న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ పార్లమెంట్ హౌస్‌లో గదిని కోల్పోనున్నారా? ప్రస్తుత పరిణామాలను చూస్తే అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్డీఏ వర్కింగ్ చైర్మన్‌గా పదేళ్ల పాటు రూమ్ నం.4లో కార్యకలాపాలు నిర్వహించిన అద్వానీ.. ఇప్పుడు ఆ రూమ్‌ను వినియోగించలేని సంకట స్థితిలో ఉన్నారు. ఇంతకాలం ఆ గది బయట ఉన్న ఆయన నేమ్‌ప్లేట్ ఇపుడు కనిపించకపోవడం, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఎన్డీఏ చైర్మన్‌గా వాజ్‌పేయి పేరుతో పాటు అద్వానీ పేరు ఉన్న బోర్డు కూడా ఆ గది ముందు ఉండేది.
వాజ్‌పేయి అనారోగ్యం బారిన పడడంతో ఆ గదిని అద్వానీ పూర్తిగా వినియోగించుకునేవారు. ప్రస్తుతం ఆయన ఎంపీలు పార్లమెంట్ పనికోసం వినియోగించే పార్టీ పార్లమెంటరీ ఆఫీసులో విశ్రాంతి తీసుకున్నారు. ఆయన బీజేపీ పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌గా ఉన్నా ఆ గదిలోని ప్రధాన కుర్చీలో కూర్చోకుండా పక్కనే ఉన్న సోఫాలో ఆసీనులవ్వడం గమనార్హం. అంతేగాక లోక్‌సభలో ఆయన ఎక్కడ కూర్చోవాలనే దానిపైన కూడా స్పష్టతలేదు.
గురువారం ఉదయం ఆయన రెండో వరుసలో కూర్చోడానికి యత్నించగా.. అక్కడ ఉన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆయనను మొదటి వరుసలో కూర్చోవలసిందిగా కోరారు. ప్రధాని మోడీ పక్క సీటు ఖాళీగా ఉన్నా అక్కడ కూర్చోలేదు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సీటు కోసం వెతుక్కుని 8వ వరుసలో ఆసీనులయ్యారు.
పార్లమెంట్‌లో అద్వానీకి గది లేనట్లేనా?
Published Fri, Jun 6 2014 4:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement