకున్న అర్థంలేని భయాలు ఇకనైనా సమసిపోవాలి. వాటిలోని విషపు లక్షణాలు, ఎలర్జీ లక్షణాల గురించి జరిగిన అధ్యాయాలన్నీ కూడా ఆ ఆవాలు నిరపాయకరమనే చెప్పాయి. ఇప్పుడు మన పత్తి విత్తనం కూడా జన్యుమార్పిడి పంట నుంచి వచ్చినదే.
మనకీ, భవిష్యత్ తరాలకీ కూడా ఎంతో కీలకమని చెప్పదగిన అంశాలు వాస్తవాలకు ఎంత దూరంగా ఉన్నాయో గమనించాలంటే ఢిల్లీ విశ్వవిద్యా లయం దక్షిణ క్యాంపస్‌కి ఒక్కసారి నాతో కలసిరండి. ఢిల్లీలోని రావు తులా రామ్ మార్గ్‌కు ఒక కొసన వాయువ్యంగా ఉన్న ఈ విద్యా ప్రాంగణం ఉనికి గురించి బహుశా ఢిల్లీలో కూడా చాలామందికి తెలియదు. నిజానికి ఇప్పుడు అక్కడికి చేరుకోవడం కూడా పెద్ద సవాలే. ఎందుకంటే నత్తనడకన సాగు తున్న మా మెట్రో నిర్మాణం మూడో దశ కోసం ఆ ప్రదేశమంతా గోతులు తవ్వారు. ఆ ప్రాంగణమంతా ఈ వారంతంలో జరిగే విద్యార్థి ఎన్నికలకి సంబంధించిన వాల్‌పోస్టర్లతో నిండిపోయి ఉంది. ఆ ప్రాంగణం ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంది. అక్కడ చాలా ముఖ్యమైన కార్యాలయాలతో పాటు, బహుశా దేశంలోనే చెప్పుకోదగిన బయోటెక్నాలజీ ప్రయోగశాల కూడా ఉంది.
మూడు దశాబ్దాల శ్రమ
అదొక చిన్న ప్రయోగశాల. ఒక అంతస్తులో ఒక భాగంలో ఏర్పాటు చేశారు. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండవచ్చు. అందులో 22 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసు ఉన్న దాదాపు రెండు డజన్ల మంది పరిశోధకులు పనిచేస్తున్నారు. పట్టణ ప్రాంతాల వారి పాలిట భూతంలా తయారైన వివిధ రకాల జన్యు మార్పిడి పంటల సాంకేతిక పరిజ్ఞానం మీదే పరిశోధనలు సాగిస్తున్నారు. అయితే ఈ పరిశోధనా కేంద్రానికి నాయకత్వం వహిస్తున్న ఆచార్య దీపక్ పెంతాల్ మాత్రం జన్యు మార్పిడి పంట అన్న పదమే తప్పుదోవ పట్టించే విధంగా ఉందని మరీ మరీ చెప్పారు. జన్యమార్పిడి పంటలు (జెనెటికల్లీ మోడీఫైడ్) అనడానికి బదులు జెనెటికల్లీ ఇంజనీయర్డ్ (జీయీ) అని చెప్పడం సముచితంగా ఉంటుందని ఆయన అంటున్నారు. కానీ ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూశాక, వికృతమైపోయిన ఈ పారిభాషిక పదాల ఇబ్బంది పెద్ద విషయమే కాదని అనిపిస్తుంది. ప్రొఫెసర్ పెంతాల్, జన్యు, వంగడాల సృష్టి పరిశోధనలో ఆయనతో పని చేస్తున్న ఐదుగురు ముఖ్య పరిశోధకులు 32 ఏళ్ల పాటు శ్రమించి తయారుచేసిన దేశవాళీ జన్యు మార్పిడి ఆవాలు అన్ని కోణాల నుంచి నిరపాయకరమైనవని జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ (జీఈఏసీ) ఆమోద ముద్ర వేయ డంతో ఊపిరి పీల్చుకున్నారు.
జన్యు మార్పిడి ద్వారా సృష్టించిన ఈ విత్తనం 2002 నుంచి అందు బాటులోనే ఉందని ప్రొఫెసర్ పెంతాల్ చెప్పారు. అప్పటి నుంచే విజ్ఞానశాస్త్ర శంకితులు, నిరాశావాదులతో ఎడతెగని యుద్ధం ఆరంభమైంది. ఇలాంటి శంకలకు తెరపడాలని ప్రొఫెసర్ పెంతాల్ అన్నారు. ఈ ఆవాలు ఎంత సురక్షితమైనవో వివరిస్తూ జీఈఏసీకి తమ శాస్త్రవేత్తల బృందం సమర్పించిన నాలుగు వేల పేజీల నివేదికలోని అంశాలను కూడా చూపించారు. ఈ పరిశోధన మీద లేవనెత్తిన సందేహాలు, శంకల గురించి ఆయన కొంత తాత్విక ధోరణిని ప్రదర్శిస్తున్నప్పటికీ, కొన్ని అపనిందలు, దూషణలు కూడా ఆయన ఎదుర్కొనవలసి వచ్చింది. ప్రొఫెసర్ పెంతాల్ నాకు గుర్తు చేసినంత వరకు ఆఖరికి గ్రంథచౌర్యం వంటి విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. ఇలాంటి విమర్శలు ఆయనను పరిశోధన తృష్ణ నుంచి పక్కకి తప్పించినా ఆశ్యర్యం లేదు. జన్యు మార్పిడి పంటలు మనకు తెలిసినంత వరకు రాజకీయ రంగును అద్దుకున్న, ఉద్విగ్నపూరిత అంశం. అలాగే ఈ పంటల గురించి వాస్తవాలను ఇతర పరిశోధనలతో బేరీజు వేసినప్పటికీ అవి ఊహాజనిత వాస్తవాలూ, భయాల ముందు వీగిపోతూ, మితవాద, అతివాద సిద్ధాంతాల వారిని కూడా ఏకం చేస్తున్నాయి. పవిత్ర గ్రీన్‌పీస్, పరమ పవిత్ర స్వదేశీ ఉద్య మకారులనీ లేదా ఆరెస్సెస్ వారినీ కూడా ప్రభావితం చేస్తున్నాయి.
ఉద్యమకారుల భయాలు
వీరి భయాలలో చాలా ముఖ్యమైనది విదేశీ భయం. జన్యుమార్పిడి పంటకు ఉపయోగించే విత్తనాలను దుష్టశక్తులు తయారు చేశాయనీ, పీక్కు తినే బహుళజాతి సంస్థలు పేటెంట్ హక్కులు కలిగి ఉన్నాయనీ, అవి జన్యు పంటల నిల్వల ధరలనూ, సరఫరానూ శాసిస్తాయనీ, పేద దేశాల రైతులను బానిసలుగా మార్చుకుంటాయనీ ఉద్యమకారులకు భయాలు ఉన్నాయి. కానీ ఈ ఆవాలు మాత్రం పూర్తిగా ప్రభుత్వ నిర్వహణలోని ఒక ప్రయోగశాలలో తయారై, దాని అధీనంలోనే ఉన్నాయి. ఈ ప్రయోగశాలకు ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా నిధులు అందిస్తున్నాయి. రాజీవ్‌గాంధీ జాతీయ విత్తన సంస్థకు నిధులు అందిస్తున్న డాక్టర్ వర్ఘీస్ కురియన్ జాతీయ పాడి పరిశ్ర మాభివృద్ధి బోర్డు కూడా అలా నిధులు అందిస్తున్న సంస్థలలో ఒకటి. భారతదేశంలో వంటనూనెల కొరత ఉంది. ఏటా పెద్ద ఎత్తును దిగుమతులు కూడా జరుగుతాయి. దేశంలో చమురు గింజల పంటలలో ఆవ పంటది మూడో స్థానం. దీని ఉత్పత్తి ఇప్పుడు 25 నుంచి 30 శాతం పెరగబోతోంది. 1987లో దీపక్ పెంతాల్ అనే ఆ యువ శాస్త్రవేత్త ఈ ప్రయోగశాలను ప్రారం భించినప్పుడు కురియన్ కన్న కల కూడా అదే (ప్రొఫెసర్ పెంతాల్ నేను చండీగడ్‌లోని పంజాబ్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థులం. ఆయన నాకంటే కొన్నేళ్లు ముందు చేరినా ఒకే విద్యార్థి వసతిగృహంలో ఉండేవాళ్లం).
పరిశోధన క్రమం
ప్రొఫెసర్ పెంతాల్ వృక్షశాస్త్రజ్ఞుడు. రట్జర్స్ నుంచి పీహెచ్. డీ. పట్టా తీసుకున్నారు. ఈ పరిశోధన చేస్తున్నప్పుడు, తరువాత పోలండ్‌లో కొద్ది కాలం బోధనావృత్తిలో ఉన్నప్పుడు ఆయన ఆవాల పరిశోధన మీద మమ కారం పెంచుకున్నారు. ఒక పోలండ్ రకంతో, భారతీయ రకం విత్తనంతో సాధారణ సంకరీకరణ తీరులో పరపరాగ సంపర్కం గావించడానికి (క్రాస్ పోలినేషన్) జరిగిన పరిశోధనలో ఆయన పనిచేశారు. నిజానికి అది సాధ్యం కాని సంగతి. ఆవపువ్వు లక్షణమే అందుకు కారణం. దీనిని వృక్షశాస్త్రజ్ఞులు హెర్మాఫ్రోడైట్ అని పిలుస్తారు. స్త్రీపురుషాంగాలు రెండూ ఈ పువ్వులోనే ఉంటాయి. అంటే వేరే జాతి వీర్యాన్ని ప్రవేశపెట్టడానికే ముందే తానే స్వయంగా ఫలదీకరణం చెందుతుంది.
అయితే ఏమైంది? అని ఆలోచించారా యన. అందులోని పురుష లక్షణాన్ని పరిపూర్ణంగా నిర్మూలిస్తే సరిపోతుందని అందుకు మార్గం కనిపెట్టారు (ఇక్కడ నేను కావాలనే పారిభాషిక పదాలను వదిలి, సాధారణ భాషను ప్రయోగిస్తున్నాను). అలా ఆయన ఒక స్త్రీరకంతో వేరేదానితో పరపరాగ సంపర్కం చేయించారు. నిజానికి అప్పటికి జెనెటికల్ ఇంజనీరింగ్ అనేది చాలా కొత్త అంశం. ప్రొఫెసర్ పెంతాల్, ఆయన కీలక అనుయాయులు దీనిని ఒక సవాలుగా తీసుకున్నారు. బర్నేస్, బారస్టర్, బార్ అనే మూడు కొత్త జన్యువులను దేశీయమైన మన ఆవ రకంలో ప్రవేశ పెట్టారు. మొదటి రెండు రకాలు సాధారణ నేల బాక్టెరియం నుంచి వచ్చాయి. మూడో జన్యువు స్ట్రెప్టోమైస్ అనే జాతికి చెందినది. ఇవన్నీ కూడా నిరపాయకరమైనవే (లేదా నాన్ పేథోజనిక్). నిజానికి ఆవలో 85,000 జన్యువులు ఉంటాయి.
పెంతాల్ బృందం కృషి
ప్రొఫెసర్ పెంతాల్ బృందంలోని శాస్త్రవేత్తలంతా వారి యవ్వన ప్రాయం నుంచి వృద్ధాప్యం వరకు కలసికట్టుగానే పనిచేశారు. అనేక పత్రిక లలో నలభైకి పైగా పరిశోధన పత్రాలను ప్రచురించారు. అనేక మంది యువతీ యువకుల చేత పరిశోధనలు చేయించారు. అందరికీ చాలామంది అవకాశాలు వచ్చాయి. ప్రొఫెసర్ పెంతాల్ ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పదవికి ఎంపికయ్యారు. అయినప్పటికీ ఆయన ఎన్నడూ తన ప్రయోగశాలను విడిచిపెట్టలేదు. పైగా వీసీ పదవీకాలం ముగియగానే మళ్లీ పూర్తి సమయం ఆ ప్రయోగశాలకే కేటాయించారు. అయితే గడచిన దశా బ్దాలుగా దేశీయమైన మన విజ్ఞానశాస్త్రంలో సంభవించిన పతనానికీ, ప్రతిభకు పట్టిన దుస్థితికీ, మన పరతంత్రతకీ మనమంతా సామూహికంగా సంతాపం ప్రకటించాలి. అతి పెద్ద సమస్య ఏమిటంటే, మన శాస్త్రవేత్తలు ఏదైనా ఉన్నతోద్యోగంలోకి ప్రవేశిస్తే వెంటనే పరిశోధనకు మంగళం పాడడమేనని అంటారు ప్రొఫెసర్ పెంతాల్. ఇలాంటి వాళ్లనే ఆయన సైన్స్ బ్యూరోక్రాట్స్ అని పిలుస్తారు. ఆయనకి యూపీఎస్సీ సభ్యత్వం కూడా వచ్చింది. ఐదేళ్లపాటు నరకప్రాయంగా ఉండే ఆ పదవిలో చేరకుండా తన ఆవాల పరిశోధనకే పునరంకితమయ్యారు.
భారతీయులంతా రుచిచూసినవారే!
మీరు పండించిన జన్యు మార్పిడి పంటల ద్వారా వచ్చిన ఆవాలను మీరు వినియోగించి, మీ సంతానం కూడా ఉపయోగించేటట్టు చేయగలరా అని మీరు వారిని అడగవచ్చు. తప్పకుండా అని వారు చెబుతారు. వాటికి అనుమతి వచ్చినప్పటి నుంచి తమ కుటుంబాలు వినియోగిస్తున్నాయనీ చెబుతారు. వాటిలోని విషపు లక్షణాలు, ఎలర్జీ లక్షణాల గురించి జరిగిన అధ్యాయాలన్నీ కూడా ఆ ఆవాలు నిరపాయకరమనే చెప్పాయి. ప్రపంచ వ్యాప్తంగా జన్యుమార్పిడి పంటల ఉత్పత్తులతో చేసిన కోట్లాది వంటకాలను ప్రజలు ఆరగిస్తున్నారు. నిజానికి వీటిని తీసుకోవడం వల్ల హాని జరగదని హామీ ఇచ్చే ఎలాంటి పత్రాలు లేకుండానే వారంతా ఆ ఆహారాన్ని విని యోగిస్తున్నారు.
అలా ఆమోదం పొందిన మొదటి జన్యుమార్పిడి ఆవ పంట పేరు కానోలా. కెనడాలో 1996లో రూపొందించిన జన్యుమార్పిడి ఆవ గింజలవి. వాటినే ఏటా భారతదేశం దాదాపు నాలుగు లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటుంది. వీటి గురించి ఎలాంటి ఫిర్యాదు లేదు. సోయాబీన్ ఉన్న వంటనూనెలు, వనస్పతి కూడా అంతకంటే ఎక్కువ దిగుమతి అవుతున్నాయి. వీటికి మూలం జన్యుమార్పిడి పంటలే. ఇప్పుడు మన పత్తి విత్తనం కూడా జన్యుమార్పిడి పంట నుంచి వచ్చినదే, లేదా బీటీ కాటన్. ప్రతి భారతీయుడు ఇప్పుడు జన్యుమార్పిడి వంటనూనెలు తీసుకుంటున్నా డని కచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఎవరూ ప్రతిఘటించడం లేదు. అమెరికా, కెనడా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలలో చాలా భాగం, నిజానికి చైనా కూడా జెనెటిక్ ఇంజనీరింగ్‌ను ఆశ్రయించినవే.
రచయిత:శేఖర్ గుప్తా
twitter@shekargupta