ఇదే చివరి అవకాశం
సెప్టెంబర్ 30 లోగా అప్రకటిత ఆదాయం వెల్లడించండి
- ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ
- పథకం ముగిశాక ఎలాంటి సాయం చేయలేం
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 30 లోగా బహిర్గతం చేయని ఆదాయ వివరాలు వెల్లడించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు సూచించారు. ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆదివారం ప్రసంగిస్తూ... పథకం ముగిశాక తలెత్తే చిక్కుల నుంచి తప్పించుకునేందుకు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 30 లోగా స్వచ్ఛందంగా ఆదాయం, ఆస్తుల వివరాలు వెల్లడిస్తే... అవి ఎలా వచ్చాయనే వివరాలు అడిగే ప్రశ్నే ఉండదన్నారు. జరిమానా చెల్లించి ఇబ్బందుల నుంచి విముక్తులు కావచ్చని, పారదర్శక వ్యవస్థలో భాగమయ్యేందుకు ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు. ‘సెప్టెంబర్ 30 వరకూ ఈ అవకాశముందని దేశ ప్రజలకు వెల్లడిస్తున్నా.
దీన్ని చివరి అవకాశంగా భావించండి. సెప్టెంబర్ 30 అనంతరం ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే ఎలాంటి సాయమూ అందదని బీజేపీ ఎంపీలకు చెప్పా. ఈ పథకాన్ని మీరు వాడుకుంటే సెప్టెంబర్ 30 అనంతర ఇబ్బందుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. గతంలో ఆదాయ పన్ను నిబంధనలకు భయపడి పన్ను కట్టకుండా తప్పించుకునేవారు. కాలక్రమంలో ప్రభుత్వ నిబంధనల్ని పాటించడం సులభమైంది. ఇప్పుడు కూడా పన్ను చెల్లింపుల నుంచి తప్పించుకోవడం మంచిదని చాలా మంది భావిస్తున్నారు. నిబంధనల్ని పాటించకపోతే మన ప్రశాంతతను కోల్పోతాం. చిన్న వ్యక్తి కూడా ఇబ్బంది పెట్టవచ్చు. మన ఆదాయం, సంపద పైప్రభుత్వానికి సరైన సమాచారం మనంతట మనం ఎందుకివ్వకూడదు?’ అని ప్రశ్నించారు.
50 లక్షల ఆదాయ వర్గం 1.5 లక్షలేనా?
పన్ను కట్టనివారిని దొంగలుగా పరిగణించవద్దని ఇటీవలి ఐటీ, కస్టమ్స్, ఎక్సైజ్ శాఖ అధికారుల భేటీలో కోరానని మోదీ చెప్పారు. ‘ప్రజల్లో నమ్మకం కలిగించాలి. నిబంధనల్ని పాటించే పౌరులుగా మారేందుకు వారికి చేయూత నివ్వాలి. నమ్మకమైన వాతావరణం సృష్టించే క్రమంలో మన విధానాల్ని మార్చుకోవడం చాలా ముఖ్యం. రూ. 50 లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్న 1.25 కోట్ల మందిలో 1.5 లక్షల మందే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని సమావేశంలో చెప్పారు. ఈ విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు. పెద్ద నగరాల్లో రూ.50 లక్షలు మించి ఆదాయం ఉన్న లక్షల మందిని చూడవచ్చు. కఠిన చర్యలు తీసుకోకముందే ప్రభుత్వం ప్రజలకు ఒక అవకాశం ఇస్తుంది. పన్ను చెల్లించని ఆదాయం వెల్లడికి ఇదే బంగారు అవకాశం’ అని అన్నారు.
ప్రజా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తా
ప్రజా భాగస్వామ్యంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమనే ప్రయత్నాన్ని తాను ఎప్పుడూ కొనసాగిస్తున్నానని చెప్పారు. mygov.in/mygovsurvey/ratemygovernment లో వివిధ భాషల్లో ప్రభుత్వ పాలనపై సర్వే కొనసాగుతుందని, మూడు లక్షల మంది ప్రశ్నలకు సమాధానాలిచ్చారని తెలిపారు. ‘మన్ కీ బాత్’లో పలు అంశాలపై మోదీ ప్రసంగించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఊపును సంవత్సరం పాటు కొనసాగించాలని, అది మధుమేహాన్ని నయం చేస్తుందన్నారు. ఇటీవల యుద్ధ విమానాలు నడిపిన ముగ్గురు మహిళల్ని కొనియాడుతూ... మహిళా సాధికారతకు వారొక ఉదాహరణ అన్నారు. ఈ ఏడాది వర్షపాతం బాగుంటుందన్న అంచనాల్ని స్వాగతిస్తున్నానని, దేశ ప్రజలకు ,ముఖ్యంగా రైతులకు ఈ వార్త మంచి ఊరటనిస్తుందని చెప్పారు. ఇటీవల ఇస్రో ప్రయోగించిన 22 ఉపగ్రహాల్లోని రెండింటి తయారీలో పుణే, తమిళనాడు విద్యార్థుల కృషిని ప్రధాని అభినందించారు.
ఎమర్జెన్సీతో దేశంలో అణచివేత
మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ 1975 జూన్ 26 నాటి ఎమర్జెన్సీ ప్రకటనను గుర్తుచేసుకున్నారు. ప్రజాస్వామ్యం ఈ దేశపు బలమని, అది మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ‘మన్ కీ బాత్‌ను కొన్ని సార్లు కొంత మంది వేళాకోళం చేస్తుంటారు. విమర్శిస్తుంటారు కూడా. మనం ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నాం.. అందుకే విమర్శించే స్వేచ్ఛ వారికుంది. ప్రజాస్వామ్యం ప్రతి పౌరుడ్ని సుసంపన్నం చేసింది. 1975లో ఇదే రోజున దేశం అణచివేతకు గురైంది. ప్రజలకున్న అన్ని హక్కుల్ని రద్దు చేశారు. దేశం జైలుగా మారింది. జయప్రకాశ్ నారాయణ్‌తో పాటు లక్షల మంది ప్రజలు, వేలాది మంది రాజకీయ నాయకుల్ని జైళ్లకు పంపారు. మన బలం ప్రజాస్వామ్యం.. ప్రజాబలమే మన బలం. ప్రతి ఒక్క పౌరుడూ బలమే అన్న సంగతుల్ని మరవకూడదు.
ఎమర్జెన్సీలో పత్రికా కార్యాలయాల్ని మూసివేయించారు. ఆ సమయంలో ప్రజలు ప్రజాస్వామ్య శక్తుల బలం ఏంటో మనకు తెలియచేశారు. సామాన్య పౌరుడికున్న ప్రజాస్వామ్య శక్తుల్ని ఎమర్జెన్సీ రోజుల్లో చూశాం. ఇది మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏ దేశానికైనా ప్రజాస్వామ్యమే బలం. ప్రజలు వారి బలాల్ని గ్రహించే మనస్తత్వం కలిగిఉండాలి. ప్రజాస్వామ్యం అంటే ఓటు వేయడం, దేశాన్ని నడిపించేందుకు ఐదేళ్ల ఒప్పందం చేసుకోవడం కాదు. ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో కీలకమే. ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రజా భాగస్వామ్యం.. ప్రజల స్పందన, వాళ్ల అభిప్రాయాలు ఇలా ఎన్నో..’ అని మోదీ వ్యాఖ్యానించారు.