చోరీసొత్తుతో తండ్రికి వెండి విగ్రహం
సాక్షి, బెంగళూరు: అతనో దొంగ. కుటుంబంలోని ఇతరులు కూడా చోరులే. జనం సొత్తును కొల్లగొట్టే వృత్తిలో మరింతగా రాణించాలని జ్యోతిష్యుడి సూచనమేరకు.. చోరీ సొత్తుతోనే తండ్రికి విగ్రహం చేయించి పూజిస్తున్నాడు. బెంగళూరు పోలీసులు తెలిపిన వివరాలనుబట్టి..
గుజరాత్‌లోని ఓడెకు చెందిన తలపాడ్ నాగవాన్ అలియాస్ శంకర్ ఓ దొంగ. అతని కుటుంబమంతా చోరవృత్తిలోనే కొనసాగుతోంది. చోరీ సొమ్ముతో శంకర్ తన తండ్రి, అన్నకు ఆలయాలు కట్టించాడు. 100 కిలోల వెండితో తండ్రికి, అరకిలో వెండితో అన్నయ్యది విగ్రహాలను చేయించి పూజలు చేస్తున్నాడు. విషయంకాస్తా పోలీసులకు తెలిసి శంకర్ ను అరెస్టు చేశారు. జోతిష్యుడి సూచన మేరకే తండ్రి, అన్నలకు విగ్రహాలు చేయించానని విచారణలో చెప్పాడా దోంగ.
ఇక వాళ్ల దొంగతనాల స్టైల్ ఎలా ఉంటుందంటే.. శంకర్ కుటుంబ సభ్యులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ కొన్ని నెలల పాటు అద్దె గదుల్లో ఉంటారు. అదను చూసి చోరీలు చేసి సొంత రాష్ట్రం గుజరాత్‌కు వెళ్లిపోతారు. శంకర్ 2007 నుంచి బెంగళూరులోని బనశంకరిలో ఉంటూ నగరవ్యాప్తంగా దొంగతనాలు చేసేవాడు. ఈనెల 3న ఓ ఇంట్లో చోరీ చేస్తూ విజయనగర పోలీసులకు చిక్కాడు. ఒక్క బెంగళూరులోనే రూ.5 కోట్ల విలువచేసే సొత్తు కాజేశానని, చోరీసొమ్ముతోనే తన స్వస్థలంలో ఐదు భవంతులు కూడా కొన్నానని విచారణలో చెప్పాడు.