వాళ్లు తాజ్‌మహల్ కట్టారు.. మీరు రోడ్లు కూడా వేయలేరా?
న్యూఢిల్లీ: 'ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం లేనికాలంలో మొఘల్ చక్రవర్తులు తాజ్‌మహల్ కట్టారు. కానీ ఇప్పుడు అన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నా.. ప్రపంచ ప్రఖ్యాత ఆ కట్టడం చుట్టూ మీరు సరైన రోడ్డు కూడా నిర్మించలేకపోయారు' అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మండిపడింది. తాజ్‌మహల్ చుట్టు తారు రోడ్డుకు బదులు రాతిఫలకాల రోడ్డు నిర్మించేందుకు అనుమతి కోరుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం వాదనలు విన్నది. 'మొఘళ్లు 17వ శతాబ్దంలో తాపీ, సుత్తె, చేతులతో తాజ్‌మహల్‌ను కట్టారు. కానీ ఆధునిక పరికరాలున్న ప్రభుత్వం సరైన రోడ్డు వేయలేకపోతున్నది' అని కోర్టు వ్యాఖ్యానించింది.
తారు రోడ్డు వేయడం వల్ల వేసవిలో తాజ్‌మహల్ పరిసరాల్లో కాలుష్యం మరింతగా పెరిగిపోతుందని, అదేసమయంలో రాతిఫలకాల రోడ్డు వల్ల కాలుష్యం ప్రభావం ఉండకపోగా.. ఇది 50 ఏళ్లపాటు మన్నుతుందని ఖరగ్‌పూర్ ఐఐటీ పరిశోధనలో తేలిందని యూపీ ప్రభుత్వం కోర్టులో వాదించింది.