'తమ్ముడైనా..సోదరైనా ఎన్నికల్లో శత్రువే'
'తమ్ముడైనా..సోదరైనా ఎన్నికల్లో శత్రువే'
Published Wed, Mar 26 2014 3:37 PM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM
పాట్నా: ఎన్నికల బరిలో రక్త సంబంధాలకు స్థానం లేదని ఆర్జేడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి స్పష్టం చేశారు. బీహార్ లోని సరన్ లోకసభ నియోజకవర్గంలో తన తమ్ముడు సాధు యాదవ్ ను రబ్రీదేవి ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో రబ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో తమ్ముడు, సోదరి అనే సంబధాలు పక్కన పెట్టాల్సిందే అని అన్నారు. తమ్ముడైనా ఎన్నికల్లో శత్రువేనని ఆమె వ్యాఖ్యానించారు.
ఎన్నికల బరిలో తమ్ముడైనా, సోదరైనా ప్రత్యర్ధిగానే పరిగణిస్తానని ఆమె ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రత్యర్ధులతో ఎలాంటి ఒప్పందాలు ఉండవని, సరన్ ప్రజలు సాధుకు గుణపాఠం చెబుతారని రబ్రీదేవి అన్నారు. వివాదస్పద సిట్టింగ్ ఎంపీ సాధుయాదవ్ సరన్ స్థానం నుంచి పోటి చేయనున్నట్టు ప్రకటన చేశారు.
ఆర్జేడి ప్రచారంలో ఆకర్షణీయమైన నేతగా మారిన కుమారుడు తేజస్వి యాదవ్ తో కలిసి రబ్రీదేవి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన తల్లికి వ్యతిరేకంగా పోటిలో నిలిచి మామ పెద్ద తప్పు చేశారని తేజస్వీ అన్నారు. బావమరిది పోటీలో ఉన్నా గెలుపు రబ్రీదేవిదే అని లాలూ ప్రసాద్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
Advertisement