సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ‘భీమ్ ఆర్మీ’ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఏడాది దాటి పోయింది. 2017, మే నెలలో సహరాన్‌పూర్‌లో జరిగిన హింసాకాండకు కారకుడన్న ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేశారు. ఆ నెలలో దళితుల ఇళ్లపై అగ్రవర్ణాల వారు దాడి చేయడంతో మొదలైన ఇరు వర్గాల ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. ఈ సంఘటనలకు సంబంధించి ఇతరులతోపాటు ఆజాద్‌ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
అదే సంవత్సరం నవంబరు నెలలో ఆజాద్ కేసు అలహాబాద్ కోర్టుకు రాగా, ఆజాద్‌పై ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడినవంటూ ఆక్షేపించిన జడ్జీలు ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేశారు. ఆజాద్‌ను బేషరతుగా విడుదల చేయాల్సిన పోలీసులు వెంటనే ఆయనపై భయానకమైన జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించారు. ఎలాంటి చార్జిషీటు, విచారణ లేకుండా ఎవరినైనా ఏడాది పాటు ఈ చట్టం కింద జైలు నిర్బంధంలో ఉంచవచ్చు. ఏడాది కాగానే మళ్లీ అదే చట్టాన్ని మరో ఏడాది పొడిగించవచ్చు. ఈ చట్టం కింద ఉన్న కాస్త భద్రత ఏమిటంటే....ముగ్గురు హైకోర్టు జడ్జీలతో కూడిన సలహా సంఘం ముందు మూడు నెలల నిర్బంధం అనంతరం నిందితుడు అప్పీల్ చేసుకోవచ్చు. మరి ఆజాద్‌కు అలాంటి అవకాశాన్ని కల్పించినదీ, లేనిది తెలియదు.
ఆజాద్‌పై పోలీసులు చేసిన నేరారోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడినంటూ హైకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ మరింత కఠినమైన చట్టాన్ని ప్రయోగించిన పోలీసులు మళ్లీ జడ్జీల ముందు ఆజాద్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తారని అనుకోలేం. హింసాకాండ కేసులోనే అగ్రవర్ణాలకు చెందిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ వారిలో ఒక్కరిపై కూడా ఈ జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించలేదు. వారంతా బెయిల్‌పై బలాదూర్ తిరుగుతున్నారు.
చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కూడా ఈ జాతీయ భద్రతా చట్టం లాంటిదే. ‘బ్యాటిల్ ఆఫ్ బీమా కోరెగావ్ (1818, జనవరి ఒటటవ తేదీన బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి దళిత సైనికులు పేశ్వా బాజీ రావు సేనలను ఓడించారు)’ 200 వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 31, 2017న ఘర్షణలు చెలరేగి ఒకరు మరణించడంతో మహారాష్ట్ర పోలీసులు టాప్ మావోయిస్టులను ‘చట్ట విరుద్ధ కార్యకలాపాలా నిరోధక చట్టం’ కింద అరెస్ట్ చేసింది.
వాస్తవానికి ఆ రోజు దళితులకు అడ్డంపడి గొడవ చేసిందీ కాషాయ దళాలు. కాషాయ జెండాలు ధరించి వారు దాడులు చేయడంతో ఘర్షణ జరిగింది. ఘర్షణ కారణమంటూ ప్రముఖ హిందూత్వ నాయకులు మిలింద్ ఎక్బోటే, సంబాజీ భిడేలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారిపై మాత్రం ఈ చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టాన్ని ప్రయోగించలేదు. ఈ చట్టాన్ని కూడా ఎవరిపైనైనా సరే, ప్రయోగించవచ్చు. ఎలాంటి చార్జిషీట్లు, విచారణ లేకుండా నెలల తరబడి జైళ్ళలో ఉంచవచ్చు.
యూపీలో ఘర్షణలు జరిగినందుకు దళితుల చీఫ్ ఆజాద్‌పై మొదటి చట్టాన్ని ప్రయోగించగా ఇక్కడ మహారాష్ట్రలో దళితుల కోసం పోరాడున్న మావోయిస్టులపై రెండో చట్టాన్ని పోలీసులు ప్రయోగించారు. ఈ రెండు చట్టాల్లో కూడా నిందితులు నేరం చేసినట్లుగా రుజువు చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపైన లేదు. తాము నేరం చేయలేదంటూ నిందితులే రుజువు చేసుకోవాలి. ఇంతటి రాక్షస చట్టాలను ఎత్తివేసేందుకు ఉద్యమాలు రావాలి. కానీ ఆ ఉద్యమాలను కూడా ఈ చట్టాలతోనే అణచివేస్తారేమో!
Comments
Please login to add a commentAdd a comment